GHMC: జీహెచ్ఎంసీ (GHMC) లో తీవ్రరూపం దాల్చిన ఆర్థిక సంక్షోభంతో అధికారులు ఆర్థిక గుణపాఠాలు నేర్చుకుంటున్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రస్తుతమున్న ఆర్థిక వనరులను పూర్తి స్థాయిలో వినియోగించటంతో పాటు జీహెచ్ఎంసీ (GHMC) చేపట్టనున్న పనుల్లో ఖర్చును తగ్గించుకోవటంతో పాటు చేసిన పని ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఏ పని చేసినా, ఆర్థిక భారం తక్కువ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read: Bellamkonda Srinivas: సినిమా మొదలైన పది నిమిషాల తర్వాత అలా జరగదు.. ఎందుకంటే?
పనులకు వర్తింపజేసేందుకు సిద్దం
ఈ చిట్కాను ఇప్పటికే పలు ప్రాజెక్టుల్లో ప్రయోగించిన జీహెచ్ఎంసీ అధికారులు ఇపుడు మెయింటనెన్స్ పనులకు వర్తింపజేసేందుకు సిద్దమయ్యారు. ముఖ్యంగా నగరంలో రోజు రోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్, రద్దీ కారణంగా పాదచారుల భద్రత కోసం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తున్న ఫుట్‌పాత్‌లకు ఇకపై మైసూర్ నగరం తరహాలో ప్లాస్టిక్ చెత్తలో ఉచితంగా లభ్యమయ్యే ప్లాస్టిక్ తో టైల్స్ తయారు చేసి వినియోగించాలని భావిస్తున్నారు.
గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో ప్రతి రోజు పోగయ్యే సుమారు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్తలోని ప్లాస్టిక్ ను వేరు చేసి, దాన్ని జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఆవరణలో ఉన్న ప్రాసెసింగ్ సెంటర్ లో రీ సైక్లింగ్ చేసి, ఫుట్ పాత్ లకు వినియోగించాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఖైరతాబాద్ జోన్ లో జనసంచారం ఎక్కువగా ఉండేలా, ప్రతి రోజు ఎక్కువ మంది రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ప్లాస్టిక్ టైల్స్ తో ఫుట్ పాత్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ప్రస్తుతం జీహెచ్ఎంసీ సేకరిస్తున్న నిర్మాణ వ్యర్థాలు ( సీఅండ్ డీ) రీ సైక్లింగ్ తో తయారు చేస్తున్న ఇటుకలు, ఇసుకకు మార్కెటింగ్ లేకపోవటంతో వాటిని కూడా జీహెచ్ఎంసీ చేపట్టే మెయింటనెన్స్ పనుల్లో వినియోగించాలని కమిషనర్ నిర్ణయం తీసుకున్నట్లు తెల్సింది.
ప్లాస్టిక్ వినియోగమే ఎందుకు?
సిటీ పరిధిలో ప్రస్తుతం జీహెచ్ఎంసీ టైల్స్తో , సిమెట్ ఫ్లోర్ల తో ఫుట్ పాత్ ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే వీటిలో నాణ్యత కొరవడటం, ఎక్కువ రోజులు మన్నిక కాకపోవటంతో జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కువ కాలం మన్నికగా ఉండేందుకు వీలుగా ఫుట్ పాత్ కు ప్లాస్టిక్ ఫ్లోరింగ్ గానీ, టైల్స్ ను గానీ ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు. పైగా సిమెంట్, కాంక్రీట్ కన్నా ఉచితంగా వస్తున్న ప్లాస్టిక్ టైల్స్, ప్లోరింగ్ వ్యయం చాలా తక్కువగా ఉండటంతో ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ టైల్సే బెటర్ అని అధికారులు నిర్ణయానికొచ్చారు. సిద్దంగా ఉన్న ఈ ప్రతిపాదనలకు జోనల్ కమిషనర్ ఆమోద ముద్ర వేయాల్సి ఉందని తెల్సింది. రెండు, మూడు రోజుల్లో ఆమోదం లభించి, ఫీల్డు లెవెల్ లో పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.
రాజ్ భవన్ రోడ్డులో పైలట్ ప్రాజెక్టు
ఖైరతాబాద్ జోన్ లోని రాజ్ భవన్ రోడ్డులో ఒక కిలోమీటరు పొడువున ఫుట్ పాత్ పై ప్లాస్టిక్ టైల్స్ గానీ, ఫ్లోరింగ్ గానీ వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాలుగేళ్ల క్రితం గచ్చిబౌలీలోని పెట్స్ పార్కు వద్దనున్న ఫుట్ పాత్ కు ప్లాస్టిక్ టైల్స్ వేసిన అధికారులు ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు. ఇపుడు ఆర్థిక సంక్షోభం కారణంగా రోడ్లు వేసేందుకు, ఫుట్ పాత్ లను నిర్మించేందుకు ఖర్చు తగ్గించుకోవాలన్న ఆలోచనతో మళ్లీ ప్లాస్టిక్ టైల్స్ గుర్తుకు రావటంతో తాజాగా రాజ్ భవన్ రోడ్డును ఎంచుకున్నట్లు సమాచారం.
మొత్తం ఫుట్ పాత్ ల పొడువు 530 కిలోమీటర్లు
జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 6 వేల కిలోమీటర్ల పొడువున బీటీ రోడ్లుండగా, మరో 3 వేల పై చిలుకు కిలోమీటర్ల పొడువున సీసీ రోడ్లున్నాయి. మొత్తం 9 వేల 13 కిలోమీటర్ల పొడువున ఉన్న రోడ్లకు ఇండియన్ రోడ్ కాంగ్రేస్ గైడ్ లైన్స్ ప్రకారం సుమారు ముప్పై శాతం అంటే కనీసం మూడు వేల కిలోమీటర్ల పొడువున ఫుట్ పాత్ లు ఉండాల్సిందే. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ స్థాయిలో ఫుట్ పాత్ లు లేవు. అయిదేళ్లు క్రితం కేవలం 300 కిలోమీటర్ల పొడువున మాత్రమే పుట్ పాత్ లుండగా, గడిచిన అయిదేళ్లలో వీటి పొడువు జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ, జంక్షన్ల అభివృద్ది కార్యక్రమాల ద్వారా 230 కిలోమీటర్ల పొడువున పెంచారు. మున్ముందు దశల వారీగా అన్ని ఫుట్ పాత్ లపై ప్లాస్టిక్ టైల్స్ వేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: PM Modi: భారత్‌తో వాణిజ్య చర్చలు.. ట్రంప్ పోస్టుకు.. ప్రధాని ఆసక్తికర ఆన్సర్!