Ganja Seized: మాదక ద్రవ్యాలకు చెక్ పెట్టేందుకు ప్రారంభించిన స్పెషల్ డ్రైవ్ లో ఎక్సయిజ్ అధికారులు స్పీడ్ పెంచారు. ఒక్క రోజునే వేర్వేరు చోట్ల దాడులు జరిపి 60లక్షల రూపాయలకు పైగా విలువ చేసే 120 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆబ్కారీ భవన్ లో మీడియా సమావేశంలో ఎక్సయిజ్ అదనపు కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్ తో కలిసి వివరాలు వెల్లడించారు.
హన్మకొండకు చెంది ప్రస్తుతం ఘట్ కేసర్ లో నివాసముంటున్న కట్ల వివేక్ రెడ్డి గతంలో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేశాడు. చేస్తున్న ఉద్యోగం నుంచి ఆశించిన ఆదాయం రాకపోతుండటంతో తేలికగా డబ్బు సంపాదించటానికి కొంతకాలంగా గంజాయి దందా మొదలు పెట్టాడు. హన్మకొండ ప్రాంతానికే చెంది ప్రస్తుతం మేడిపల్లిలో ఉంటున్న దగ్గుమల్లి కిరణ్ రెడ్డితో కలిసి ఒడిషా మల్కాన్ గిరి జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తి నుంచి గంజాయి తెచ్చి ఉప్పల్ హెచ్సీఎల్ ప్రాంతంలోని ఓ గోడౌన్ లో స్టాక్ చేస్తున్నాడు.
Alos Read: Minister Seethakka: హామీలపై కట్టుబాటు.. ములుగు ప్రజలకు.. మంత్రి భరోసా!
ఇలా నిల్వ చేసిన గంజాయిని లోకల్ పెడ్లర్లకు అమ్ముతున్నాడు. ఈ మేరకు పక్కగా సమాచారాన్ని సేకరించిన ఉప్పల్ ఎక్సయిజ్ పోలీస్ స్టేషన్ సీఐ ఓంకార్, డీటీఎఫ్ సీఐ భరత్ భూషణ్, ఎస్సైలు నరేశ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డితోపాటు సిబ్బందితో కలిసి గోడౌన్ పై దాడి చేశారు. రెండు కిలోల చొప్పున ప్యాక్ చేసిన 56 ప్యాకెట్లు, కిలో చొప్పున ఉన్న 6 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో వివేక్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
పరారీలో ఉన్న అతని సహచరుడు కిరణ్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న రాంబాబును అరెస్ట్ చేయటానికి మల్కాన్ గిరికి త్వరలోనే ప్రత్యేక బృందాన్ని పంపించనున్నట్టు అదనపు కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి తెలిపారు. వివేక్ రెడ్డి, రాంబాబులపై ఇంతకు ముందే రెండేసి కేసులు నమోదై ఉన్నట్టు చెప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 53లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.
మరో కేసులో…
ఇక, ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్, జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు మరో రెండు కేసుల్లో 12.230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. చర్లపల్లి, రాంపల్లి ప్రాంతాల్లో కొంతమంది పెడ్లర్లు గంజాయి అమ్ముతున్నట్టుగా తెలియటంతో డీటీఎఫ్ సీఐ భరత్ భూషణ్, ఎస్సై శ్రీనివాస్ తోపాటు సిబ్బందితో కలిసి దాడులు చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన కుశ్వాహా, ఒడిషాకు చెందిన బైనాథ్ బిశ్వాల్ లను అరెస్ట్ చేసి వారి నుంచి గంజాయిని సీజ్ చేశారు. నిందితులను ఘట్ కేసర్ ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు. ఇక, నాందేడ్ నుంచి డీసీఎం వ్యాన్ లో గంజాయి వస్తున్నట్టుగా సమాచారం అందగా ఎస్టీఎఫ్ ఎస్సై బాలరాజు సిబ్బందితో కలిసి శివార్లలో దానిని పట్టుకున్నారు. 2.230 కిలోల గంజాయి, డీసీఎం వ్యాన్ ను సీజ్ చేశారు. వ్యాన్ డ్రైవర్ ఫైజల్ ను అరెస్ట్ చేశారు.
భారీగా బెల్లం పట్టివేత…
నాటు సారా తయారీలో ఉపయోగించే నల్ల బెల్లాన్ని ఎక్సయిజ్ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి ఓమినీ వ్యాన్ లో నల్ల బెల్లాన్ని నాగర్ కర్నూల్ ఎండబెట్ల గ్రామానికి తరలిస్తున్నట్టు తెలిసి ఎస్టీఎఫ్ ఎస్సై బాలరాజు, సాయికిరణ్, కౌశిక్, నితిన్, హనీష్, శంకర్, సంతోష్, సాయికృష్ణలతో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. 432 కిలోల నల్ల బెల్లం, 10 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు