Hyderabad Crime: మెట్రో స్టేషన్ సమీపాన అడ్డాగా మార్చుకున్నారు. ఏకంగా డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ ముఠా అతకట్టించేందుకు పోలీసులు వేసిన ప్లాన్ సఫలమైంది. ఎట్టకేలకు వీరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, గంజాయి మాటెత్తితే చాలు.. పోలీసులు అక్కడ మాటేస్తున్నారు.
వేర్వేరు చోట్ల డ్రగ్స్.. గంజాయి అమ్మతున్న అయిదుగురిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితుల నుంచి ఎంవీఎంఏ డ్రగ్ తోపాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నాయి. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వీ.బీ.కమలాసన్ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇవే.
ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో కొందరు డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నట్టుగా సమాచారం అందటంతో ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బీ టీం సీఐ భిక్షారెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. షేక్ మహ్మద్ రహీం, మహ్మద్ ఫక్రుద్దీన్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 2.78 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియాకు చెందిన సఫాన్, బెంగళూరు నివాసి ఇబ్రహీం జహీర్ లు వీరికి ఎండీఎంఏ డ్రగ్ ను సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడి కావటంతో వారిద్దరిపై కూడా కేసులు పెట్టారు. పరారీలో ఉన్న వీరి కోసం గాలిస్తున్నారు.
Also Read: CM Revanth on KCR: రాజకీయ కక్ష సాధింపు మీదా? మాదా?.. సీఎం రేవంత్ ఫైర్
గంజాయి సీజ్…
ఇక, లోయర్ ధూల్ పేట ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు సమాచారం తెలియటంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బీ టీం సీఐ భిక్షారెడ్డి సిబ్బందితో కలిసి దాడులు జరిపారు. కునాల్ సింగ్, వినోద్ సింగ్, హేమా బాయిలను అరెస్ట్ చేసి వారి నుంచి 1.302 కిలోల గంజాయిపాటు నాలుగు సెల్ ఫోన్లు, యాక్టీవా బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అమ్మకాలతో అనికేష్ సింగ్, ఆర్తి బాయి, నరేన్, గణేశ్ సింగ్ లకు కూడా సంబంధం ఉన్నట్లు తేలటంతో వారిపై కూడా కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడుల్లో ఎస్సైలు బాలరాజు, సంధ్య, కానిస్టేబుళ్లు యాదగిరి, హనీఫ్, నితిన్, మహేశ్వర్, కౌషిక్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.