Hydra: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులైన చెరువులు, కుంటలను కాపాడడంలో హైడ్రా సంస్థ అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది. మొన్న బతుకమ్మ కుంట, నిన్న మరో చెరువును పునరుద్ధరించిన హైడ్రా, ఇప్పుడు తాజాగా కూకట్‌పల్లిలోని నల్ల చెరువుకు జీవం పోసింది. ఆక్రమణలు, నిర్మాణ వ్యర్థాలతో మురికి కూపంగా మారిన ఈ చెరువు, కేవలం ఆరు నెలల్లోనే సర్వాంగ సుందరంగా, ఆహ్లాదకరమైన జలాశయంగా రూపుదిద్దుకుంది. ఈ నెలాఖరుకల్లా చెరువును పూర్తి స్థాయిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Also Read: Hydra: మణికొండ మున్సిపాలిటీలో హైడ్రా యాక్షన్.. 300ల కోట్ల విలువైన భూమి సేవ్
వాకింగ్ ట్రాక్, ప్లే ఏరియాలకు కసరత్తు
దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను, నిర్మాణ వ్యర్థాలను పూర్తిగా తొలగించడంతో చెరువు లోతు ఏకంగా 4 మీటర్లు పెరిగింది. వర్షపు నీటితో ఇప్పుడు చెరువు నిండు కుండలా మారింది. 16 ఎకరాలకు పరిమితమైన చెరువును రెవెన్యూ రికార్డుల ఆధారంగా 30 ఎకరాలకు విస్తరించి హైడ్రా రికవరీ చేసింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్‌లను కూడా హైడ్రా తొలగించింది. మురుగునీరు కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం 6 నెలల్లోనే 30 ఎకరాల మేర చెరువు సిద్ధమైందని రంగనాథ్ తెలిపారు.
ఆరు నెలల్లోనే..
చెరువు అభివృద్ధి పనులను కమిషనర్ ఆదివారం పరిశీలించారు. ఒకప్పుడు ఎలా ఉండేది, నేడు ఎలా అభివృద్ధి చెందింది అనేది చూడాలనుకుంటే కూకట్‌పల్లి నల్ల చెరువును సందర్శించాలని హైడ్రా నగర ప్రజలను ఆహ్వానిస్తోంది. చెరువు రూపురేఖలు మారిపోయి, ఇటీవల కురిసిన వర్షాలకు నిండుకుండలా మారడం చూసి స్థానికులే ఆశ్చర్యపడ్డారు. ఇదిప్పుడు బోటు షికారుకు చిరునామాగా మారింది. వారాంతాల్లో ఇది పెద్ద పిక్నిక్ స్పాట్‌లా మారిందని, ఉదయం సాయంత్రం వందలాది మంది ఇక్కడకు చేరుకుని సేదదీరుతున్నారని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెడిసినల్ ప్లాంట్స్
చెరువు అభివృద్ధిని పరిశీలించిన రంగనాథ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, ఎక్కడా కూడా ట్రాక్‌కు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. సీసీ టీవీ కెమేరాలు ఏర్పాటు చేసి భద్రతను పటిష్టం చేయాలన్నారు. చిన్నారులు ఆడుకునేందుకు ఒకటి కంటే ఎక్కువ ప్లే ఏరియాలు, పెద్దవాళ్లు సేద దీరేలా గజబో (విశ్రాంతి మందిరం)లు, బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువు చుట్టూ మెడిసినల్ ప్లాంట్స్ నాటాలని, ఇక్కడికి వస్తే ఆరోగ్యం ప్రసాదించేలా వాతావరణం ఉండాలని కమిషనర్ ఆకాంక్షించారు. బతుకమ్మ ఆటలకు ప్రత్యేకంగా వేదికను, బతుకమ్మలను గంగలో కలపడానికి చిన్న కుంటను అందుబాటులోకి తెస్తున్నారు.
స్థానికుల అభిప్రాయాలు
కిరణ్: కూకట్‌పల్లి నల్ల చెరవును ఇలా అభివృద్ధి చేస్తారని తాము ఊహించలేదు. కబ్జాల చెర నుంచి బయటపడింది. హైడ్రా పని తనానికి ఈ చెరువే నిదర్శనంగా నిలిచింది. పెద్ద ఓబులేసు: దొమలతో దుర్గంధంగా ఉండే ఈ ప్రాంతం ఆహ్లాదంగా మారింది. ఇంట్లోంచి బయటపడితే నేరుగా ఇక్కడికి వచ్చేస్తున్నాం. హైడ్రా ఈ కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా చేసింది.రామచంద్ర రావు: భావితరాలకు నల్ల చెరువు ఒక బహుమతి. చెరువును చాలా బాగా తీర్చిదిద్దారు. ఈ ప్రాంతానికి ఇది పిక్నిక్ స్పాట్‌లా తీర్చిదిద్దాలని హైడ్రాను కోరుతున్నాం.
Also Read: Hydra: రూ. 30 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
