local body MLC elections: హైదరాబాద్ లో రాజకీయ వేడి రాజుకుంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఎన్నికలపై పడింది. ఈ ఎన్నికలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరంగా ఉండగా.. బీజేపీ, ఎంఐఎం పార్టీలు మాత్రం ఒకదానితో ఒకటి ఢీకొట్టబోతున్నాయి. సహజంగానే విమర్శలు, ప్రతి విమర్శలతో నిత్యం పొలిటికల్ వార్ చేసే ఆ పార్టీలు.. ఎమ్మెల్సీ స్థానం కోసం ఢీకొడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో నగరంలో కొత్త బ్యానర్లు ప్రత్యక్షం కావడం పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచింది.
బ్యానర్లలో ఏముందంటే!
హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, కార్పోరేటర్లు ఓటర్లుగా ఉంటారు. వారే తమకు నచ్చిన ఎమ్మెల్సీకి ఓటు వేస్తారు. ఈ క్రమంలో వినూత్న ప్రచారానికి తెరలేపిన బీజేపీ సానుభూతిపరులు.. జై హిందుత్వ పేరుతో నగర వ్యాప్తంగా బ్యానర్లను ఏర్పాటు చేసింది. తమ దేవీదేవతలను హేళన చేస్తూ కించపరుస్తున్న MIM పార్టీకి ఓటు వేయవద్దని సూచించారు. MIMకి మద్దతిచ్చే అధిష్టానం ముఖ్యమా.. మీకు ఓటు వేసి గెలిపించిన హిందువులు ముఖ్యమా అంటూ కార్పోరేటర్లను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని కూడళ్లలో ఈ బ్యానర్లు ఏర్పాటు చేయడం ఆసక్తి రేపుతోంది.
– హిందువులను కించపరిచే ఎంఐఎం పార్టీకి తొత్తులుగా వ్యవహరించవద్దని బీఆర్ఎస్ – కాంగ్రెస్ కార్పొరేటర్లకు హిందువుల హితవు
– ఎంఐఎం అడుగులకు మడుగులొత్తే అధిష్టానం ముఖ్యమా, ఓట్లు వేసి గెలిపించిన హిందువులు ముఖ్యమా అని నిలదీస్తున్న హిందువులు
– మేలుకోండి బీఆర్ఎస్ – కాంగ్రెస్ కార్పొరేటర్లారా!… pic.twitter.com/mbxrucXX4U— BJP Telangana (@BJP4Telangana) April 21, 2025
మీవి సెక్యులర్ పార్టీలేనా: కిషన్ రెడ్డి
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు సంబంధించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి మాట్లాడారు. అధికార కాంగ్రెస్.. విపక్ష బీఆర్ఎస్ తమ అభ్యర్థులను నిలబెట్టకుండా ఎంఐఎంకు మద్దు తెలిపాయని పేర్కొన్నారు. మజ్లిస్ తో కలిసి పనిచేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఎలా సెక్యులర్ పార్టీలు అవుతాయని నిలదీశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పనిచేస్తున్నట్లు కిషన్ రెడ్డి ఆరోపించారు. హిందు దేవుళ్లు, పండగలను వ్యతిరేకించే వారిని ఎందుకు సమర్థిస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరముందని పేర్కొన్నారు.