h-city
హైదరాబాద్

KBR Park: కేబీఆర్ పార్కు చుట్టూ ఎచ్ సిటీ-1 పనులకు మళ్లీ బ్రేక్?

ఎటూ తేలని పదేళ్ల పంచాయితీ
స్థల సేకరణ చేయాల్సిన ఆస్తులు 269
ఇప్పటికే 105 ఆస్తులకు జీహెచ్ఎంసీ మార్కింగ్
మళ్లీ కోర్టుకెక్కిన స్థల సేకరణ వివాదం
ఆస్తులను వదులుకునేందుకు ఇష్టపడని యజమానులు
అలైన్‌మెంట్ మార్చాలంటూ అధికారులపై ఒత్తిడి

KBR Park: మహానగరం(Greater Hyderabad)లో నిత్యం అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్(Jublihills) కేబీఆర్ పార్కు(Kbr Park) చుట్టూ సిగ్నల్ రహిత ప్రయాణాన్ని(Signal Free Journey) అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు(TG Govt) చేస్తున్న ప్రయత్నాలకు ఆది నుంచి అడ్టంకులు ఎదురవుతున్నాయి. అడ్డంకులన్నీ తొలగిపోయాయని భావించిన జీహెచ్ఎంసీ(GHMC) పార్కు చుట్టూ ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు(Fly overs), ఏడు అండర్ పాస్‌(Under pass)లకు టెండర్ల(tenders) ప్రక్రియ కూడా చేపట్టారు. కానీ, స్థల సేకరణను సవాల్ చేస్తూ కొందరు తాజాగా కోర్టును ఆశ్రయించటంతో హెచ్- సిటీ(H-city) పనులు ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సుమారు పదేళ్ల నుంచి ఇక్కడి పనులకు వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. గత సర్కారు హయాంలో పార్కులోని పచ్చదనం, పర్యావరణం ధ్వంసమవుతాయని కొందరు పర్యావరణ నిపుణులు ఎన్జీటీనీ ఆశ్రయించటంతో అప్పట్లో పనులు ముందుకు సాగలేదు. ఫలితంగా ఎస్ఆర్ డీపీ-1 కింద కేబీఆర్ పార్కు తర్వాత చేపట్టిన దాదాపు 40 పనులు పూర్తయ్యాయి. చుట్టూ పనులకు ఆదిలోనే అడ్డంకులు ఎదురై అక్కడే నిలిచిపోయాయి. ఏడాది క్రితం సర్కారు మారిన తర్వాత అడ్డుంకులన్నీ తొలగాయని భావించిన జీహెచ్ఎంసీ, కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టాల్సిన పనులన్నింటినీ ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ సిటీ-1 కిందకు తీసుకువచ్చింది. స్థల సేకరణ ప్రక్రియను మొదలుపట్టే సమయానికి మరో అడ్డంకి వచ్చి పడటంతో మరోసారి పనులకు బ్రేక్ పడినట్టయింది. గత గులాబీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్ డెవలప్‌మెంట్ కార్యక్రమం (ఎస్ఆర్ డీపీ)-1 కింద కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ రహిత, పాదచారుల రక్షిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆరు ఫ్లై ఓవర్లు, ఏడు అండర్ పాస్‌ల నిర్మాణానికి రూ.1090 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ ఇందుకు సంబంధించి రూ.845 కోట్లకు సర్కారు నుంచి పరిపాలనపరమైన ఆమోదం కూడా పొంది, స్థల సేకరణకు మార్కింగ్ కూడా చేసింది. మూడు జంక్షన్లకుగానూ 105 చోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం కూడా తీసుకున్నారు. ఇందుకు 18 చోట్ల ఆస్తుల నుంచి స్థలాలను సేకరించేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ అధికారులు జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టు జంక్షన్‌లో రహదారి విస్తరణలో 47 ఆస్తులు, ముగ్ధ జంక్షన్‌ విస్తరణలో భాగంగా 40 ఆస్తుల నుంచి స్థలాన్ని సేకరించేందుకు, మొత్తం 105 ఆస్తులకు మార్కింగ్ చేశారు.

గజం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్యే

పార్కు చుట్టూ హెచ్ సిటీ-1 పనుల కోసం జీహెచ్ఎంసీ గుర్తించిన మొత్తం 105 ఆస్తులకు మార్కింగ్ చేయగా, ఒక్కో ఆస్తి నుంచి 30 నుంచి 50, 60 అడుగుల వరకు స్థలాన్ని సేకరించాల్సి ఉంది. ప్రైమ్ లొకేషన్ కావటం, గజం స్థల విలువ రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య ఉండటంతో స్థలాలను వదులుకునేందుకు కొందరు బడాబాబులు సిద్ధంగా లేరని తెలిసింది. ఇందుకు గాను జీహెచ్ఎంసీ స్థల సేకరణ ప్ర్రక్రియను అడ్డుకునేందుకు లీగల్‌గా తమకు అనుకూలమైన లొసుగులను అన్వేషిస్తున్నట్లు సమాచారం. పార్కు చుట్టూ నిర్మించనున్న ఏడు స్టీల్ ఫ్లై ఓవర్ల అలైన్ మెంట్‌ను మార్చే ప్రయత్నాలను ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రయత్నాల్లో ఓ ఆంధ్రా వ్యాపారితో పాటు మాజీ మంత్రి ఒకరు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తన ఆస్తి అని ప్రస్తుతం పొజిషన్‌లో ఉన్న మాజీ మంత్రి వద్ద జీహెచ్ఎంసీ సేకరించనున్న స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు లేకపోవటంతో ఎలాగైనా స్థల సేకరణ నుంచి తనకున్న స్థలాన్ని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఒత్తిడి తట్టుకోలేక

పనులకు స్థలాలిచ్చేందుకు ఇష్టం లేని కొందరు బడా బాబులు, వ్యాపారులు పరోక్షంగానే పనులను అడ్డుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఓ వ్యాపారికి చెందిన ఆస్తి నుంచి సుమారు 30 అడుగుల స్థలాన్ని సేకరించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేసినా, తనకు అనుకూలంగా మార్కింగ్ మార్చేందుకు వీలుగా సదరు వ్యాపారి జీహెచ్ఎంసీ అధికారులతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నది. పార్కు చుట్టూ నిర్మించే హెచ్ సిటీ-1 పనులకు సంబంధించి ఓ మాజీ మంత్రితో కలిసి సదరు వ్యాపారి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అలైన్ మెంట్ మార్పు, స్థల సేకరణ నుంచి ఆస్తులు కాపాడాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. పైగా, పనులు చేపట్టేందుకు కావల్సిన స్థాయిలో ఇంజినీర్లు అందుబాటులో లేరన్న విషయాన్ని సాకుగా చూపుతూ ప్రతిపాదనలను తాత్కాలికంగా పక్కనబెట్టినట్లు సమాచారం. బడాబాబులు ఒత్తిడికి తలొగ్గి సర్కారు అలైన్‌మెంట్‌ను మార్చుతుందా? లేక ఇప్పటికే ఆలస్యమైన పనులకు ఎవరికెలాంటి మినహాయింపులివ్వక స్థల సేకరణను వేగవంతం చేస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

సేకరణలో ఎవరి ఆస్తులెంతంటే?

కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్ సిటీ పనుల కోసం జీహెచ్ఎంసీ మొత్తం 269 ఆస్తులను గుర్తించగా, వీటిలో ఇప్పటికే జీహెచ్ఎంసీ 105 ఆస్తులకు మార్కింగ్ చేసింది. వీటిలో ప్రస్తుత సర్కారులో ఉన్నతమైన హోదాలో కొనసాగుతున్న నేతకు చెందిన సుమారు 82.22 చదరపు గజాల స్థలాన్ని సేకరించాల్సి ఉండగా, అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆస్తి నుంచి 265.58 చదరపు గజాలు, ఓ సీనీ నటుడి బంధువులకు చెందిన ఆస్తి నుంచి సుమారు 204.77 చదరపు గజాల స్థలాన్ని సేకరించాల్సి ఉండగా, దన్ని సవాల్ చేస్తూ సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఆయన బాటలోనే అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి కూడా వెళ్లనున్నట్లు సమాచారం. మరో సినీ నిర్మాతకు చెందిన ఆస్తి నుంచి 133.77 చదరపు గజాలు, మరో సీనీ నటుడికి చెందిన ఆస్తి నుంచి 377.66 చదరపు గజాలు, ఓ టీవీ చానెల్ అధినేతకు చెందిన ఆస్తి నుంచి 479.22 చదరపు గజాల స్థలాల్ని సేకరించాల్సి ఉండగా, స్థలాలిచ్చేందుకు వీరంతా సిద్ధంగా లేరని తెలిసింది.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు