Ganja Seized: డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్న ఇద్దరిని ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరికి అమెరికా పౌరసత్వం ఉంది. కాగా, అరెస్ట్ చేసిన నిందితుల నుంచి లక్ష రూపాయల నగదు, కారు, కుష్ గంజాయి, ఎల్ఎస్డీ బ్లాస్ట్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వీ.బీ.కమలాసన్ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం బేగంపేటలో నివాసముంటున్న తేజస్ కట్టా (29) కుటుంబం హైదరాబాద్ లోనే ఉండేది. తేజస్ కు ఏడాది వయసున్నపుడు కుటుంబం అమెరికా వెళ్లిపోయింది. అక్కడే పెరిగిన తేజస్ కు అమెరికా పౌరసత్వం కూడా వచ్చింది. కాగా, రెండేళ్ల క్రితం స్వదేశానికి వచ్చిన తేజస్ ముంబయిలో కొన్నాళ్లపాటు ఉద్యోగం చేశాడు. అక్కడ చెడు సావాసాలతో డ్రగ్స్ కు బానిసయ్యాడు. ముంబయిలో ఉద్యోగం మానేసిన హైదరాబాద్ వచ్చిన తరువాత బేగంపేటలో ఉంటూ రీగాక్స్ కంపెనీలో పని చేస్తున్నాడు.
Khammam District: మా నాన్నే లేకుంటే.. ఆ జిల్లా కలెక్టర్ ఉద్వేగం
అక్కడ అతనికి సోహైల్ అహ్మద్ (29)తో పరిచయం ఏర్పడింది. అప్పటికే సొహైల్ కూడా డ్రగ్స్ సేవించటానికి అలవాటు పడి ఉన్నాడు. ఇలా మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన ఇద్దరు తేలికగా డబ్బు సంపాదించాలని డ్రగ్స్ దందా మొదలు పెట్టారు.
ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి ముంబయి వెళ్లి చరస్, ఎల్ఎస్డీ బ్లాస్ట్, కుష్ గంజాయి తీసుకొచ్చి సన్ సిటీ ప్రాంతంలో అమ్ముతున్నారు. ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ సీఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం శంషాబాద్ ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు