Kavitha: సొంత ఎమ్మెల్సీ కవిత(KAVITHA)కు రాజకీయంగా చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్(BRS) పార్టీ సిద్ధమైంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఆమెను తొలగించకుండానే మరొకరికి బాధ్యతలు అప్పగించింది. ఆమెను కావాలనే సంఘ బాధ్యతల నుంచి తొలగించినట్లు స్పష్టమవుతున్నది. ఏదైనా సంఘం నుంచి ఒకరి బాధ్యతలు తొలగించాలంటే జనరల్ బాడీ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. అందులో తీర్మానం చేయాల్సి ఉంటుంది. అయితే అలాంటిదేమీ లేకుండానే అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే తొలగించడంతో పార్టీలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Also Read: Kavitha meets KCR: కేసీఆర్ తో కవిత భేటీ ఆసక్తికర చర్చ.. రహస్యం ఏంటి?
ఇన్ని చేసినా.. చివరకు..
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ(BRS party)ఎమ్మెల్సీగా కవిత కొనసాగుతున్నారు. మరోవైపు తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం(టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటం చేశారు. కేంద్రం బొగ్గు గనులు వేలం వేయకుండా అడ్డుకున్నారు. నాడు సీఎంగా ఉన్న కేసీఆర్‌తో మాట్లాడి సింగరేణి కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపారు. అంతేకాదు వరంగల్‌లో ఈ ఏడాది ఏప్రిల్ 27న జరిగిన పార్టీ రజతోత్సవ సభకు జన సమీకరణలోనూ కీలక భూమిక పోషించారు.
సింగరేణికి చెందిన అన్ని డివిజన్లలోనూ టీబీజీకేఎస్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కేంద్రం సింగరేణి కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే పోరాట బాట పడుతున్నారు. ఎప్పటికప్పుడు కార్మికులను సైతం అలర్ట్ చేస్తున్నారు. అటు టీబీజీకేఎస్‌తో పాటు ఇటు జాగృతి సింగరేణి కమిటీలను ఏర్పాటు చేసి మరింత పటిష్టం చేయాలని ముందుకు సాగుతున్నారు.
పార్టీ నుంచి కూడా సాగనంపుతారా?
ఇప్పటికే వరంగల్ సభపై తన తండ్రి, బీఆర్ఎస్(Brs) అధినేత కేసీఆర్‌కు పర్సనల్‌గా రాసిన లేఖ లీక్ అయింది. కవిత(Kavitha)పై కుట్రలతోనే లీక్ చేశారనే ప్రచారం జరిగింది. తనను బద్నాం చేయాలని ప్రయత్నం జరుగుతుందని, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆమె ఘాటు విమర్శలు చేశారు. దీంతో పార్టీలో సర్వత్రా చర్చ జరుగుతూనే ఉన్నది. ఆ ఘటన సద్దుమణగకముందే మళ్లీ కవితను టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా తొలగించారు. ఆమె అమెరికా పర్యటనలో ఉండడం, జనరల్ బాడీ సమావేశాన్ని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించకుండా తెలంగాణ భవన్‌లో నిర్వహించడం, సమాచారం లేకుండానే కవితను పదవి నుంచి తొలగించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. కేవలం సంఘం నుంచే తొలగించారా? లేకుంటే త్వరలోనే పార్టీ నుంచి కూడా సాగనంపుతారా? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్నది. పార్టీకోసం పని చేస్తున్నానని పేర్కొంటున్న కవితను అసలు ఎందుకు సంఘ పదవి నుంచి ఉద్వాసన పలికారు అనేది ఇప్పుడు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
కేటీఆర్‌తో విభేదాలు
గత కొంతకాలంగా కేటీఆర్, కవిత(Kavitha) మధ్య గ్యాప్ పెరిగిందన్న చర్చ ఉన్నది. కేసీఆర్(KCR)ను కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇచ్చిన సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించలేదని, నిరసన కార్యక్రమాలు చేపట్టలేదని మీడియా వేదికగా కవిత ప్రశ్నించారు. దాంతో మరింత గ్యాప్ పెరిగిందనే ప్రచారం ఊపందుకున్నది. మొన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా కేటీఆర్‌కు రాఖీ కడతానని కవిత ప్రకటించగా, ఆయన బెంగుళూరుకు వెళ్లడంతో తీవ్ర చర్చ జరిగింది. ఇప్పుడు కేటీఆర్ ఆదేశాలతోనే టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి కవితను తొలగించినట్లు ప్రచారం జరుగుతున్నది. అంతేగాకుండా జూలై 16న టీబీజీకేఎస్ ఇన్‌ఛార్జ్‌గా కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించిన కేటీఆర్ ఈ నెల 20న తెలంగాణ భవన్‌లో జరిగిన సమయంలో గౌరవ అధ్యక్ష పదవిని అప్పగించారు.
దీంతో కవిత, కేటీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టమవుతున్నది. ఈ పరిణామం ఒక్కసారిగా గులాబీలో తీవ్ర చర్చకు దారి తీసింది. కవితను కావాలని పదవి నుంచి తప్పించి అవమానించారని టీబీజీకేఎస్ లోని ఆమె అనుచరులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పదేళ్లుగా సింగరేణి కోసం పని చేశారని, కార్మికుల హక్కుల కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టారని, లాభాల్లో కార్మికులకు వాటాను సైతం సాధించారని పలువురు పేర్కొంటున్నారు. కవితపై కక్ష సాధింపుల్లో భాగంగానే గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించారని మండిపడుతున్నారు.
Also Read: Kavitha – KTR: కేటీఆర్ దెయ్యాల జాబితాలో లేరంటూ కవిత స్పష్టీకరణ