Bandla Ganesh: బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) తన మొక్కును తీర్చుకునేందుకు తిరుమలకు పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏం మొక్కు.. ఎందుకు పాదయాత్ర? అనే విషయాలు తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. ఎప్పుడూ.. ఏదో ఒక వార్తతో సెన్సేషన్‌ని క్రియేట్ చేసే బండ్ల గణేష్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అంటే ఎంత ఇష్టమో.. మరొక వ్యక్తి కూడా అంటే అంతే ఇష్టమట. ఆ విషయం స్వయంగా ఆయనే చెప్పారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరు.. ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu). ఏపీలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబును ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. ఆఖరికి జైల్లో కూడా పెట్టారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కల్పించుకోవడంతో.. అప్పటి ప్రభుత్వ ప్లాన్ అంతా తారుమారైంది. ఆ ఫలితం ఏంటనేది ఇక్కడ అప్రస్తుతం కాబట్టి.. అసలు విషయంలోకి వస్తే.., అప్పుడు చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు బండ్లన్న మొక్కుకున్నాడట. చంద్రబాబుకు ఆ కష్టాలన్నీ తీరి, జైలు నుంచి బయటకు వస్తే.. తన గడప నుంచి నీ కొండ దాకా పాదయాత్ర చేస్తానని తిరుమలేశ్వరుడిని మొక్కుకున్నాడట. ఆ మొక్కు తీర్చుకునేందుకు జనవరి 19న పాదయాత్ర మొదలు పెట్టబోతున్నట్లుగా బండ్ల గణేష్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో..
Also Read- MSG Movie: ‘మన శంకర వర ప్రసాద్ గారు’.. ఆల్ ఏరియాస్ బ్రేకీవెన్.. పోస్టర్ వచ్చేసింది
నా గడప నించి నీ కొండ దాకా
‘‘కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధికి సంకల్పయాత్ర. మన నాయకుడు, దేశం గర్వించే దార్శనికుడు నారా చంద్రబాబునాయుడు మీద వేసిన అభాండాలు తొలిగిపోవాలని, ఆయన చెరసాల నుంచి బయటికి రావాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గడప మీద నిలబడి మొక్కుకున్న మొక్కు ‘నా గడప నించి నీ కొండ దాకా పాదయాత్ర’ చేసి వస్తా అని. ఈ రోజు తెలుగు వారి ఇలవేల్పు ఏడుకొండలస్వామి ఆశీస్సులతో, ప్రతి తెలుగు వాడి ప్రార్థనలతో మన బాబుగారు మళ్లీ అఖండ విజయంతో పూర్వ వైభవాన్ని సాధించుకున్నారు. ఇటీవలే కేసులు అన్నీ కొట్టేశారు.
Also Read- VV Vinayak: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చూసిన మాస్ డైరెక్టర్ స్పందనిదే..
శేషాచలం కొండ పిలుస్తోంది
నా మనసు కుదుటపడింది. నా కుటుంబం మొక్కు గుర్తుతెచ్చుకుంది. ఇంకా నా గడప నన్ను అడుగుతోంది మొక్కుబడి తీర్చుకోమని. శేషాచలం కొండ పిలుస్తోంది వచ్చి దర్శించుకోమని. అందుకే అమ్మ నాన్నల ఆశీర్వాదాలతో.. ఈ నెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు షాద్‌నగర్ మా ఇంటి గడప ముందు కొబ్బరి కాయ కొట్టి పాదయాత్ర మొదలెట్టి, ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకి చేరి ఏడుకొండలవాడి దర్శనం చేసుకోవడం సంకల్పం. ఇది రాజకీయ యాత్ర కాదు, నా మనోవేదన తీర్చిన, నా కోరిక నెరవేర్చిన, నా మాట ఆలకించిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామికి నా మొక్కుబడి చెల్లింపు..’’ అని బండ్ల గణేష్ ఈ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

