Eagle Force Operation: ఈగల్ ఫోర్స్ అధికారులు బంజారాహిల్స్ పోలీసులతో కలిసి డ్రగ్స్ కు అలవాటు పడ్డ మహిళను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బ్లాట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ ప్రాంత వాస్తవ్యురాలైన హస్సా (47) అనే మహిళ చాలా రోజులుగా డ్రగ్స్ కు అలవాటు పడినట్టుగా ఇటీవల ఈగల్ ఫోర్స్ అధికారులకు తెలిసింది. దాంతో ఆమెపై నిఘా పెట్టారు. మంగళవారం హస్సా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లోని గెలాక్సీ మొబైల్ షాప్ వద్ద ఉండగా అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకుని ఆమె నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
గోవా నుంచి..
విచారణలో గోవా నుంచి ఈ డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా హస్సా వెల్లడించింది. 2024, డిసెంబర్ లో గోవా చూడటానికి వెళ్లినపుడు బోయిన్ పల్లికి చెందిన మీనా(Meena) అనే మహిళతోపాటు ఆమె స్నేహితుడు కృష్ణ పరిచయం అయినట్టుగా తెలిపింది. ముగ్గురం కలిసి మెర్మయిడ్ హోటల్ లో బస చేసినట్టుగా చెప్పింది. ఆ సమయంలో మీనా తనకు పరిచయం ఉన్న గోవాలోని సియోలిన్ ప్రాంతానికి చెందిన రోమీ భరత్ కళ్యాణి(Bharth Kalyani) అనే వ్యక్తిని పరిచయం చేసినట్టుగా తెలియచేసింది. రోమీ పసుపురంగులో ఉన్న ఓ డ్రగ్ పౌడర్ ను ఇవ్వగా మీనా దానిని టేబుల్ పై ఉన్న అద్దం మీద పెట్టి ముక్కు ద్వారా పీల్చినట్టు చెప్పింది. ఆ తరువాత మీనా చాలాసేపు మత్తులో ఉండిపోయినట్టుగా తెలిపింది. గోవా పర్యటన తరువాత నగరానికి తిరిగి వచ్చినట్టు చెప్పింది. అయితే, మీనా డ్రగ్ తీసుకున్న విషయం గుర్తుకొచ్చి డ్రగ్ తీసుకుంటే ఎలా ఉంటుందో? అని తెలుసుకోవాలని అనిపించినట్టుగా తెలియచేసింది. ఈ క్రమంలో మీనా నుంచి రోమీ మొబైల్ నెంబర్ తీసుకుని మరోసారి గోవా వెళ్లి ఆమెను కలిశానని చెప్పింది.
Also Read: Crime News: పనిమనుషుల అసాధారణ దారుణం.. సినిమాలను తలపించే రీతిలో ఐదేళ్లపాటు..
గతంలో కూడా..
అక్కడ రోమీ నుంచి డ్రగ్స్ కొని సేవించినట్టుగా తెలిపింది. మత్తు గమ్మత్తుగా అనిపించటంతో ఆ తరువాత చాలాసార్లు అతని నుంచి మాదక ద్రవ్యాలు కొని వాడానని పేర్కొంది. తనతోపాటు హైదరాబాద్(Hyderabad)కు చెందిన సుమీహా ఖాన్, బాక్సర్ అయిన వజీర్ కూడా డ్రగ్స్ తీసుకునే వారని వెల్లడించింది. ఈ క్రమంలో పోలీసులు హస్సాను అదుపులోని ఆమెపై కేసులు నమోదు చేశారు. ఇక, హస్సాకు డ్రగ్స్ అమ్ముతూ వచ్చిన రోమీపై గతంలో కూడా మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం పంజగుట్ట, ఆదిబట్ల, గోల్కొండ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్టుగా విచారణలో వెల్లడైందని అధికారులు తెలిపారు. గోల్కొండ స్టేషన్ లో నమోదైన కేసులో అరెస్టయిన రోమీ గతనెల 19న బెయిల్ పై విడుదలై బయటకు వచ్చినట్టుగా తెలిసిందన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగితా వారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. గడిచిన పది రోజుల్లో 27మంది డ్రగ్ పెడ్లర్లు, 18మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్నట్టు ఈగల్ ఫోర్స్ డీసీపీ సీతారాం(DCP Seetharam) తెలిపారు.వీరితోపాటు అయిదుగురు విదేశీ మహిళలను కూడా అరెస్ట్ చేశామన్నారు. 17కేసులు నమోదు చేసి 68గ్రాముల కొకైన్, 50.5గ్రాముల ఎండీఎంఏ, 2గ్రాముల ఎల్ఎస్డీ బ్లాట్స్, 381.93కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
Also Read: Om Shanti Shanti Shantihi: ‘సిన్నారి కోన’ పాటొచ్చింది.. తరుణ్, ఈషా రెబ్బా జంట ఎంత బావుందో!

