Hyderabad Tragedy( IMAGE credit: swetchas reporter)
హైదరాబాద్

Hyderabad Tragedy: బండ్లగూడలో మరో విషాదం.. గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్​

Hyderabad Tragedy: రామాంతాపూర్​ విషాదాన్ని మరిచిపోక ముందే బండ్లగూడలో మరో ఇద్దరు యువకులు వినాయకుని విగ్రహాన్ని తరలిస్తూ విద్యుత్​ షాక్​‌కు గురై చనిపోయారు. మరో యువకుడు గాయపడ్డాడు. అయితే, ప్రమాదానికి విద్యుత్ షాక్​ కారణం కాదని టీజీఎస్పీడీసీఎల్ ఎండీ చెప్పడం వివాదాస్పదమైంది. స్థానికంగా తీవ్ర విషాదం సృష్టించిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పాతబస్తీ హుస్సేనీఆలం చంద్రికాపూర్​ నివాసి అఖిల్ (23) కొన్నేళ్లుగా స్నేహితులు, బస్తీ వాసులతో కలిసి వినాయక మంటపాన్ని ఏర్పాటు చేస్తూ చవితి వేడుకలు జరుపుతున్నాడు. ఈ సారి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న అఖిల్ లక్ష్మీగూడలో 19 అడుగుల ఎత్తు ఉన్న వినాయకుని విగ్రహాన్ని ఆర్డర్ చేశాడు.

 Also Read: Collectorate: కలెక్టరేట్లో కామాంధుడు…? మద్యం సేవించి.. ఓ చిన్నారి పై?

విగ్రహం తయారైందని ఫోన్​ రావడంతో దానిని చంద్రికాపూర్​ తీసుకురావడానికి స్నేహితులతో కలిసి అర్ధరాత్రి సమయంలో వెళ్లాడు. తనతోపాటు విగ్రహాన్ని తరలించడానికి ట్రాక్టర్ యజమాని అయిన ధోని (19)తోపాటు ఉప్పుగూడలో ఉంటున్న స్నేహితుడు వికాస్​ (21) మరికొందరిని తీసుకెళ్లాడు. లక్ష్మీగూడలోని తయారీ కేంద్రం వద్దకు చేరుకుని పూజలు చేసి విగ్రహాన్ని ట్రాక్టర్‌కు బిగించిన ట్రోచర్​​ పైకి ఎక్కించి చంద్రికాపూర్​‌కు బయల్దేరాడు.

విగ్రహం ఎత్తుగా ఉండడంతో వినాయకుని భుజాలపై చెరో పక్కన వికాస్​, అఖిల్‌ కూర్చుని దానిని పట్టుకోగా ట్రోచర్‌పై మరో ముగ్గురు కూర్చున్నారు. ధోని ట్రాక్టర్ నడుపుతున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 1.30గంటల సమయంలో బండ్లగూడ రాయల్ సీ హోటల్​ వద్దకు రాగానే 33కేవీ హైటెన్షన్​ విద్యుత్ తీగలు విగ్రహం కిరీటం భాగానికి తగిలాయి. దాంతో వికాస్​, అఖిల్‌తోపాటు డ్రైవర్ ధోని విద్యుదాఘాతానికి గురయ్యారు. ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగిసి పడడంతో ట్రోచర్‌పై కూర్చుని ఉన్నవారు కిందకు దూకి పరుగులు పెట్టారు.

సీసీ కెమెరాల్లో చూసి..

పోలీస్ స్టేషన్ లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న బండ్లగూడ పోలీసులు జరిగిన ప్రమాదాన్ని గమనించి నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కరెంట్ షాక్‌కు గురైన అఖిల్, వికాస్​, ధోనిలను ఆసుపత్రికి తర​లించారు. అక్కడ పరీక్షలు జరిపిన వైద్యులు వారిద్దరూ అప్పటికే మరణంచినట్టుగా నిర్ధారించారు. అఖిల్‌ను ఒవైసీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సతో అతను కోలుకోవడంతో మంగళవారం సాయంత్రం డిశ్చార్జ్ చేశారు.

కరెంట్ షాక్​ కారణం కాదా?

ప్రమాదం గురించి తెలిసి టీజీఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్​, రాజేంద్రనగర్ ఎస్​ఈ శ్రీరాం మోహన్ తదితరులు ప్రమాద స్థలానికి వచ్చారు. మీడియాతో మాట్లాడిన ముషారఫ్​ విద్యుత్ షాక్ కారణంగా ఈ ప్రమాదం జరగలేదని చెప్పారు. హైటెన్షన్​ తీగలను పైకి ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు నిప్పురవ్వలు ఎగిసిపడడంతో వికాస్​, అఖిల్‌ పైనుంచి కిందకు దూకారన్నారు. దాంతో తీవ్రంగా గాయపడ్డ వికాస్ చనిపోయాడని చెప్పారు. ట్రాక్టర్ నడుపుతున్న ధోని ఎలా మరణించాడన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. రామాంతాపూర్ విషాదాన్ని మరిచిపోక ముందే ఈ ప్రమాదం జరగడంతో విమర్శలు వెల్లువెత్తుతాయనే ముషారఫ్ ఇలా చెప్పారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జరిగిన సంఘటనపై బండ్లగూడ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాగ్​ అంబర్​ పేటలో..

మరోవైపు, బాగ్ అంబర్ పేటలో మరో విషాదం జరిగింది. వినాయక మంటపాన్ని ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్​ తగిలి రామ్​ చరణ్ అనే యువకుడు చనిపోయాడు. మృతుని స్నేహితులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బాగ్​ అంబర్ పేట ప్రాంతంలో ప్రతీసారిలానే చవితి వేడుకలు నిర్వహించటానికి సోమవారం అర్ధరాత్రి మంటపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమయంలో రామ్​ చరణ్​ అనే యువకుడు అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను కర్ర సహాయంతో పైకి ఎత్తే ప్రయత్నం చేస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తర​లించారు. అక్కడ చికిత్స పొందుతూ రామ్​ చరణ్​ తుదిశ్వాస వదిలాడు.

 Also Read: Khammam District: ఖమ్మం జిల్లాలో మంత్రి పీఏ ఆగడాలు.. ప్రజలు ఇబ్బందులు

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్