GHMC Staff Recruitment: రాష్ట్రంలోనే అత్యధిక జనాభాకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీలోని పలు విభాగాలు దశాబ్ద కాలంగా సిబ్బంది కొరతతో అల్లాడిపోతున్నాయి. ఈ సమయంలో ఒక్కసారిగా మూడు విభాగాలకు అదనపు సిబ్బందిని నియమించటంతో స్వల్ప ఊరట లభించింది. ఇప్పటికే 164 మంది జూనియర్ అసిస్టెంట్లను కేటాయించిన సర్కారు తాజాగా పలు విభాగాలకు అదనపు సిబ్బందిని నియమించింది. జీహెచ్ఎంసీకి రెండో అతి పెద్ద ఆదాయ వనరైన టౌన్ ప్లానింగ్ విభాగంలో 30 సర్కిళ్లకు గాను వివిధ హోదాలకు సంబంధించి మొత్తం 480 మంది సిబ్బంది, అధికారులు అవసరం కాగా, ప్రస్తుతం వందలోపే వివిధ క్యాటగిరీలకు చెందిన ఉద్యోగులు, అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలపై నిఘా కొరవడటంతో పాటు క్షేత్ర స్థాయి విధులకు కూడా ఆటంకాలు కల్గుతున్నాయి. వంద మంది టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్లను కేటాయించాలని గులాబీ సర్కారు హయాంలో జీహెచ్ఎంసీ ప్రతిపాదన పెట్టగా, ఇటీవలే సర్కారు పది మంది టీపీఎస్ ఓలను కేటాయించినట్లు తెలిసింది. ఈ విభాగంతో పాటు దోమల నివారణలో కీలక విధులు నిర్వహించే జోనల్ స్థాయి సీనియర్ ఎంటమాలజిస్టులు సైతం కొద్ది రోజుల క్రితం వరకు ముగ్గురు మాత్రమే ఉండగా, ఇపుడు ఇద్దరు మాత్రమే ఆరు జోన్లను పర్యవేక్షిస్తున్నారు.
ఈ విభాగానికి మరో ముగ్గురు సీనియర్ఎం టమాలజిస్టులను కేటాయించాలని ఇటీవలే కమిషనర్ మలేరియా విభాగానికి రాసిన లేఖను పరిగణలోకి తీసుకున్న ఆ శాఖ ముగ్గురు సీనియర్ ఎంటమాలజిస్టును నియమించింది. ప్రస్తుతం వీరికి జోనల్ వారీగా విధులు కేటాయించే పనిలో ఉన్నతాధికారులున్నారు. వీరితో పాటు ఇటీవలే రకరకాల అవినీతి ఆరోపణలతో విధుల్లో నుంచి తొలగించబడిన 27 మంది టౌన్ ప్లానింగ్ స్పెషల్ టాస్క్ ఫోర్సులో విధులు నిర్వహిస్తున్న న్యాక్ ఇంజనీర్లను ఇటీవలే విధుల్లో నుంచి తొలగించటంతో ఖాళీ అయిన ఆ పోస్టులను మళ్లీ భర్తీ చేసే ప్రక్రియను కూడా జీహెచ్ఎంసీ ప్రారంభించటంతో ఇప్పటి వరకు సిబ్బంది కొరతతో అల్లాడిపోయిన, దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ముఖ్యమైన పోస్టులు భర్తీ కావటంతో కాస్త ఊరట లభించినట్లయింది.
ఇంకెంత కాలం ఖాళీ?
గ్రేటర్ హైదరాబాద్ లో దోమల నివారణ చర్యలు చేపడుతున్న ఎంటమాలజీ విభాగం మొత్తం విధులను పర్యవేక్షించే చీఫ్ ఎంటమాలజిస్టు కుర్చీ ఖాళీ అయి దాదాపు అయిదు నెలలు గడుస్తున్నా, ఈ సీటు భర్తీ కావటంతో లేదు. గత సంవత్సరం అక్టోబర్ మాసంలో చీఫ్ ఎంటమాలజిస్టుగా విధులు నిర్వహించిన రాంబాబు అక్టోబర్ నెలాఖరుతో పదవీ విరమణ పొంది వెళ్లిపోయారు. ఆ తర్వాత చీఫ్ ఎంటమాలజిస్టు కుర్చీ ఇన్ ఛార్జి బాధ్యతలను చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజకు కొంతకాలం అప్పగించినట్టే అప్పగించి, ఆ తర్వాత అదనపు కమిషనర్ (హెల్త్) ఈ పోస్టుకు ఇన్ ఛార్జిగా వ్యవహారిస్తున్నారు. జోనల్ వారిగా నియమించుకునేందుకు ముగ్గురు సీనియర్ ఎంటమాలజిస్టులతో పాటు చీఫ్ ఎంటమాలజిస్టును కూడా జీహెచ్ఎంసీకి కేటాయించాలని కమిషనర్ లేఖ రాసినప్పటికీ, మలేరియా విభాగం కేవలం ముగ్గురు సీనియర్ ఎంటమాలజిస్టులను కేటాయించి, చీఫ్ ఎంటమాలజిస్టు పదవీకి అధికారిని కేటాయించటాన్ని పక్కన బెట్టింది.
డైలీ రావాలి…పోవాలి
జీహెచ్ఎంసీలోని కొన్ని ముఖ్యమైన విభాగాల్లో పరిస్థితి విచిత్రంగా తయారైంది. రెండున్నర నెలల క్రితం వరకు అదనపు కమిషనర్ (పరిపాలన)గా వ్యవహారించిన నళినీ పద్మావతిని కమిషనర్ ఇలంబర్తి రెండున్నర నెలల క్రితం ఓ కోర్టు ధిక్కారణ కేసు హియరింగ్ కు సంబంధించి విధులను నిర్లక్ష్యం చేసిన కారణంగా ఆమెను అదనపు కమిషనర్ (పరిపాలన) బాధ్యతల నుంచి తప్పించారు. ఆ పోస్టులో వేణుగోపాల్ ను అదనపు కమిషనర్ గా నియమించిన కమిషనర్ నళినీ పద్మావతికి నేటికి ఎలాంటి బాధ్యతలు కేటాయించలేదు.
దాదాపు రెండున్నర నెలల నుంచి ఆమె జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి ఉదయం రావటం, సాయంత్రం కాగానే వెళ్లిపోవటం జరుగుతుంది. ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా కమిషనర్ ఇంకెన్ని రోజులు ఇలాగే గడుపుతారోనన్నది చర్చనీయాంశంగా మారింది. ఓ విద్యావంతురాలైన మహిళా నేత మేయర్ గా వ్యవహారిస్తున్న జీహెచ్ఎంసీలోని పలు కీలక బాధ్యతల్లో మహిళలదే పై చేయి ఉన్నప్పటికీ, ఓ మహిళా ఆఫీసర్ కు సుమారు రెండున్నర నెలలుగా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా కొనసాగించటం చర్చనీయాంశంగా మారింది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు