GHMC: ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన ఆర్థిక వనరులు పక్కదోవ పట్టకుండా జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలకు సిద్దమైంది. అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని వినియోగించుకుని అక్రమాలకు చెక్ పెట్టాలని భావిస్తుంది. డిజిటల్ చెల్లింపులు పెంచుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. చెల్లింపులన్నీ మ్యానువల్ గా కాకుండా డిజిటల్ గా స్వీకరించేందుకు రంగం సిద్దమైంది. ఈ మేరకు గూగుల్ టీమ్(Google) తో కమిషనర్ కర్ణన్(Karnan) నిర్వహించిన ప్రత్యేక సమావేశం ఫలించినట్లు తెలిసింది. సమావేశంలో ఇరు పార్టీల ఏకాభిప్రాయం కుదరటంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జీహెచ్ఎంసీ(GHMC), గూగుల్ మధ్య ఒప్పందం కూడా కుదిరినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరులైన ప్రాపర్టీ ట్యాక్స్(Property Tax), భవన నిర్మాణ అనుమతులతో పాటు ట్రేడ్ లైసెన్సుల చెల్లింపు సౌకర్యం పౌరులకు సులభతరం కానుంది.
కొత్త విధానంతో మరింత చేరువ
అంతేగాక వసూళ్లలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించకుండా, బల్దియా ఖజానాకు పారదర్శకంగా చేరేలా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతులు, నిర్మాణం పూర్తయిన తర్వాత భవనాలకు ఇచ్చే అక్యుపెన్సీ సర్టిఫికెట్లకు సంబంధించిన ఫీజులను ఆన్ లైన్‌లో, ఆర్టీజీఎస్(RTGS)లో సేకరిస్తున్న బల్దియా ప్రాపర్టీ ట్యాక్స్(Property Tax) కలెక్షన్ విషయంలోనూ సిబ్బంది ప్రమేయాన్ని గణనీయంగా తగ్గించాలని భావిస్తుంది. ట్యాక్స్(Tax), ట్రేడ్ లైసెన్స్ ఛార్జీలు యూపీఐ(UPI) తో జరిపే కొత్త విధానంతో మరింత మందికి చేరువ అవుతుందని భావిస్తున్నారు. ఇది ప్రజలకు సులభతరం చేయడమే కాకుండా జీహెచ్ఎంసీ(GHMC) ఖర్చులను తగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ యూపీఐ(UPI) ద్వారా సేకరించాలన్న ఆలోచన వచ్చినట్లు సమాచారం. ఇకపై నగరవాసులు ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను డిజిటల్ గానే స్వీకరించేందుకు బల్దియా రంగం సిద్దం చేసింది.
ఎస్టేట్ విభాగంలోనూ అమలు
ముఖ్యంగా వసూళ్లలో తరుచూ అక్రమాలు చోటుచేసుకునే ఎస్టేట్ విభాగంలోని మొత్తం అద్దెల వసూళ్లను కూడా డిటిజల్ చేయనుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఈ విభాగంలో పేరుకుపొయిన సుమారు రూ. 3 కోట్ల బకాయిలాను డిజిటల్ విధానంలో రాబట్టుకొనేందుకు బల్దియా సిద్దమైంది. బకాయిల వసూళ్ల కోసం ఇప్పటి వరకు 1400 అద్దెకిచ్చిన ఆస్తులకు నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ(GHMC) త్వరలోనే మరో 945 మలిగీలను అద్దెకు కేటాయించేందుకు త్వరలోనే టెండర్ల ప్రక్రియను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే ట్యాక్స్(Tax) బకాయిలను రిమైండ్ చేయటంతో పాటు పే నౌ ఆప్షన్(Pay Now Option) కూడా అందుబాటులోకి తెచ్చి, బకాయిదారుడు కేవలం క్షణాల్లోనే పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఛార్జీలను చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయనుంది. దీని కోసం ఆసక్తి గల సంస్థల నుండి ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ జీహెచ్ఎంసీ(GHMC) ఇటీవలే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) నోటిఫికేషన్ ప్రక్రియ తుది దశలో ఉంది.
Also Read: Commodities Prices: కొండెక్కిన పప్పులు కూరగాయల ధరలు.. తినేదెలా తెచ్చేదెలా!
ఎస్ఎంఎస్‌లు వ్యయం దుబారా ఖర్చుల ఆదాయం
జీహెచ్ఎంసీ(GHMC) ప్రతి ఏడాది సుమారు రూ. 2 వేల కోట్ల ఆస్తిపన్నును వసూలు చేస్తుండగా, అందులో సగానికి పైగా ఆన్ లైన్ చెల్లింపుల ద్వారానే వస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఇకపై గూగుల్ పే(Google Pay) వంటివి అందుబాటులోకి తీసుకువస్తే కలెక్షన్ పెరిగి, సిబ్బంది ప్రమేయం తగ్గుతుందని భావిస్తున్నారు. అంతేగాక, పన్ను నగదులో కూడా కొందరు చెల్లించటంతో స్వీకరించి పన్ను నగదును ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు(Tax inspectors), బిల్ కలెక్టర్లు తమ సొంత అవసరాలకు వినియోగించుకుని, నెలాఖరులో జీహెచ్ఎంసీ(GHMC) ఖజానాలో జమ చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ రకంగా కొందరు బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు భూములు, ఇండ్లు కొనుగోలు చేసిన ఘటనలు కూడా లేకపోలేవు.
బిజినెస్ ఖాతా ద్వారా పన్నులు వసూలు
ప్రస్తుతం పేటీఎం(Paytm), గూగుల్ పే(Google Pay), ఇతర యూపీఐ యాప్(UPI App), మై జీహెచ్ఎంసీ మొబైల్ యాప్(My GHMC Mobile App), జీహెచ్ఎంసీ వెబ్ సైట్ ద్వారా ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారు. వీటికి తోడు వాట్సప్ సేవలు అందుబాటులోకి వస్తే ఆన్ లైన్ కలెక్షన్ మరింత పెరుగుతతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ(GHMC) ఆస్తిపన్ను బకాయిలు, చెల్లింపు గడువులు, ఓటీపీలు(OTP) వంటి కీలక సమాచారాన్ని అందించడానికి ఏటా దాదాపు 20 లక్షల ఎస్ఎంఎస్ల(SMS)ను పంపిస్తున్నట్లు సమాచారం. దీనికి గాను ప్రతి వెయ్యి ఎస్ఎంఎస్(SMS) మేసేజీలకు రూ.52 చొప్పున భారీ మొత్తాన్ని జీహెచ్ఎంసీ(GHMC) ఖర్చు చేస్తుంది. వాట్సప్ లో బిజినెస్ ఖాతా ద్వారా పన్నులు వసూలు చేస్తే, ఈ ఎస్ఎంఎస్ ఖర్చులు తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు డిజిటల్‌గా చెల్లించిన మొత్తాన్ని పేమెంట్ గేట్ వే(Payment gateway) సేవలు అందించే బ్యాంకులు, సంస్థలు రెండు రోజుల పాటు తమ ఖాతాల్లో ఉంచుకు వడ్డీని పొందుతాయి. కొత్త విధానం ప్రజలకు పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేయడమే కాకుండా జీహెచ్ఎంసీ(GHMC)లోని దుబారా ఖర్చులను కూడా ఆదా చేయోచ్చునని అధికారులు అంఛనాలేస్తున్నారు.
Also Read: TS Politics: గ్రేటర్ గులాబీ బాధ్యతలు.. ఆ ఇద్దరిలో ఎవరికి?