GHMC: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జీహెచ్ఎంసీ(GHMC)ని గట్టెక్కించేందుకు అధికారులు చేసిన ఆదాయ సమీకరణ ప్రయత్నాలన్నీ విఫలం కావటంతో ఉన్నతాధికారులు సరి కొత్త ప్రయత్నం మొదలు పెట్టారు. జీహెచ్ఎంసీకి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు గాను రోడ్ల పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు బిల్లు స్థానంలో ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్స్ (టీడీఆర్)లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించుకోవటంతో పాటు, ఖజానా నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లు రోడ్ నిర్మించిన ప్రాంతంలోనే వారికి ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్స్ ఇవ్వాలని కమిషనర్ కర్ణన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read: MLC Kavitha: కీలక నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత?.. ప్రకటన ఎప్పుడంటే?
మహారాష్ట్రలో సాగుతున్న ఈ విధానాన్ని జీహెచ్ఎంసీ(GHMC) అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆసక్తి ఉన్న కాంట్రాక్టర్లకు సంబంధిత ప్రాంతాల్లో రోడ్డలు వేయాలని సూచించడంతో పాటు దానికి ఎంత ఖర్చు అవుతందని అంచనా వేసి అందుకు సరిపడేలా టీడీఆర్ ని సంబంధిత కాంట్రాక్టర్ కి బల్దియా అందజేసే దిశగా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ విధానం అమలు చేస్తే జీహెచ్ఎంసీ నుంచి నయాపైస ఖర్చు లేకుండా రోడ్ల నిర్మాణం జరగటంతో పాటు కాంట్రాక్టర్లకు బిల్లులుగా చెల్లించాల్సిన నిధులను ఇతర అవసరాలకు వినియోగించే వెసులుబాటు కల్గుతుందని కమిషనర్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ(GHMC) రోడ్ల విస్తరణ, నాలాల విస్తరణతో పాటు ఫ్లై ఓవర్లు వంటి ప్రాజెక్టుల నిర్మాణంలో చేపట్టే భూ సేకరణలో భాగంగా స్థలాలు కొల్పోయే ఆస్తుల యజమానులకు ఏరియాను బట్టి వారు కొల్పోతున్న భూమి విలువకు మూడింతలు ఇతర చోట అభివృద్ది చేసుకునే అధికారాన్ని ఇస్తూ జీహెచ్ఎంసీ టీడీఆర్ లు జారీ చేసేది. ఇపుడు తాజాగా రోడ్ల నిర్మాణానికి టీడీఆర్ లను వర్తింపజేయాలని భావిస్తున్నారు.
టీడీఆర్ సర్టిఫికెట్లు
జీహెచ్ఎంసీ ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రోజుల్లో సేకరించిన స్థలాలకు నష్టపరిహారంగా నగదును చెక్కు రూపంలో చెల్లించే వారు. ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన తర్వాత ఎక్కడ స్థలాలను సేకరించినా, తొలుత అధికారులు టీడీఆర్ ను ఆఫర్ చేస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో యజమాని అంగీకరించని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో నగదు రూపంలో నష్టపరిహారం చెల్లిస్తున్నారు. ఈ తరహాలో జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు దాదాపు 38 లక్షల చదరపు గజాల టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు సమాచారం. వీటిలో దాదాపు 20 లక్షల చదరపు గజాలకు సంబంధించిన టీడీఆర్‌లను వినియోగించుకున్నారు.
ఇంకా దాదాపు 18 లక్షల చదరపుగజాల టీడీఆర్ అందుబాటులో ఉన్నాయి. గ్రేటర్ లో నిర్మాణం కోసం తీసుకున్న పర్మిషన్ కన్నా అదనంగా మరో అంతస్తు నిర్మించుకునేందుకు డీవియేషన్స్ ఉన్న భవనాలకు సెట్ బ్యాక్ లకి సంబంధించి మినహాయింపు పొందేందుకు టీడీఆర్ లను వినియోగించుకునే అవకాశముంది. అయితే నిర్మాణాలు జరపక ముందే టీడీఆర్ ని కొనుగోలు చేయాల్సి ఉంది. టీడీఆర్ అవసరం ఉన్న వారు టీడీఆర్ ఉన్న వారిని సంపద్రించి వారితో సంప్రదింపులు జరిపి, ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత వాటిని పొందుతున్నారు. గత కొంత కాలంగా టీడీఆర్ కు ఫుల్ డిమాండ్ వచ్చింది. టీడీఆర్ ఉన్న వారు మున్ముందు దాని రేటు, డిమాండ్ పెరుగుతుందని అమ్మేందుకు ముందుకు రావడంలేదు. ప్రస్తుతం మార్కెట్ ధర కంటే 50 శాతం ఎక్కవకు టీడీఆర్ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.
Also Read: Viral Video: వరద కవరేజ్ కోసం వెళ్లి.. పాక్ మహిళా జర్నలిస్టు.. ఎలా వణికిపోయిందో చూడండి!