Gulzar House Fire Accident
తెలంగాణ, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Gulzar House Fire Accident: ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్.. గుల్జార్ హౌస్‌లో ఇంత ఘోరం ఎలా జరిగింది?

Gulzar House Fire Accident: పాతబస్తీ గుల్జార్​హౌస్​ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోరం జరిగింది. గ్రౌండ్​ప్లస్​రెండంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంట్లో ఒకే కుటుంబానికి చెందిన 17మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు వేర్వేరు ఆస్పత్రుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల్లో పదేళ్ల వయసులోపు చిన్నారులు 8మంది ఉండగా 60 సంవత్సరాల పైబడిన వృద్ధులు నలుగురు ఉన్నారు. షాట్​ సర్క్యూట్​కారణంగా తలెత్తిన మంటలతో ఏసీ కంప్రెషర్​పేలి పోటంతోనే ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. ఒక్కసారిగా అగ్నికీలలు నాలుకలు చాచి విస్తరించటం.. దట్టమైన పొగ అలుముకోవటంతో బయటకు రావటానికి ఒకే ఇరుకు దారి ఉండటం వల్లనే ప్రాణనష్టం అధికంగా సంభవించింది. భవనంలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రమాదానికి గురైన భవనానికి పక్కనే ఉన్న మరో బిల్డింగ్ గోడకు స్థానికుల సహాయంతో రంధ్రం చేసిన సిబ్బంది అతి కష్టం మీద గాయపడ్డ వారిని బయటకు తీసుకొచ్చారు.. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదంపై ఎవరేమన్నారు? అనే దానిపై ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ కథనం..


Read Also- AP Politics: స‌క‌ల శాఖ మంత్రిగా లోకేష్ అవ‌తారం!

Fire Accident


మేమున్నామనీ..
సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ప్రధాన మంత్రి మోదీ కూడా జరిగిన దుర్ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దుర్ఘటనలో చనిపోయన వారి కుటుంబాలకు పీఎం సంక్షేమ నిధి నుంచి రూ.2లక్షలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.50వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​గాంధీ కూడా అగ్నిప్రమాదంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఇక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్​ఖర్గే.. ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్​కళ్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు నేతలు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హరీష్, కేటీఆర్.. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎక్స్ వేదికగా కేటీఆర్ చెప్పారు.

Hyderabad Tragedy

Read Also- Miss World: టూరిజం శాఖ ఫెయిల్.. అంతా ఆ ఇద్దరి వల్లేనా?

అసలేం జరిగింది?
జ్యువెలరీ షాప్​నడిపిస్తున్న పంకజ్​కుటుంబం గుల్జార్​హౌస్​ప్రాంతంలో నివాసం ఉంటోంది. భవనం గ్రౌండ్​ఫ్లోర్‌లో దుకాణం ఉండగా మొదటి, రెండో అంతస్తుల్లో కుటుంబం నివాసముంటోంది. శనివారం రాత్రి వ్యాపార లావాదేవీలు ముగిసిన తరువాత పంకజ్​దుకాణం షట్టర్లు వేసేసి లాక్​చేశాడు. దాని పక్కనేపై అంతస్తులకు వెళ్లటానికి మెట్లు ఉన్నాయి. అక్కడ కూడా ఉన్న షట్టర్‌ను మూసివేసిన పంకజ్​తాళాలు వేశాడు. ఇక, వేసవి సెలవులు కావటంతో అత్తాపూర్‌లో ఉంటున్న అతని సోదరి, ఆమె పిల్లలు, బంజారాహిల్స్ ప్రాంతం నుంచి వచ్చిన మరికొందరు బంధువులు అంతా కలిసి 30 మంది భోజనాలు చేసి, నిద్రపోయారు. కాగా, శనివారం తెల్లవారు జామున 5.30గంటల సమయంలో భవనం మొదటి అంతస్తులో షాట్ సర్క్యూట్​సంభవించి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. అదే సమయంలో ఏసీ కంప్రెషర్​పేలిపోయింది. దాంతోపాటు గ్యాస్​సిలిండర్లు కూడా పేలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. ఇటీవలే చెక్కతో ఇంటీరియర్​డిజైనింగ్ చేయటం.. మంటలు ఎగిసిన చోట తేలికగా మండే స్వభావం ఉన్న వస్తువులు ఉండటంతో చూస్తుండగానే అగ్ని కీలలు నాలుకలు చాచి విస్తరించాయి. ఆ సమయంలో పంకజ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులు అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఏసీ కంప్రెషర్, గ్యాస్​ సిలిండర్ల పేలుళ్ల చప్పుళ్లతో నిద్ర మేల్కున్నారు. చూడగా అప్పటికే మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఇల్లంతా దట్టమైన పొగ అలుముకుని ఉంది. బయటకు వచ్చే మెట్ల మార్గం వైపు కూడా మంటలు ఎగిసి పడుతూ కనిపించాయి. దాంతో ప్రహ్లాద్​(70), మున్నీబాయి (70), రాజేందర్​మోడీ(65), సుమిత్ర (60)లు చిన్న పిల్లలైన హమేయ్ (7), ప్రియాంశ్​(4), ఇరాజ్​ (2), ఆరుషి (3), రిషబ్​(4), ప్రథమ్​(18 నెలలు), అనుయాన్​(3), ఇద్దూ (4)లను తీసుకుని ఓ గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకున్నారు. అభిషేక్​(31), శీతల్​(35), వర్ష (35), పంకజ్​(36), రజిని (32)లు మరో గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నారు.

రక్షించండి.. రక్షించండి..
మంటలు అంతకంతకూ పెద్దగా అవుతుండటం.. పొగ గదుల్లో నిండి పోతుండటంతో ధైర్యం చేసిన రజిని, వర్షలు బాల్కనీలోకి వచ్చి తమను రక్షించాలంటూ పెద్దగా కేకలు పెట్టారు. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న మీర్జాతో పాటు మరికొందరు ఏం జరిగింది? అని ప్రశ్నించగా అగ్ని ప్రమాదం జరిగిందని, ఇంట్లో చిన్నపిల్లలు, ముసలివాళ్లు ఉన్నారని చెప్పారు. వెంటనే మెట్ల మార్గం షట్టర్​తాళాలు పగులగొట్టిన మీర్జా మరికొందరు పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ మార్గం మొత్తం దట్టమైన పొగతో నిండిపోవటంతోపాటు మంటలు కనిపించాయి. ఈలోపు సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నాలు ప్రారంభించారు. తీవ్రత ఎక్కవుగా ఉండటంతో పరిస్థితినిపై అధికారులకు తెలియచేశారు. దాంతో ఉన్నతాధికారులు మొఘల్ పురా, హైకోర్టు, గౌలిగూడ, సాలార్​జంగ్​మ్యూజియం, చందూలాల్ బారాదరి, ఎల్బీనగర్, గాంధీ ఆస్పత్రి ఔట్ పోస్ట్, రాజేంద్రనగర్, సచివాలయం, లంగర్​హౌస్​తదితర ప్రాంతాల నుంచి మొత్తం 12 ఫైరింజన్లను అక్కడికి పంపించారు. వీటితోపాటు లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు హైడ్రాలిక్​ ప్లాట్ ఫాంతో ఉన్న హైడ్రాలిక్​టెండర్‌ను కూడా తరలించారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఛార్మినార్ వైపు వచ్చే అన్ని రహదారులను మూసివేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రమాదం జరిగిన చోట రోడ్లు చిన్నవిగా ఉండటంతో ఫైరింజన్లు వెంటనే దుర్ఘటనా స్థలానికి చేరుకోవటంలో సమస్యలు తలెత్తాయి. దాంతో కొందరు స్థానికులు ప్రమాదానికి గురైన భవనం పక్కనే ఉన్న మరో బిల్డింగ్ గోడకు రంధ్రం చేశారు. ఈలోపు అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కొందరు పొగతో నిండిపోయిన మెట్ల మీదుగానే భవనం లోపలికి చేరుకున్నారు.

