GHMC: ఇక మిగిలింది 23 రోజులే.. జీహెచ్‌ఎంసీ పాలన ముగింపు..?
GHMC (imagecredit:twitter)
Technology News, హైదరాబాద్

GHMC: ఇక మిగిలింది 23 రోజులే.. జీహెచ్‌ఎంసీ పాలన ముగింపు..?

GHMC: దేశంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా అవతరించిన జీహెచ్‌ఎంసీలోని పాలక మండలి పదవీ కాలం మరో 23 రోజుల్లో ముగియనుంది. ఐదేళ్ల పాటు కొనసాగిన ఈ పదవీ కాలంలో చిట్టచివరి కౌన్సిల్ సమావేశాన్ని త్వరలోనే నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే నెల 10వ తేదీతో అధికార కాలం గడువు ముగుస్తుండటంతో, అంతలోపు చివరి సమావేశాన్ని నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 31వ తేదీన చివరి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని తొలుత నిర్ణయించినా, కొన్ని కారణాలతో తేదీని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. 2021 ఫిబ్రవరి 10న మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు కార్పొరేటర్లు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అధికార గడువు ముగియనున్న నేపథ్యంలో, ఐదేళ్ల పాటు స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్ సర్వసభ్య సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు, చేసిన తీర్మానాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ముఖ్యంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ముసాయిదాగా రూపొందించిన రూ. 11,460 కోట్ల బడ్జెట్‌పై కూడా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.

రెండు సెషన్లుగా..

ఒకవేళ ఈ సమావేశంలో కౌన్సిల్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపితే, తదుపరి పరిపాలనపరమైన మంజూరీ కోసం సర్కారుకు పంపాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ చివరి సమావేశంలో గడిచిన ఐదేళ్లలో గ్రేటర్ నగరాభివృద్ధికి కౌన్సిల్ తీసుకున్న పలు నిర్ణయాలపై కార్పొరేటర్లు చర్చించే అవకాశాలున్నట్లు తెలిసింది. వీలైనంత ఎక్కువ మంది సభ్యులు మాట్లాడేలా సమావేశాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఉదయం పది నుంచి సాయంత్రం వరకు రెండు సెషన్లలో ఈ భేటీని నిర్వహించాలని భావిస్తున్నారు. మొదటి సెషన్‌లో బడ్జెట్‌పై చర్చించి ఆమోదించుకోవాలని, రెండో సెషన్‌లో ఐదేళ్ల పాలక మండలి నిర్ణయాలు, ముఖ్యమైన తీర్మానాలు మరియు చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించాలని యోచిస్తున్నారు. మరోవైపు, ప్రధాన విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు మాత్రం ఐదేళ్లలో పాలక మండలి వైఫల్యాలను సభలో ప్రస్తావించాలని సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Also Read: AP News: చంద్రబాబు నోటివెంట మళ్లీ ఆ మాట… ఈ డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందో?

11 నుంచి స్పెషలాఫీసర్ పాలన

జీహెచ్‌ఎంసీలో ఫిబ్రవరి 11 నుంచి స్పెషలాఫీసర్ పాలన ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 10కి ప్రస్తుత పాలక మండలి గడువు ముగుస్తుండటంతో, మరుసటి రోజు నుంచే ప్రత్యేక అధికారి పాలన తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. పాలక మండలి తన పదవీ కాలం ముగిసేలోపు నిర్వహించాలనుకుంటున్న కౌన్సిల్ సమావేశంలో ఒకవేళ నూతన ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు ఆమోదం లభించని పక్షంలో, స్పెషలాఫీసర్ పాలనలోనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి 11న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే జీహెచ్‌ఎంసీని ఒకటిగానే కొనసాగించాలా? లేక మూడు కార్పొరేషన్లుగా విభజించాలా? అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించాలనుకుంటే, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, పది కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నందున, ఆ ప్రక్రియ ముగిసిన తర్వాతే గ్రేటర్ ఎన్నికలపై దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు కార్పొరేషన్ల విభజన పూర్తి చేసి, చైర్‌పర్సన్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసిన అనంతరం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్‌ని చూసేందుకు తరలివస్తున్న ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న లేఖలు!

Just In

01

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జులుగా.. తెలంగాణ మంత్రులు.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే!

RTA Corruption: సుప్రీం పవర్స్‌తో ఏఓల ఆధిపత్యం.. ఆర్టీవోలు లేకపోతే వాళ్లదే ఇష్టారాజ్యం!

KGBV Teachers: సార్ మా గోడు వినండి.. చాలీచాలని జీతాలతో కేజీబీవీ ఉద్యోగులు అవస్థలు..!

Kavitha – PK Alliance: కవిత కొత్త పార్టీ.. రంగంలోకి రాజకీయ వ్యూహాకర్త పీకే.. వర్కౌట్ అయ్యేనా?

GHMC: ఇక మిగిలింది 23 రోజులే.. జీహెచ్‌ఎంసీ పాలన ముగింపు..?