హైదరాబాద్: Hydra Demolish: రెండు కాలనీలకు దూరాన్ని తగ్గించింది. నేరుగా షేక్ పేటకు రావాలనుకున్నా ఇటు నుంచి గోల్కొండ కోటకు చేరాలన్నా దగ్గర దారిని హైడ్రా చూపించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని నెక్నాంపూర్ విలేజీలో హైటెన్షన్ విద్యుత్ తీగల కింద కబ్జాదారులు నిర్మించిన అడ్డుగోడను హైడ్రా తొలగించింది. దీంతో శ్రీ వేంకటేశ్వర కాలనీకి, ఉస్మానియా కాలనీకి మధ్య అనుసంధానం ఏర్పడింది.
ఈ రెండు కాలనీలకు మధ్య ఒక గుట్టలా ఉన్న ప్రాంతాన్ని ఆసరాగా తీసుకుని హైటెన్షన్ విద్యత్ తీగలు పైనుంచి వెళ్తున్నప్పటికీ దిగువ వైపు దాదాపు 800ల గజాలకు పైగా ఉన్న స్థలంలో షెడ్డులు వేసి ఆక్రమించిన వైనాన్ని శ్రీ వేంకటేశ్వరా కాలనీ వాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై శనివారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి వెంటనే ఈ అడ్డుగోడను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
Also Read: CM Revanth Reddy: అందాల పోటీలపై సమీక్ష.. భద్రతపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు ఎవరైతే కబ్జా చేశారో వారి షెడ్డులను తొలగించారు. మధ్యలో అడ్డంగా ఉన్న ప్రహరీని హైడ్రా తొలగించింది. దీంతో శ్రీ వేంకటేశ్వర కాలనీ – ఉస్మానియా కాలనీకి మధ్య 30 అడుగుల రహదారికి ఆటంకాలు తొలిగాయి. ఇరు కాలనీవాసులే కాదు ఆ మార్గంలో సులభంగా చేరుకునే అవకాశం 3 వేల మందికి లభించినట్టయ్యింది.