తెలంగాణ బ్యూరో,స్వేచ్ఛ:Fraud in Kukatpally: మా సంస్థలో పెట్టుబడులు పెట్టండి…ఊహించని లాభాలు సొంతం చేసుకోండంటూ పలువురిని ఉచ్ఛులోకి లాగి 12కోట్ల రూపాయలు దండుకున్న నిందితులను సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు అరెస్ట్ చేశారు. డీసీపీ కే.ప్రసాద్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
తూర్పు గోదావరి జిల్లాకు చెంది ప్రస్తుతం జగద్గిరిగుట్టలో ఉంటున్న ఏ.వెంకటేశ్, బాపట్ల జిల్లాకు చెందిన శేరిలింగంపల్లిలో నివాసముంటున్న ఎం.వంశీకృష్ణ స్నేహితులు. తేలికగా డబ్బు సంపాదించటానికి జనాన్ని మోసం చేయాలని పథకం వేసుకున్న ఈ ఇద్దరు కూకట్ పల్లి సర్దార్ నగర్లో వియ్ ఓన్ ఇన్ ఫ్రా గ్రూప్స్ పేర సంస్థను ప్రారంభించారు.
ఆ తరువాత తమ సంస్థలో 5లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ప్రతీనెలా 20వేల రూపాయల చొప్పున 25 నెలలపాటు డబ్బు చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నారు. 25నెలలు గడిచిన తరువాత డిపాజిట్ గా పెట్టిన 5లక్షల రూపాయలను కూడా వాపసు చేస్తామన్నారు.
అవతలి వారి నమ్మకాన్ని సంపాదించటానికి డిపాజిట్ చేసిన వారి పేర ఒక గుంట వ్యవసాయ భూమిని రిజిష్టర్ చేయటంతోపాటు పోస్ట్ డేటెడ్ చెక్కులిస్తామన్నారు. ఇక, లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే 36 నెలలపాటు నెలకు 6వేల చొప్పున ఇస్తామన్నారు.
36 నెలలు గడిచిన తరువాత డిపాజిట్ గా పెట్టిన లక్ష రూపాయలను కూడా తిరిగి ఇస్తామన్నారు. ఇది నమ్మిన 90మంది నిందితుల కంపెనీలో 12కోట్ల రూపాయలను డిపాజిట్లుగా పెట్టారు. మొదట్లో కొంతమందికి నాలుగైదు నెలలు చెప్పినట్టుగా డబ్బు ఇస్తూ వచ్చిన నిందితులు ఆ తరువాత మానేశారు.
ఫోన్లు కూడా స్విచాఫ్ చేసి పెట్టుకున్నారు. దాంతో పటాన్ చెరుకు చెందిన ముత్యాల గోపాల్ సైబరాబాద్ ఎకనామిక్ వింగ్ ఇన్స్ పెక్టర్ కే.వీ.సుబ్బారావుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐ సుబ్బారావు నిందితులైన వెంకటేశ్, వంశీకృష్ణలను అరెస్ట్ చేశారు.