Bathukamma 2025: హుస్సేన్ సాగర తీరాన మంగళవారం సద్దుల బతుకమ్మ (Bathukamma 2025) కార్నివాల్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క హాజరయ్యారు. మంత్రులు సీతక్క, సురేఖా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కార్పొరేషన్ చైర్మన్ లు నిర్మలా జగ్గారెడ్డి , వెన్నెల గద్దర్, కాల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద , సంగీత నాటక అకాడమి చైర్మన్ అలేఖ్య పంజాల , టూరిజం ఎండీ క్రాంతి , కలెక్టర్ దాసరి హరిచందన హాజరయ్యారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కలెక్టర్ హరిచందన దాసరి మహిళలతో కలిసి లయబద్దంగా బతుకమ్మ ఆడారు.
Also Read: Srinivas Goud: రిజర్వేషన్ల పెంపు జీవో చెల్లదని వారికి తెలియదా.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్
బతుకమ్మకు రెండు వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు
అంతకు ముందు బతుకమ్మలకు సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. ట్యాంక్ బండ్ వద్ద వేలాది మంది ఒగ్గు కళాకారులు , డోలు చప్పుళ్ళు తో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల వేషధారణలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు సీతక్క మాట్లాడుతూ ప్రజాపాలన హయాంలో బతుకమ్మకు రెండు వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు దక్కటంతో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బతుకమ్మ వేడుకలు, ఆటా పాటా మారుమోగాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి నేను బతుకమ్మ ఆడుతున్నానని, ఇది చరిత్రలో నిలిచిపోయే బతుకమ్మ అని వ్యాఖ్యానించారు.
వరంగల్ లో చారిత్రాత్మక కట్టడం
తెలంగాణ ఏర్పడిన తర్వాత, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్న బతుకమ్మ ఇది అని మంత్రి అన్నారు. మా వరంగల్ లో చారిత్రాత్మక కట్టడం ముందు బతుకమ్మ వేడుకలు ప్రారంభమైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. గిన్నిస్ బుక్ లో మన బతుకమ్మ ను ఎక్కించాలనే తపనతో మన బతుకమ్మ ను ప్రపంచ వ్యాప్తం చేశామన్నారు. ఇందుకోసం పాటు పడిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. గిన్నీస్ రికార్డు సాధన ఎంతో కష్టం, శ్రమతో కూడుకున్నదని, రెండు, మూడు నెలల ముందు నుంచే ఇందుకోసం శ్రమించిన సాంస్కృతిక శాఖ ను మంత్రి అభినందించారు.
పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి
పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి మనదని, ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ రకమైన సంస్కృతీ లేదన్నారు. తొమ్మిది రోజులు ఎంతో సంతోషంగా మన ఆడవాళ్లు ఈ పండుగను జరుపుకున్నారని, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఘనంగా నిర్వహించుకున్నారని వివరించారు. సంబురాల మధ్యలో కొంత మంది వచ్చి మేమే బతుకమ్మ ను తెచ్చామని చెబుతున్నారని, వెస్ట్రన్ కల్చర్ లో బతుకమ్మ జరుపుకోవద్దని మంత్రి కోరారు. మన సంస్కృతి, ఆచారాలకు అనుగుణంగా పండుగలను జరుపుకోవాలని ఆమె సూచించారు.
Also Read: Tilak Varma: హైదరాబాద్‌లో తిలక్ వర్మ సందడి.. పాక్‌పై ఆడిన వీరోచిత ఇన్నింగ్స్‌పై.. ఆసక్తికర వ్యాఖ్యలు