Heavy Inflow: గ్రేటర్ హైదరాబాద్ మహానగరవాసుల దాహర్తిని తీర్చే జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, చేవెళ్ల, శంకర్ పల్లి ప్రాంతాల నుంచి వరద పోటెత్తింది. భారీగా వరద నీరు చేరుతూ జంట జలాశయాలు నీటి మట్టాలు గరిష్ట స్థాయికి పెరిగాయి. ఎప్పటికపుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న జలమండలి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తుండంతో మళ్లీ మూసీ నది ఉద్దృతంగా ప్రవహిస్తుంది. రెండు జలాశయాలకు చెందిన గేట్లను ఎత్తి దిగువకు భారీగా నీటిని వదులుతున్నారు. సాయంత్రం కల్లా రెండు జలాశయాల 10 గేట్లు ఎత్తి, దాదాపు 6 వేల 203 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు (3900 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 1789 (3670 టీఎంసీలకు) చేరింది.
Also Read: Heavy Inflow: ఎగువ నుంచి పోటెత్తుతున్న వరద
ఔట్ ఫ్లో 2240 క్యూ సెక్కులు
ఇన్ ఫ్లో 3400 క్యూ సెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2240 క్యూ సెక్కులుగా ఉంది. అలాగే హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం సుమారు 1763.50 అడుగులు (2970 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 1762.55 అడుగులు(2650 టీఎంసీ)గా ఉండగా, ఇన్ ఫ్లోగా 5600 క్యూసెక్కులు కాగా, రిజర్వాయర్ నాలుగు గేట్లను అయిదు అడుగుల ఎత్తు మేరకు ఎత్తి దిగువకు 3963 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. రెండు జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. రెండు జలాశయాల నుంచి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
బ్రిడ్జి వద్ద మూసీ నది ఉద్దృతం
ప్రస్తుతం చాదర్ ఘాట్, మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ నది ఉద్దృతంగా ప్రవహిస్తుండటంతో వరద ప్రభావాన్ని అధికారులు అంఛనా వేస్తున్నారు. జలాశయాలకు వస్తున్న ఇన్ ఫ్లో పెరిగిన కొద్దీ గేట్లను మరింత ఎత్తుకు ఎత్తటం, లేక గేట్ల సంఖ్యను పెంచుతూ దిగువకు నీటిని విడుదల చేసేలా అధికారులు అప్రమత్తమయ్యారు. మరికొద్ది రోజుల పాటు తూఫాన్ ఎఫెక్టు సిటీలో ఉండే అవకాశమున్నందున జలాశయాలకు వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, హుస్సేన్ సాగర్ నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీ ఇంజనీర్లు అప్రమత్తమయ్యారు.
Also Read: Medak district: ఆ జిల్లాలో జడ్పీటీసీ ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు!
