GHMC: తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద స్థానిక సంస్థ అయిన (GHMC) జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్ల సంఖ్యను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్న 11 మంది అదనపు కమిషనర్ల సంఖ్యను ఆరు నుంచి తొమ్మిదికి తగ్గించేందుకు (GHMC) జీహెచ్‌ఎంసీ కమిషనర్ (RV Karnan) ఆర్‌వీ కర్ణన్ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చర్య పౌర సేవల నిర్వహణ, పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అస్తవ్యస్తంగా పరిపాలన?
ప్రస్తుతం (GHMC) జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే ప్రజా సమస్యలు పేరుకుపోయి, పరిపాలన అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలున్నాయి. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండగా, అదనపు కమిషనర్ల సంఖ్య తగ్గితే ఈ ఫిర్యాదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో విభాగాన్ని పర్యవేక్షించేందుకు ఒక్కో ఐఏఎస్, నాన్-కేడర్ ఆఫీసర్ ఉండగా, వారి సంఖ్యను కుదించేందుకు కమిషనర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కమిషనర్ నిర్ణయం వెనుక?
(GHMC) జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్‌వీ కర్ణన్ (RV Karnan) బాధ్యతలు స్వీకరించకముందు మొత్తం 14 మంది ఐఏఎస్, నాన్-కేడర్ ఆఫీసర్లు అదనపు కమిషనర్లుగా వ్యవహరించేవారు. (RV Karnan) కర్ణన్ నియామకం తర్వాత ఆయనకంటే సీనియర్ ఐఏఎస్ అయిన అదనపు కమిషనర్ కిల్లు శివకుమార్ నాయుడు సెలవుపై వెళ్లారు. ఇటీవలి ఐఏఎస్ అధికారుల బదిలీల్లో ఆయనకు మెరుగైన పోస్టింగ్ లభించింది. “ఇంత మంది అదనపు కమిషనర్లు ఎందుకు?” అని కమిషనర్ కర్ణన్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినట్లు సమాచారం.
Also Read: Minister Ponnam Prabhakar: గోల్కొండ బోనాలకు.. పకడ్బందీ ఏర్పాట్లు!
అంతకుముందే యూసీడీ విభాగానికి అదనపు కమిషనర్‌గా ఉన్న చంద్రకాంత్ రెడ్డి బదిలీపై వెళ్లగా, ఇటీవల జరిగిన బదిలీల్లో మరో ఇద్దరు అదనపు కమిషనర్లు (GHMC) జీహెచ్‌ఎంసీ నుంచి బయటకు వెళ్లారు. దీంతో అదనపు కమిషనర్ల సంఖ్య ప్రస్తుతం 11కి తగ్గింది. ఇప్పుడు ఈ సంఖ్యను మరింత తగ్గించాలని కమిషనర్ భావిస్తున్నారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో అదనపు కమిషనర్లుగా, జోనల్ కమిషనర్లుగా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్, నాన్-కేడర్ ఆఫీసర్లతో కమిషనర్ సమావేశం నిర్వహించి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రెండు, మూడు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పౌరసేవలకు అంతరాయం?
ప్రస్తుతమున్న 11 మంది అదనపు కమిషనర్ల సంఖ్యను 6 లేదా 9కి తగ్గించి, ఒక్కో అదనపు కమిషనర్‌కు మూడు నుంచి నాలుగు విభాగాల బాధ్యతలను కేటాయించాలని కమిషనర్ కర్ణన్ (RV Karnan) భావిస్తున్నట్లు సమాచారం. కర్ణన్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించకముందు ఒక్కో విభాగానికి ఒక అదనపు కమిషనర్ ఉండేవారు. అప్పుడే ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పుడు అధికారుల సంఖ్యను తగ్గించి, ఒక్కొక్కరికి ఎక్కువ బాధ్యతలు అప్పగిస్తే పౌరసేవలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ఇతర ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
650 కి.మీ.ల విస్తీర్ణం, 30 సర్కిళ్లు, ఆరు జోన్లలో సుమారు కోటి 30 లక్షల మంది జనాభాకు అవసరమైన అభివృద్ధి పనులు, అత్యవసర సేవలను అందించే (GHMC) జీహెచ్‌ఎంసీలో ఎంత ఎక్కువ సంఖ్యలో అదనపు కమిషనర్లు ఉంటే అంత బాగా పౌర సేవల నిర్వహణ జరుగుతుందని, అభివృద్ధి పనుల్లో వేగం పెరుగుతుందని కొందరు జీహెచ్‌ఎంసీ అధికారులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
పునర్వ్యవస్థీకరణకు సంకేతమా?
(GHMC) జీహెచ్‌ఎంసీ కమిషనర్ అదనపు కమిషనర్ల సంఖ్యను ఎందుకు కుదిస్తున్నారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే ప్రభుత్వం (GHMC) జీహెచ్‌ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి, ఆ తర్వాత (Hyderabad) హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మున్సిపల్ కార్పొరేషన్లుగా మూడు భాగాలుగా విభజించే యోచనలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ పునర్వ్యవస్థీకరణను దృష్టిలో పెట్టుకునే కమిషనర్ కర్ణన్ అదనపు కమిషనర్ల సంఖ్యను కుదిస్తున్నారని వాదనలున్నాయి.
ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని(Hyderabad) హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంగా మార్చనున్నారా? (Hyderabad) హైదరాబాద్ జిల్లా పరిధికి సరిపోయే స్థాయిలోనే కమిషనర్ అదనపు కమిషనర్ల సంఖ్యను కుదించేందుకు సిద్ధమయ్యారా? అనే వాదనలు కూడా లేకపోలేదు. అధికారుల సంఖ్యను కుదించిన తర్వాత మిగిలే ఆఫీసర్లను సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్), ఎంఏయూడీ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్)లకు పంపాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కొందరు అధికారులు కమిషనర్ చెప్పే వరకు ఆగకుండా ఇప్పటికే ఇతర విభాగాల్లో పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Also Read: Ranga Reddy District: పక్కదారి పడుతున్న గోధుమలు.. సందట్లో సడేమియాలా డీలర్ల తీరు!