Hyderabad News: కారు రహదారి గుండా వెళ్తోంది. ఆ సమయాన కారులో ప్రయాణికులు సైతం ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో కారులో ప్రయాణిస్తున్న వారు తమ గమ్యానికి చేరే పరిస్థితి. అంతలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు కారు వ్యాపించాయి. ఇక అంతే హుటాహుటిన కారులో ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు.
కారు అగ్నికి ఆహుతి అవుతున్న దృశ్యాన్ని గమనించిన స్థానికులు ఏం జరిగిందంటూ సందేహంలో పడ్డారు. చివరికి అసలు విషయం తెలిసి.. వెళ్తున్న కారులో మంటలు ఎలా వ్యాపించాయంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో గల హబ్సిగూడలో జరిగింది.
రామంతపూర్ నుండి వారసిగూడకు వెళ్లేందుకు ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సాయంత్రం కారులో బయలుదేరారు. కారు ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ వద్దకు రాగానే ఒక్కసారిగా కారుకు మంటలు వ్యాపించాయి.
మరికొద్ది క్షణాల్లో గమ్యాన్ని చేరుకునే సమయంలో కారుకు ఒక్కసారిగా మంటలు వ్యాపించగా ప్రయాణికులు ఆందోళన చెందారు. హుటాహుటిన కారులో నుండి బయటకు పరుగులు తీశారు. స్థానికుల ద్వారా ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారాన్ని అందజేశారు. హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు.
అప్పటికే కారు పూర్తిగా దగ్ధం కాగా, కారుకు మంటలు వ్యాపించడానికి గల కారణాలు తనకు తెలియదని కారు డ్రైవర్ తెలిపారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేకడంతో భయాందోళనకు గురై బయటకు వచ్చినట్లు, అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పిందని డ్రైవర్ అన్నారు.
Also Read: CM Revanth Reddy – PM Modi: ప్రధాని గారూ.. కాస్త టైమ్ ఇవ్వండి.. సీఎం రేవంత్ రెడ్డి
అయితే వెళ్తున్న కారులో మంటలు వ్యాపించినట్లు తెలుసుకున్న స్థానికులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. వేడి గాలుల ఎఫెక్ట్ అంటూ కొందరు, షార్ట్ సర్క్యూట్ ఎఫెక్ట్ అంటూ మరికొందరు.. తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పట్టుమని పది నిమిషాల్లో కారు పూర్తిగా దగ్ధం కావడం విశేషం.