Admit Card – UPSC: హైదరాబాద్ లో 25 న (ఆదివారం) నిర్వహించనున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష కు అభ్యర్థులు తప్పకుండా అడ్మిట్ కార్డుతో రావాలని, లేని పక్షంలో పరీక్షా సెంటర్ లోకి ఎంట్రీ ఉండదని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. పరీక్షలను సాఫీగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆయన వెల్లడించారు. పరీక్ష నిర్వహణపై ఆయన మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో గల సరోజిని నాయుడు వనిత మహావిద్యాలయ లోని సమావేశ మందిరంలో పరీక్ష నిర్వహణపై సూపర్వైజర్లు, రూట్ ఆఫీసర్లు, సూపర్ వైజర్లు, అబ్జర్వర్ లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను ఎంతో జాగ్రత్తగా, సాఫీగా, ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 25 ఆదివారం రోజున నిర్వహించనున్నసివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు హైదరాబాద్ లో 95 పరీక్షా కేంద్రాలలో 43 వేల 676 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు ఆయన తెలిపారు. యూపీఎస్సీ నిబంధనలు అనుగుణంగా పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. మే 25 న పేపర్- 1 ఉదయం 9.30 గంటల నుండి ఉదయం 11.30 గంటల వరకు, పేపర్- 2 మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Also Read: BRS on Cm Revanth Reddy: సీఎం అబద్దపు మాటలు మానుకోవాలి.. తులం బంగారం ఏమైంది ?
యూపీఎస్సీ నిబంధనల మేరకు పరీక్ష కు 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లు మూసి వేయడం జరుగుతుందన్నారు. ఉదయం పరీక్షకు 30 నిమిషాల ముందు అనగా ఉదయం తొమ్మిది గంటల కల్లా , మధ్యాహ్నం 30 నిమిషాల ముందు అంటే మధ్యాహ్నం 2.00 గంటలలోపే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆ తర్వాత వచ్చిన వారికి అనుమతించడం జరగదని ఆయన తేల్చి చెప్పారు. యూపీఎస్సీ నిబంధనల మేరకు అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రాలలోకి తీసుకువెళ్లడానికి అనుమతి లేదన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలలోకి వెళ్లేటప్పుడు మహిళా అభ్యర్థులకు మహిళా పోలీసులు, పురుష అభ్యర్థులకు మగ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించాలని పోలీసుశాఖకు కలెక్టర్ సూచించారు.
గుర్తింపు కార్డు లేని వారిని ఎవరిని కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించకూడదని, అనుమతి లేని వ్యక్తులు పరీక్షా కేంద్రాల్లో లేకుండా చూడాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు,క్యాలిక్యులేటర్లు, సెల్ ఫోన్, పెజర్స్, బ్లూ టూత్, పెన్ డ్రైవ్స్, స్మార్ట్ వాచ్, ప్రోగ్రామ్ డివైస్, ఎలక్ట్రానిక్ గాడ్జెస్, ఎలక్ట్రానిక్ వస్తువులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద జామర్ ఏర్పాటు చేయాలన్నారు, పరిశుభ్రమైన టాయిలెట్స్, త్రాగునీరు ఉండేలా చూడాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉండేలా ముందుగానే పరీక్ష కేంద్రం సూపర్ వైజర్లు పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు.
Also Read: Kakatiya – Kamal Chandra Bhanj: ఓరుగల్లులో కాకతీయ వారసుని సందడి.. నేను రాజును కాను ఒక సేవకున్ని!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్ష కేంద్రాల సూపర్ వైజర్లు పనిచేయాలన్నారు. అధికారులందరూ సమయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి విజయవంతం చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద వస్తువుల భద్రత కోసం ఎలాంటి స్టాక్ రూమ్ లు ఏర్పాటు చేయడం లేదని, ఇది గమనించి అభ్యర్థులు ఎవరు కూడా బ్యాగులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ తో పాటు ఇతర వస్తువులను పరీక్ష కేంద్రానికి తీసుకురావద్దని కలెక్టర్ సూచించారు. .
పరీక్ష కేంద్రంలోనికి పెన్, పెన్సిల్, ఐడి కార్డ్, అడ్మిట్ కార్డ్ ఫోటోగ్రాఫీ మాత్రమే అనుమతించబడుతుందని కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రంలో నిరంతర విద్యుత్ సరఫర, మెటల్ డిటెక్టర్ లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఈ.వెంకటాచారి యూపీఎస్సీ పరీక్ష నిర్వహణ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలోఅడిషనల్ డీసీపీ ట్రాఫిక్ తేజావత్ రాందాస్, ఆర్డీఓ సాయిరాం, మల్కాజ్ గిరి ఏసీపీ చక్రపాణి, తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: MLA Harish Rao: ఆవేశం తప్ప కంటెంట్ లేదు.. సీఏంపై హరీష్ రావు కామెంట్స్!