Dilsukhnagar Bomb Blast: అదొక రద్దీగా ఉండే మార్కెట్. ఒక్కసారిగా బాంబు పేలుళ్లు. ఏమి జరిగిందో తెలియని పరిస్థితి. ఒక్కసారి పేలిన బాంబులతో నగరం అట్టుడికింది. బాంబు పేలుడితో ప్రజల ఉరుకులు పరుగులు.. కొందరు రక్తపుమడుగులో.. మరికొందరు క్షణకాలంలో ప్రాణాలు వదిలే పరిస్థితి.
ఎటు చూసినా కాపాడండి అంటూ ఆర్తనాదాలు.. బిగ్గరగా కేకలు.. ప్రాణం పోతుందన్న భయం కొందరిలో.. అప్పుడే అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. ఎన్నో ప్రాణాలను కాపాడింది. ఉరుకులు, పరుగులతో ప్రాణ నష్టం జరగకుండా అన్నీ చర్యలు తీసుకున్నా, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.
మొత్తం 17 మంది బాంబు దాడిలో ప్రాణాలు వదిలారు. 150 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంతటి విషాదాన్ని నింపిన విషాద ఘటన మనందరికీ గుర్తుండే ఉంటుంది. అదే హైదరాబాద్ నగరం దిల్ సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసు.
హైదరాబాద్ నగరంలోని దిల్ సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసు గురించి అనుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ముష్కరులు చేసిన పనికి, ఎందరో సామాన్య ప్రజానీకం ప్రాణాలు కోల్పోయారు. కొందరు క్షతగాత్రులుగా మిగిలారు. ఈ బాంబ్ బ్లాస్ట్ 2013 ఫిబ్రవరి 21 న దిల్ సుఖ్ నగర్ లో జరిగింది.
జంట బాంబ్ పేలుళ్ళు.. ఒక్కసారిగా మోత మోగించగా, ఎన్నో ఆర్తనాదాలు వినిపించిన రోజు అది. అయితే ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారో తేల్చి చెప్పింది ఎన్ఐఏ. బాంబ్ బ్లాస్ట్ జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఎన్ఐఏ, కీలక ఆధారాలను సేకరించింది. ఈ బాంబ్ పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ గా ఎన్ఐఏ గుర్తించింది.
నిత్యం రద్దీగా ఉండే దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో బాంబు దాడి జరగడంతో ఎన్ఐఏ కేసును కీలకంగా భావించి దర్యాప్తును వేగంగా సాగించింది. ఎందరో ప్రత్యక్ష సాక్షుల ద్వారా ఆధారాలు సేకరించింది. ఈ కేసు లో యాసిన్ భత్కల్ కీలక సూత్రధారి గా ఎన్ఐఏ తేల్చింది. ఎన్ఐఏ స్పెషల్ కోర్టు విచారణ వేగవంతం చేయగా, ఇప్పటికే ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది.
నిందితులు.. ఏ-1 గా అసదుల్లాహ అక్తర్, ఏ-2 యాసిన్ భక్తల్, ఏ-3 తహసిన్ అక్తర్, ఏ-4 గా జియావుర్ రెహ్మాన్, ఏ5 గా ఎజాక్ షాయిక్ వీరే కాగా, వీరు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో వాదనలు ముగియడంతో, నేడు తుది తీర్పును న్యాయస్థానం వెలువరించింది.
సంచలన తీర్పు..
దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసుకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. గతంలో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించి, నిందితులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఈ దాడుల సూత్రధారుడు రియాజ్ భత్కల్ ఇంకా పరారీలో ఉండగా, అతడికై గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.