Football Stadium: హైదరాబాద్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫుట్ బాల్ స్టేడియం ఏర్పాటు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కల త్వరలోనే నెరవేరనుంది. సీఎం ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు శివారులో ఒకటి, సిటీ సెంటర్ లో మరొక ఫుట్ బాల్ స్టేడియం(Football stadium)లను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు సుమారు డజన్ ప్రాంతాల్లోని స్థలాలను గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు ఎట్టకేలకు రెండు స్టేడియంలకు స్థలాలను ఖరారు చేయటంతో పాటు ప్రస్తుతం వాటి డిజైనింగ్ వంటి వాటిపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఎల్బీనగర్ జోన్, ఖైరతాబాద్ జోన్ల పరిధిలో రెండు ఫుట్ బాల్ స్టేడియంలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దమైనట్లు సమాచారం. మొత్తం రూ. 10 కోట్లతో ఈ రెండు ఫుట్ బాల్ స్టేడియంలను ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.
ప్రతిపాదనలు సిద్ధం
ఎల్బీనగర్ జోన్ పరిధిలోని కాప్రా సర్కిల్ లోని గెలీలియో నగర్ లో సుమారు 2.25 ఎకరాల స్థలంలో దాదాపు రూ. 6 కోట్ల వ్యయంతో, అలాగే సిటీ సెంటర్ లోని ఖైరతాబాద్ జోన్ పరిధిలోని రెడ్ హిల్స్ లో సుమారు 1.25 ఎకరాల స్థలంలో సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ప్రతిపాదనలను ఈ నెల 20న జరిగిన స్టాండింగ్ కమిటీ ముందు అధికారులు పెట్టగా, కమిటీ పరిపాలనపరమైన ఆమోదం ఇచ్చినట్లు సమాచారం. రెడ్ హిల్స్ లో క్రీడల కోసం వినియోగిస్తున్న మైదానాన్ని కూడా ఫుట్ బాల్ స్టేడియంగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ స్టేడియంకు సంబంధించిన సంబంధిత జోన్ నుంచి టెక్నికల్ మంజూరీ కోసం ప్రతిపాదనలు రావల్సి ఉన్నట్లు తెలిసింది. స్టేడియంల కోసం గుర్తించిన ఈ రెండు ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో చక్కటి గ్యాలరీ, ఆకర్షణీయమైన లుక్ తో వీటిని ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఈ రెండు స్టేడియంలను రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలు నిర్వహించేందుకు అనుకూలంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో ఈ రెండు స్టేడియంలకు టెండర్ల ప్రక్రియను చేపట్టే అవకాశమున్నట్లు సమాచారం. తొలుత సిటీ సెంటర్ లో నున్న ఎల్బీ స్టేడియంను ఫుట్ బాల్ స్టేడియంగా మార్చి, ఉప్పల్ స్టేడియంను పర్మినెంట్ గా క్రికెట్ స్టేడియంగా కొనసాగించాలని జీహెచ్ఎంసీ అధికారులు యోచించారు. కానీ అది కుదరకపోవటంతో అధికారులు ఫుట్ బాల్ స్టేడియంలో కోసం చాలా స్థలాలను గుర్తించి ఎట్టకేలకు గెలీలియోనగర్, రెడ్ హిల్స్ లలో గుర్తించిన స్థలాలను స్టేడియం ఏర్పాటుకు ఖరారు చేశారు.
Also Read: Story Writers Decline: తెలుగులో కథా రచయితలు తగ్గిపోతున్నారా.. నాగార్జున చెప్పింది నిజమేనా?
పనులు పూర్తయినా అప్పగించేందుకు అలసత్వం
నగర శివారులోని సౌత్ జోన్ పరిధిలోని కాటేదాన్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ సుమారు రూ. 3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియం పనులు పూర్తయినా ప్రాజెక్టుల విభాగం ఇంజనీర్లు ఈ స్టేడియంను క్రీడా విభాగానికి, ఇంజనీరింగ్ మెయింటనెన్స్ విభాగానికి అప్పగించటంలో తీవ్ర అలసత్వం వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కూకట్ పల్లిలో ఇదివరకు ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చిన మరో స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్ గడువు ముగిసినా, దాన్ని స్వాధీనం చేసుకోవటంలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నట్లు కూడా విమర్శలున్నాయి.
Also Read: Actress Hema: నా కేసు కొట్టేశారు.. పోయిన నా పరువును తీసుకొచ్చిస్తారా?
