Srilatha Shobhan Reddy: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అరకొర వసతుల మధ్య ఉన్న దాదాపు 70 ఏళ్ల చారిత్రక బస్తీల సమస్యలను డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి (Srilatha Shobhan Reddy) దంపతులు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లారు. తార్నాక డివిజన్ అభివృద్ది, డివిజన్ పరిధిలోని బస్తీల్లో మౌలిక వసతులను మెరుగు పరిచేందుకు రూ.25 కోట్లు కేటాయించాలని మేరకు సీఎంకు వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించిన సీఎంను గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు శోభన్ రెడ్డి కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ తార్నాక డివిజన్ ప్రజల తరఫున పలు కీలక సమస్యలను సీఎంకు వివరించారు.
Also Read: Mahesh Babu: ఈ రోజైన ఈడీ విచారణకు మహేష్ బాబు హాజరవుతారా?
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలి
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో గత 70 సంవత్సరాలుగా సుమారు తొమ్మిది బస్తీల్లో వేలాది కుటుంబాలు నివసిస్తూ వస్తున్నాయని తెలిపారు. సుమారు 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ బస్తీలు, మౌలిక సదుపాయాలు కరువయ్యాయని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, యూనివర్సిటీ యాజమాన్యం అవసరమైన సౌకర్యాలను నిలిపివేయడం వంటి కారణాల వల్ల తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఆయా బస్తీల ప్రజలకు శాశ్వత పునరావాసం కల్పించే దిశగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే 20 ఎకరాల భూమిని కేటాయించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం ను కోరారు.
70 ఎకరాల భూమి స్వేచ్ఛగా లభిస్తుంది
ఈ ప్రతిపాదన అమలుతో యూనివర్శిటీ యాజమాన్యానికి సుమారు 70 ఎకరాల భూమి స్వేచ్ఛగా లభిస్తుందని, ఇది పరస్పర ప్రయోజనకరమని తెలిపారు. అదేవిధంగా, గత ఎంపీ ఎన్నికల సందర్భంగా మణికేశ్వర్ నగర్‌లో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆస్పత్రి నిర్మాణ ప్రతిపాదనను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. తార్నాక డివిజన్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు, పార్కులు తదితర మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.25 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని సీఎం ను కోరగా, ఇందుకు స్పందించిన సీఎం ఈ అంశాలపై వెంటనే వైస్ ఛాన్సలర్‌తో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు డిప్యూటీ మేయర్ వెల్లడించారు.
Also Read: Gold Rate Today : భారీ గుడ్ న్యూస్.. గోల్డ్ కొనాలనుకునే వారు ఇప్పుడే కొనేయండి!