Read Also- YS Jagan: ఏ క్షణమైనా వైఎస్ జగన్ అరెస్ట్.. వైసీపీలో నరాలు తెగే టెన్షన్!

తలుపులు తెరిచి చూడగా…
లోపలికి చేరుకున్న వెంటనే ఓ గది తలుపులు తెరిచి చూడగా దాంట్లో ప్రహ్లాద్, మున్నీబాయి, రాజేందర్​మోడీ, సుమిత్రలు.. చిన్న పిల్లలైన హమేయ్, ప్రియాంశ్, ఇరాజ్, ఆరుషి, రిషబ్, ప్రథమ్, అనుయాన్​ , ఇద్దూలు పొగతో ఊపిరి ఆడక స్పృహ కోల్పోయి కనిపించారు. ఇతర గదుల్లో మిగితా వారు కాలిన గాయాలకు గురయ్యారు. ప్రమాద తీవ్ర దృష్ట్యా ముందుగానే రప్పించిన 14 అంబులెన్సుల్లో వీరిని మలక్‌పేట యశోధ, డీఆర్డీవో అపోలో, హైదర్‌గూడ అపోలో, నాంపల్లి కేర్​ఆస్పత్రులతో పాటు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరిలో 17మంది చనిపోయారు. మిగితా వారు చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనాకరంగా ఉన్నట్టు సమాచారం.

 

Hyd Fire Accident
మార్చురీ వద్దకు డిప్యూటీ సీఎం…

అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ అంబులెన్సుల్లో అత్తాపూర్​, బంజారాహిల్స్​ లోని వారి నివాసాలకు పంపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ అక్కడికి వచ్చారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Ponnam Prabhakar

Read Also-Hyderabad: హైదరాబాద్‌లో ఘోర విషాదం.. అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి..

మంత్రిని పంపించిన సీఎం…
ప్రమాదం గురించి తెలియగానే సీఎం రేవంత్ రెడ్ది.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను దుర్ఘటనా స్థలానికి పంపించారు. సహాయక చర్యలు అందే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ క్రమంలో ప్రమాద స్థలానికి వచ్చిన పొన్నం.. అధికారులను అడిగి దుర్ఘటన కారణాలను తెలుసుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. జరిగింది అత్యంత బాధాకరమైన సంఘటన అన్న మంత్రి పొన్నం.. బాధితుల కుటుంబాలను ఆదుకోవటానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ సమీక్ష జరుపుతున్నట్టు చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రమాద స్థలానికి వచ్చారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిమాపక శాఖకు మరిన్ని అధునాతన పరికరాలను సమకూర్చాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం తెలియచేస్తోందని వ్యాఖ్యానించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ప్రమాద స్థలానికి రాకపోవటం వల్లనే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందన్నారు. ఇక, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి ప్రమాద స్థలం వద్ద మాట్లాడుతూ సమాచారం అందిన వెంటనే తమ సిబ్బంది ప్రమాద స్థలానికి వచ్చారన్నారు. మంటలను ఆర్పటంతోపాటు లోపల చిక్కుకున్న వారిని రక్షించటానికి అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించగా దీన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు. ప్రమాద స్థలాన్ని డీజీపీ జితేందర్, కమిషనర్ ఆనంద్, దక్షిణ మండలం డీసీపీ స్నేహా మెహ్రాతోపాటు పలువురు ఉన్నతాధికారులు సందర్శించారు. పార్లమెంట్​సభ్యుడు అనిల్ యాదవ్, స్థానిక మజ్లీస్​ ఎమ్మెల్యే కూడా వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Kishan Reddy

Read Also- Kandula Durgesh: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బాటలో మంత్రి కందుల దుర్గేష్!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు