Bathukamma Kunta: పూర్వ వైభవాన్ని సంతరించుకున్న చారిత్రాత్మక బతుకమ్మ కుంట (Bathukamma Kunta) వేదికగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించేందుకు హైడ్రా సర్వం సిద్దం చేసింది. సాయంత్రం ఆరు గంటలకు జరగనున్న ఈ ఉత్సవానికి సీఎం రేవంత్ రెడ్టి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రెండున్నర వేల మంది మహిళలు, స్వయం సహాయక బృందాలకు చెందిన సభ్యులు ఈ ఉత్సవాల్లో భాగంగా తొలుత అయిదు వందల మంది సహజసిద్ధమైన పూలతో పేర్చిన బతుకమ్మలతో ఊరేగింపును నిర్వహించి, కుంటకు చేరుకోనున్నారు. ఆ తర్వాత రెండున్నర వేల మంది సామూహిక బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనున్నట్లు అధికారులు తెలిపారు.
ఒక వేళ వర్షం పడినా జోష్ తగ్గకుండా ఉత్సవాన్ని నిర్వహించేందుకు వీలుగా హైడ్రా, జీహెచ్ఎంసీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసినట్లు తెలిసింది. సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకమైన బతుకమ్మను రెండున్నర వేల మంది ఆడుతుండగా, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గగన తలం నుంచి హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించేలా కూడా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. గతంలో బతుకమ్మ ఆట పాటకు ల్యాండ్ మార్క్ గా నిలిచిన బతుకమ్మ కుంటను దశాబ్దాల తర్వాత పునరుద్దరించుకుని, సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసుకున్న కుంటకు పూర్వవైభవాన్ని సంతరింపజేసేలా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు, మహిళల్లో మరింత జోష్ నింపేందుకు సింగర్ మంగ్లీని కల్చరల్ విభాగం తరపున ఆహ్వానించినట్లు సమాచారం.
రూ.7.40 కోట్లతో పునరుజ్జీవం, సుందరీకరణ
హైదరాబాద్ నగరంలో దశాబ్దాల క్రితం మహిళలు బతుకమ్మ ఆడిన బతుకమ్మ కుంట పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. హైడ్రా కృషి కారణంగా ఇపుడు బతుకమ్మ కుంట రూ 7.40 కోట్లతో సర్వాంగ సుందరంగా తయారైంది. మహిళలే గాక, చిన్నారులు, వాకర్లను ఆకట్టుకునే తరహాలో సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ నెల 26 గురువారం సాయంత్రం గ్రాండ్ ఓపెనింగ్ చేసేందుకు హైడ్రా ఏర్పాట్లు చేసింది. అంబర్‌పేట ప్రజల జీవనంలో ఒక భాగమైన బతుకమ్మ కాలక్రమేణ ఆక్రమణలకు గురై, నీరు కరువై, చెత్తాచెదారంతో నిండిపోయిన బతుకమ్మను హైడ్రా పునరుద్దరించింది.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని సర్కారు కృషి
సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలు, నాలాలను కాపాడేందుకు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్ వ్యవహారిస్తున్న హైడ్రా ఆశించిన స్థాయిలో పని చేయటంతో పాటు నాటి బతుకమ్మను పునరుద్ధరించటంతో అంబర్ పేట వాసులు ఒకింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని సర్కారు కృషి కారణంగా బతుకమ్మకుంటకు పూర్వవైభవం వచ్చింది. ఆడపడుచులు సంబురంగా జరుపుకొనే బతుకమ్మ ఉత్సవాలకు బతుకమ్మకుంట మళ్లీ వేదికకానుంది. దీంతో అంబర్‌పేటకు కొత్త శోభ సంతరించుకుంది. ఈ ఏడాది బతుకమ్మకుంట వద్ద బతుకమ్మ ఉత్సవాలు ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పనితీరులో చిత్తశుద్ధి, ఆచరణలో నిబద్ధత ఉంటే పాతాళంలో ఉన్న గంగను పైకి తీసుకురావచ్చని సర్కారు నిరూపించింది. ఇందుకు అంబర్‌పేటలో మన కళ్ల ముందున్న బతుకమ్మకుంటనే నిదర్శనంగా చెప్పవచ్చు.
సరి కొత్త శోభను సంతరింపజేసిన హైడ్రా
ఎన్నో ఏళ్లుగా న్యాయపరమైన చిక్కులు, ఆక్రమణలతో రూపు కోల్పోయిన బతుకమ్మకుంటకు పూర్వ వైభవం తీసుకురావడంలో హైడ్రా ప్రధాన భూమిక పోషించింది. ఆక్రమణల తొలగింపు, ఆస్తుల పరిరక్షణ లక్ష్యాలతో పనిచేస్తున్న హైడ్రా వల్ల యావత్తు తెలంగాణ రాష్ట్రానికే ఎంతో ప్రయోజనం ఉందనడానికి బతుకమ్మకుంటే ఓ నిదర్శనమ్న అభిప్రాయాలున్నాయి. 5 ఎకరాల 12 గుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులోని పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని పూర్తిగా తొలగించి, పూడికతీత పనులు చేపట్టడంతో ఉబికివచ్చిన జలాలు, వర్షపు నీటితో చెరువులో జలకల సంతరించుకుంది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పిల్లల ప్లేఎక్విప్‌మెంట్ నిర్మించడంతో ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి రావటం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
1962–63 లెక్కల ప్రకారం ఇక్కడ 14 ఎకరాల 6 గుంటల్లో బతుకమ్మ కుంట ఉండగా, అప్పట్లో బఫర్ జోన్ తో కలిపి 16 ఎకరాల13 గుంటలు ఉండేదని రికార్డులు చెబుతున్నాయి. క్రమంగా ఆక్రమణలకు గురికాగా, తాజాగా హైడ్రా నిర్వహించిన సర్వే ప్రకారం 5 ఎకరాల 15 గుంటలున్నట్లు గుర్తించి, ఈ స్థలంలో చెరువుని అభివృద్ధి చేసింది. 26న బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించి, బతుకమ్మ కుంట గ్రాండ్ ఓపెనింగ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. హాలు చేస్తుంది.