Hyderabad Crime: దేశంలోని అతిపెద్ద నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఉద్యోగం, ఉపాధి, చదువు కోసం లక్షలాది మంది నగరానికి వచ్చి జీవిస్తున్నారు. ఊరిలోని సొంతింటిని, బంధువులను వదులుకోని అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. అయితే దీనిని నగరంలోని కొందరు ఇంటి యజమానులు అవకాశంగా మార్చుకుంటున్నారు. అధిక అద్దెను వసూలు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటి యజమాని ఒక అడుగు ముందుకు వేశాడు. ఒక జంట అద్దెకు దిగిన ఇంట్లో ఏకంగా సీక్రెట్ కెమెరాను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన నగరవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ మధురానగర్ లోని జవహర్ నగర్ కాలనీలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తాము ఉంటున్న అద్దె ఇంటి బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా ఉందంటూ ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం ఇంటి యజమాని అశోక్.. ఓ జంటకు ఇల్లును అద్దెకు ఇచ్చాడు. అయితే అక్టోబర్ 4న బాత్రూమ్ లోని బల్బ్ పనిచేయకపోవడంతో వారు యజమానికి తెలియజేశారు.
క్రూరమైన ఆలోచన..
బాత్రూమ్ లో బల్బ్ పనిచేయడం లేదని జంట చెప్పడంతో యజమాని అశోక్ కు క్రూరమైన ఆలోచన వచ్చింది. ఎలాగైన సీక్రెట్ కెమెరా పెట్టి.. వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేయాలని భావించాడు. ఇందుకు అనుగుణంగా ఎలక్ట్రిషియన్ చింటూ సాయం తీసుకున్నాడు. బాత్రూమ్ లో కొత్త బల్బ్, హోల్డర్ ఫిక్స్ చేస్తున్నట్లు నమ్మించి అందులో సీక్రెట్ కెమెరాను ఫిక్స్ చేశారు. తద్వారా వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు.
కెమెరా గుర్తించిన భర్త..
అయితే అక్టోబర్ 13న బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా భర్తకు అనుమానం వచ్చింది. బల్బ్ తెరిచి చూడగా అందులో సీక్రెట్ కెమెరా కనిపించింది. అయితే ఇదంతా ఎలక్ట్రిషియన్ చింటూ చేశాడని తొలుత భావించి ఈ విషయాన్ని యజమాని అశోక్ దృష్టికి తీసుకెళ్లాడు. అయితే అప్పుడు యజమాని ప్రవర్తన జంటకు అనుమానస్పదంగా అనిపించింది. చింటూపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని.. అలా చేస్తే అతడు పగబడతాడని వారిని వారించే ప్రయత్నం చేశాడు. దీంతో సీక్రెట్ కెమెరా వెనుక యజమాని హస్తం కూడా ఉందని అనుమానించిన ఆ జంట.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇంటి యజమాని అశోక్ ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పరారీలో ఉన్న ఎలక్ట్రిషియన్ చింటూ కోసం గాలిస్తున్నారు.
Also Read: Jubilee Hills Bypoll: బీజేపీ స్టార్ తిరిగేనా?.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వారి ప్రచారం కలిసొచ్చేనా?
అద్దె ఇంట్లో జాగ్రత్త..
ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్న వారిలో నూటికి 30-40 శాతం అద్దె ఇళ్లల్లోనే జీవిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా అద్దె ఇంట్లో దిగేముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా ఇంటి యజమాని వ్యవహారశైలి గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఇంటి చుట్టుపక్కల వారిని కూడా వాకబు చేయాలని చెబుతున్నారు. అద్దెకు దిగిన వెంటనే ఇంటిని ఓసారి మెుత్తం క్షుణ్ణంగా పరిశీలించి.. ఏమి లేదని నిర్ధారించుకున్న తర్వాత ఇతర పనులు ప్రారంభించాలని సలహా ఇస్తున్నారు.
