GHMC Property Tax Scam: గ్రేటర్ హైదారాబాద్ మహానగరంలోని కోటిన్నర మంది జనాభాకు అవసరాలకు తగిన విధంగా అభివృద్ది పనులతో పాటు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ పై జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే ( జీఐఎస్) నిర్వహిస్తున్న అధికారులకు ఒకింత ఆశ్చర్యం కల్గించే వాస్తవాలు బయటపడుతున్నాయి. జీహెచ్ఎంసీ(GHMC)కి ట్యాక్స్ రూపంలో రావాల్సిన నిధులను ట్యాక్స్ సిబ్బంది కన్నం ((GHMC Property Tax Scam) వేసి జేబులు నింపుకుంటున్న తతంగాలు వరుసగా బయటపడుతున్నాయి. అధికారులు ముందుగానే ఊహించిన విధంగా మంచి ఫలితాలనిస్తున్న ఈ సర్వే ఇటీవలే సిటీలోని సుమారు 93 వేల ఆస్తుల కమర్షియల్ కరెంట్ మీటర్లను వినియోగిస్తూ, జీహెచ్ఎంసీ(GHMC)కి రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న విషయాన్ని బయటపెట్టిన సంగతి తెల్సిందే.
సిటీలో సుమారు 70 వేల భవనాలు
ఇపుడు తాజాగా మరో అక్రమాన్ని ఈ సర్వే గుర్తించింది. సిటీలో సుమారు 70 వేల భవనాలు అసలు ట్యాక్స్ చెల్లింపులకు దూరంగా ఉన్నట్లు సర్వే తేల్చింది. సిటీలోని 30 సర్కిళ్ల పరిధిలోని దాదాపు మూడు వందల పై చిలుకు ప్రాపర్టీల వివరాలతో ఉన్న డాకెట్ల ప్రకారం దాదాపు 19.50 లక్షల మంది తమ ఆస్తులకు సంబంధించిన ట్యాక్స్ చెల్లింపులు జరుపుతుండగా, ఇందులో దాదాపు రెండు లక్షల ఆస్తులు కమర్షియల్ ట్యాక్స్ చెల్లిస్తున్నాయి. అయితే వీటిలో చాలా ఆస్తులకు చెందిన యజమానులు కమర్షియల్ గా వినియోగిస్తూ, రెసిడెన్షియల్ ట్యాక్స్ చెల్లించటంతో పాటు అదనంగా వచ్చిన అంతస్తులను కూడా ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ గత సంవత్సరం జూలై మాసం నుంచి జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే ( జీఐఎస్) సర్వేను ప్రారంభించారు.
Also Read: World’s Tallest Bridge: ప్రపంచంలోనే ఎత్తైన వంతెన.. 2 గంటల ప్రయాణం.. ఇకపై 2 నిమిషాల్లోనే!
ప్రతి ఏటా జీహెచ్ఎంసీకి రూ. 600 కోట్ల
ఇందులో ఇప్పటి వరకు అసలు ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్ కాకుండా, ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి రాని భవనాలు సుమారు 70 వేల వరకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భవనాలు నిర్మించి, వినియోగిస్తూ దశాబ్దాల కాలం గడుస్తున్నా, ఎందుకు ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి రాలేదన్న విషయంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి రాని ఈ సుమారు 80 వేల భవనాల నుంచి ప్రతి ఏటా జీహెచ్ఎంసీకి రూ. 600 కోట్ల వరకు నష్టమేర్పడుతున్నట్లు అంఛనాలేసిన అధికారులు ఇందుకు బాధ్యులను కూడా గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కమర్షియల్ కరెంటు మీటర్లను వినియోగిస్తూ జీహెచ్ఎంసీకి రెసిడెన్షియల్ ట్యాక్స్ చెల్లిస్తున్న 93 వేల ఆస్తులతో పాటు అసలు ట్యాక్స్ పరిధిలోకి రాని మరో 70 వేల భవనాల నుంచి పన్ను వసూలు చేసే పనిలోని ఉన్నతాధికారులు నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. ఈ రెండు రకాల భవనాల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా సుమారు రూ. వెయ్యి కోట్ల వరకు ట్యాక్స్ కలెక్షన్ పెరిగే అవకాశమున్నట్లు అధికారులు అంఛనాలేస్తున్నారు.
యజమానులకు త్వరలో నోటీసులు
దశాబ్దాల క్రితం నిర్మించి, వినియోగంలో ఉన్న సుమారు 70 వేల భవనాలెందుకు ట్యాక్స్ చెల్లింపు పరిధిలోరి రాలేదన్న విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు భవన యజమానులకు నోటీసులు జారీ చేసేందుకు సిద్దమయ్యారు. భవనం ఎపుడు నిర్మించారు? నిర్మించే ముందు జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణ అనుమతి తీసుకున్నారా? లేదా? అన్న విషయాలపై యజమానుల నుంచి సమాచారం సేకరించనున్నారు. అనుమతి లేని భవనాలను అక్రమ నిర్మాణాలుగా గుర్తించి, మూడేళ్ల ట్యాక్స్ ను వర్తింపజేయటంతో పాటు అక్రమ నిర్మాణాలకు వర్తింపజేసే వంద శాతం పెనాల్టీతో రెండింతలు చేసి వసూలు చేయాలని భావిస్తున్నారు. అనుమతులున్న భవనాలకు భవనాల వినియోగాన్ని బట్టి మూడేళ్ల ట్యాక్స్ ను ఒకే సారి వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అంతేగాక, యజమాని నుంచి సేకరించనున్న భవన నిర్మాణ అనుమతుల వివరాలతో ఆ భవనాలున్న సర్కిళ్లలో అప్పట్లో విధులు నిర్వహించిన ట్యాక్స్ ఇన్ స్పెక్టర్, బిల్ కలెక్టర్ల వివరాలను కూడా సేకరించి, వారిని కూడా బాధ్యులను చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.
నేటికీ కొనసాగుతున్న అక్రమాలు
కొత్తగా నిర్మితమయ్యే భవనాన్ని అసెస్ మెంట్ చేసి ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి తీసుకురావాల్సిన ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్ల అక్రమాలు నేటికీ కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కమర్షియల్, రెసిడెన్షియల్ బహుళ అంతస్తు భవనాల యజమానులతో ట్యాక్స్ సిబ్బంది బేరం కుదుర్చుకుని, భవనం వినియోగం కమర్షియల్ అయితే దాన్ని రికార్డుల్లో రెసిడెన్షియల్ గా ఎక్కించటం, యూసేజీ ఏరియాను తక్కువగా రికార్డుల్లోకి ఎక్కించి యజమాని చెల్లించాల్సిన పన్నును భారీగా తగ్గించి, ఎక్కువ మొత్తంలో జేబులు నింపుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇలాంటి అక్రమాలు శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ జోన్లలో ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. సరూర్ నగర్ లో ఓ కమర్షియల్ బిల్డింగ్ ఏటా ట్యాక్స్ గా రూ. కోటిన్నర చెల్లించాల్సి ఉండగా, యజమాని ట్యాక్స్ సిబ్బందిని మేనేజ్ చేసుకోవటంతో ఏటా కేవలం రూ. 12 లక్షల వరకు ట్యాక్స్ చెల్లించి, స్థానిక ట్యాక్స్ సిబ్బందికి ఎటా మామూళ్లను అందిస్తున్న ఆరోపణ ఇటీవలే తెరపైకి వచ్చిన సంగతి తెల్సిందే.
Also Read: Kavitha: ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా.. కవిత సంచలన వ్యాఖ్యలు