GHMC: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం తర్వాత విస్తరించిన జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని సర్కిల్స్, జోన్ల రీ మ్యాపింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పాత పరిధి, విలీన ప్రాంతాలను కలిపి 60 సర్కిల్స్, 12 జోన్లతో పాటు 300 మున్సిపల్ వార్డులుగా విభజించిన సంగతి తెల్సిందే. మున్సిపల్ వార్డు మాట అలా ఉంచితే సర్కిల్స్, జోన్ల వారీగా పౌర సేవలు, అత్యవసర సేవల నిర్వహణకు సంబంధించి అంతరాయం ఏర్పడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా 60 సర్కిల్స్, వాటి పరిధులను ఖరారు చేసినప్పటికీ, ఆ పరిధిలోని వివిధ రకాల సేవలను ఆన్‌లైన్‌లో ఒకే చోటకు తీసుకువచ్చే బాధ్యతలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్న్‌కు అప్పగించారు. ఆయా సర్కిల్స్, జోన్లకు చెందిన వివిధ విభాగాల ఫీల్డు లెవెల్ సిబ్బంది ఇచ్చే సమాచారం మేరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రీ మ్యాపింగ్ చేసి, విభాగాల వారీగా లాగిన్‌ను కేటాయించాల్సి ఉంటుంది. కానీ, చాలా సర్కిళ్ల నుంచి ఇన్ టైమ్‌లో సమాచారం అందకపోవటంతో సీజీజీ ఆశించినంత వేగంగా అప్డేట్ చేయలేకపోతున్నట్లు సమాచారం.
Also Read: GHMC Elections: గ్రేటర్‌లో వేడెక్కిన రాజకీయం.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?
అన్ని సేవలూ బంద్
27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేస్తూ సర్కారు ప్రతిపాదనలు పంపిన గత నవంబర్ 25వ తేదీ నుంచి, శానిటేషన్ మినహా మిగిలిన సేవలన్నీ స్తంభించిపోయినట్లు ప్రజలు వాపోతున్నారు. కొత్తగా ఏర్పడిన సర్కిల్లకు ప్రాపర్టీ ట్యాక్స్ లాగిన్లు కూడా కేటాయించకపోవటంతో సిబ్బంది కాలక్షేపం చేస్తున్నారు. మరోవైపు సర్కిల్స్‌కు బాస్‌లుగా ఉన్న డిప్యూటీ కమిషనర్లకు సైతం తమ ఏరియాపై అవగాహన లేకపోవటంతో కింది స్థాయి సిబ్బంది నుంచి సమాచారాన్ని తెప్పించుకోలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. శనివారం గ్రేటర్ వ్యాప్తంగా బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోవడంతో పాటు, పాత 30 సర్కిళ్లలోనూ సేవలు మందగించాయి.
జనాలకు తీవ్ర ఇక్కట్లు
కొత్త సర్కిల్స్‌లో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ ఇంకా ప్రారంభం కాలేదన్న వాదనలున్నాయి. పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి దాదాపు 30 వేల నుంచి 35 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పాత 30 సర్కిల్స్ ఏకంగా 60 సర్కిల్స్‌గా పెరగడం, మ్యాపింగ్ పూర్తి కాకపోవటమే దీనికి ప్రధాన కారణం. గతంలో విధులు నిర్వహించిన అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ల బదిలీలు కూడా ఈ స్తంభనకు కారణమయ్యాయి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న నగరవాసులు సర్టిఫికెట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. సర్కిల్ రీ మ్యాపింగ్ కారణంగా అత్యవసర సేవలందించే ఇతర విభాగాలు కూడా సత్వర సేవలందించలేని పరిస్థితి నెలకొంది.
Also Read: GHMC: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లకు కసరత్తు ప్రారంభం.. ఎన్నికల నిర్వహణ పై కీలక అప్డేట్..?

