HYDRAA: ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా శనివారం రెండు బిగ్ భారీ ఆపరేషన్లను నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్ పేట సర్వే నెంబర్ 44లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నది. దీని విలువ రూ.3 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతున్నదని హైడ్రాకు గతంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు గతేడాది డిసెంబర్ 8వ తేదీన 5 ఎకరాల మేర ఉన్న ఆక్రమణలను తొలగించింది. మియాపూర్ – బాచుపల్లి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న 200 మీటర్ల మేరకు ఉన్న 18 షెట్టర్లను కూడా గతంలోనే తొలగించింది. అదే సర్వే నెంబర్ 44లో 15 ఎకరాలను శనివారం స్వాధీనం చేసుకున్నది. రేకులతో హద్దులను నిర్ణయించి ఆక్రమణలకు పాల్పడగా, వాటిని తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. సర్వే నెంబర్ 44లో ప్రభుత్వ భూమిలో అక్రమ రిజిస్ట్రేషన్లతో పాటు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్‌కు సంబంధించిన వార్తల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో హైడ్రా పరిశీలించింది. ఆక్రమణలను నిర్ధారించుకున్నది. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు శనివారం 15 ఎకరాల మేర ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది.
ఒక సర్వే నెంబర్ పత్రాలతో మరో సర్వేలోని భూమి కబ్జా
సర్వే నెంబర్ 159కి సంబంధించిన పత్రాలతో సర్వే నెంబర్ 44లోని ఎకరన్నర భూమిని ఆరుగురు కబ్జా చేసినట్లు అధికారుల విచారణలో బయట పడింది. మియాపూర్ గ్రామానికి చెందిన సోషల్ వర్కర్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ 9వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు(ఎఫ్ఐఆర్ నెంబర్ 59/2026) నమోదు చేశారు. జీ కమల, జీజాబాయి, నాగేందర్, మహ్మద్ సైఫ్ హుస్సేన్ ఖాన్, ఆబేద్ హుస్సేన్, ఎన్ శ్రీకాంత్‌లను నిందితులుగా పేర్కొన్నారు. కానీ, హైడ్రా జారీ చేసిన ప్రకటనలో ఇమ్రాన్ అనే నిందితుడిపై మాత్రమే కేసు నమోదు చేసినట్లు పేర్కొంది.
Also Read: Odisha Plane Crash: ఒడిశాలో కూలిన విమానం.. పైలెట్ సహా 9 మందికి తీవ్ర గాయాలు
అధికారి సస్పెన్షన్‌తో కదిలిన డొంక
సర్వే నెంబర్ 44లోని మక్తా మహబూబ్ పేట గ్రామంలోని ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన(డాక్యుమెంట్ నెంబర్ 14380/2025, తేదీ – 29/09/2025) కేసులో కొద్ది రోజుల క్రితం సబ్ రిజిస్ట్రార్ మదుసూధన్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో ఈ కబ్జా వ్యవహారం డొంక కదిలినట్టయింది. సదరు సబ్ రిజిస్ట్రార్‌పై పీడీ యాక్ట్ కూడా పెట్టాలని ఉన్నతాధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. పీడీ యాక్ట్ పెడితే ఈ వ్యవహారంలో తమ వివరాలన్నీ బయటకు వస్తాయని, కేసు తమ మెడకు కూడా చుట్టుకుంటుందని భావించిన కొందరు ఉన్నతాధికారులు ఉన్నత స్థాయిలో మేనేజ్ చేసి పీడీ యాక్ట్ పెట్టకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా, కబ్జా భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలను కేవలం సస్పెన్షన్‌కే పరిమితం చేయడం చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయల విలువ చేసే సర్కారు భూమి కబ్జా వ్యవహారంలో కొందరు రిటైర్డ్ అధికారులు మధ్యవర్తులుగా వ్యవహరించి రిజిస్ట్రేషన్ చేయించారని, అందుకు ఈ కేసులో పూర్తి విచారణ జరగకుండా ఆ శాఖ అధికారులే అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రాంపూర్‌లో 4 ఎకరాలకు ఫెన్సింగ్
మరోవైపు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామ సర్వే నెంబర్ 388లో జలమండలికి చెందిన 4.01 ఎకరాల భూమిని కూడా హైడ్రా కాపాడింది. జలమండలి అవసరాల మేరకు భూమిని కేటాయించగా, దానిని స్వాధీనం చేసుకోవడంలో స్థానికులు ఇబ్బందులు సృష్టించారు. ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకుని ఆటంకాలు సృష్టించగా, జలమండలి హైడ్రా సహాయాన్ని కోరింది. సంబంధిత శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ భూమి జలమండలికి ప్రభుత్వం కేటాయించినట్టు హైడ్రా నిర్ధారించుకున్నది. ఈ మేరకు శనివారం 4.01 ఎకరాల భూమిని రక్షించి ఫెన్సింగ్ వేసి, జలమండలికి చెందిన భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది.
Also Read: Municipal Elections: మున్సిపల్ పోరుకు ఆశావహులు వ్యూహాలు.. ఉత్కంఠగా మారిన రిజర్వేషన్ల అంశం

