HMDA: హైదరాబాద్ మెట్రోపాలిటీ డవలప్ మెంట్ ఆథారిటీ (HMDA) పరిధి విస్తరించిన రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏ సేవలను మరింత సత్వరంగా అందించే దిశగా కసరత్తు చేస్తుంది. పరిధి పెరగడంతో ప్రజలకు హెచ్ఎండీఏ సేవలను అందించటం కొంత కష్టతరంగా మారటంతో ఆ సమస్యకు చెక్ పెట్టే దిశగా ఇప్పటికే జోనల్ డివిజన్లను తెరపైకి తెచ్చిన హెచ్ఎండీఏ చిన్న చిన్న పనుల కోసం హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ హెడ్ ఆఫీసుకు రావడం, వచ్చిన పనులు కాకపోవడం వంటి సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించటంలో భాగంగా జోనల్ డివిజన్లు రూపకల్పన ఎలా ఉండాలి అన్న అంశంపై ఇప్పటికే ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టు (ఈఓఐ) ప్రక్రియను చేపట్టి, మూడు ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలను కూడా స్వీకరించింది.
భవన నిర్మాణ అనుమతులు, ఇంజినీరింగ్ విభాగం పనుల మంజూరు, ప్లానింగ్ అంశాలు, పరిపాలనపరమైన అంశాల్లో మార్పులతోపాటు అధికార వికేంద్రీకరణ దిశగా ప్రతిపాదనల రూపకల్పనకు కన్సల్టెన్సీని నియమించనుంది. టెక్నాలజీ పరంగా ఎప్పటికపుడు వస్తున్న కొత్త కొత్త మార్పులకు అనుగుణంగా అంతర్గతంగా సేవలను మెరుగుపర్చుకునేందుకు డిజిటల్ గవర్నెన్స్ వంటి కొత్త విభాగాలను ఏర్పాటు చేసే దిశగా కసరత్తును ముమ్మరం చేసింది. ఇందుకు గాను ఇప్పటికే ఈఓఐ(EOI) సమర్పించిన మూడు కన్సల్టెన్సీల్లో ఒక కన్సల్టెన్సినీ ఖరారు చేసేందుకు హెచ్ఎండీఏ సిద్దమైనట్లు తెలిసింది.
అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని
హెచ్ఎండీఏ సేవలను మరింత సత్వరంగా, పారదర్శకంగా అందించేలా అవసరమైన ప్రతిపాదనలను ఈ కన్సల్టెన్సీ రూపకల్పన చేయనున్నట్లు సమాచారం. ఇందుకు కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న డివిజనల్ జోన్లు ఎలా ఉండాలి? అనే అంశాల ఆధారంగా కన్సల్టెన్సీ ప్రతిపాదనలు రూపకల్పన చేనుంది. ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఎండీఏ బిడ్ దాఖలుకు ఈనెల 15వ తేది డెడ్ లైన్ గా విధించింది. హెచ్ఎండీఏ ఆధునిక వ్యవస్థల రూపకల్పన, వాటికి అవసరమైన విధి విధానాలు, పరిపాలనపరమైన అంశాలు, అధికారాలు, అధికార వికేంద్రీకరణ, విభాగాల అంతర్గత వ్యవహారాలు, విధాన పరమైన అంశాలపై సమూలంగా ఆధునిక మార్పులు తెచ్చే విధంగా కన్సల్టెన్సీ ప్రతిపాదనలను సిద్దం చేయనున్నట్లు సమాచారం.
దేశంలోని వివిధ మెట్రోపాలిటన్ ఆథారిటీల నిర్మాణం, అమలు చేస్తున్న ఈ-గవర్నెన్స్, అధికార వికేంద్రీకరణ, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ వంటి విధానాలను సైతం అధ్యయనం చేసి, అధికారులకు ఇప్పటి వరకున్న అధికారాలు, కొత్తగా ఏమైనా అధికారాలు కేటాయించాలా? ఉన్న అధికారాల్లో ఎలాంటి అధికారాలకు కత్తెర పెట్టాలన్నవిషయాన్ని కన్సల్టెన్సీ క్షుణ్ణంగా పరిశీలన చేసి, హెచ్ఎండీఏకు సిఫార్సులు చేస్తూ నివేదికను సమర్పించనుంది.
Also Read: Pharma Hub: ఫార్మా రంగంలో మరో మైలురాయి.. రూ.9 వేల కోట్ల పెట్టు బడులకు అమెరికా కంపెనీ అంగీకారం
ఇదీ హెచ్ఎండీఏ పరిధి
హెచ్ఎండీఏ పరిధిని 10 వేల 472.72చదరపు కిలో మీటర్లకు పెంచూతూ సర్కారు ఇదివరకే నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. హెచ్ఎండీఏలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్ధిపేట్, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి జిల్లాలున్నాయి. కొత్తగా నల్గొండ, వికారాబద్, నాగర్ కర్నూల్ జిల్లాలను సర్కారు చేర్చింది. అయితే ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నుంచి త్రిపుల్ ఆర్ మధ్య ప్రాంతాన్ని అభివ్రుద్ధి చేయాలనే ప్రణాళికతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్(Hyderabad Metropolitan Region) గా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. 1355 రెవెన్యూ గ్రామాల్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 533 గ్రామాలున్నాయి. అత్యల్పంగా నాగర్ కర్నూల్ జిల్లాలో మూడు గ్రామాలున్నాయి. వీటితో పాటు మేడ్చల్-మల్కాజ్ గిరి 163, యాదాద్రి-భువనగిరి 162, సంగారెడ్డి 151, మెదక్ 101, సిద్దిపేట్ 74, హైదరాబాద్ 64, వికారాబాద్ 31, మహాబుబ్ నగర్ 19, నాగర్ కర్నూల్ జిల్లాలోని మూడు గ్రామాలున్నట్లు సర్కారు అధికారికంగా ప్రకటించింది.
అధికార వికేంద్రీకరణపై త్వరలో అభిప్రాయ సేకరణ
హెచ్ఎండీఏలో చేయనున్న మార్పులు, చేర్పులపై కన్సల్టెన్సీ చేసే సిఫార్సులను పరిగణలోకి తీసుకుని హెచ్ఎండీఏ అధికారులు, హెచ్ఓడీలు, ఉద్యోగులు, అర్బన్ ప్లానర్స్, స్వచ్ఛంధ సంస్థలు ఇతర శాఖల అధికారులతో చర్చించడానికి హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా రోజురోజుకి విస్తరిస్తున్న పట్టణీకరణకు అనుకూల ప్రణాళిక, భవన నిర్మాణ అనుమతులు, ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, ల్యాండ్ లీజింగ్, కేటాయింపులు మౌలిక వసతుల ప్రాజెక్టుల పనులు, ఫైనాన్స్, పరిపాలన వ్యవహారాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉంటే ప్రజలకు మెరుగున, పారదర్శకమైన సేవలందుతాయన్న అంశాలపై అభిప్రాయ సేకరణ కూడా చేపట్టాలని హెచ్ఎండీఏ భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు హెచ్ఎండీఏ రూపకల్పన చేస్తున్న మాస్టర్ ప్లాన్ 2050 లో పలు కీలక అంశాలను పొందుపరిచేందుకు, ఇతర విభాగాలతో సమన్వయాన్ని పెంచుకునేందుకు ప్రాజెక్టు మేనేజ్ మెంట్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటు అవసరమని హెచ్ఎండీఏ భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Tejaswini debut: కెమెరా ముందుకు బాలయ్య బాబు చిన్న కూతురు.. అందుకేనా?
