Singer Kalpana: ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించిన కల్పనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ప్రస్తుతం ఆమెకు అత్యవసర చికిత్స జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించారనే దానిపై ఎటువంటి వివరాలు తెలియలేదు. ప్రస్తుతం కల్పన దంపతులు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని నిజాంపేటలో నివాసం ఉంటున్నారు. రెండు రోజులుగా కల్పన ఇంటి తలుపులు మూసి ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లుగా తెలుస్తుంది. పోలీసులు వచ్చేసరికి కల్పన అపస్మారక స్థితిలో ఉండటంతో, వెంటనే తలుపులు పగలకొట్టి ఇంట్లోకి వెళ్లి ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కల్పనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
Also Read- Chhaava Telugu Trailer: గర్జనకు లొంగకపోతే పంజా వేట తప్పదు
ప్రస్తుతం సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం కేసులో విచారణ కొనసాగుతుంది. విషయం తెలిసి కల్పనకు చికిత్స అందిస్తోన్న ఆస్పత్రికి వచ్చిన ఆమె భర్తను పోలీసులు విచారించేందుకు ఇంటికి తీసుకుని వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ విచారణలో రెండు రోజులుగా తను ఇంటిలోలేనని, వేరే పనిపై చెన్నై వెళ్లానని కల్పన భర్త పోలీసులకు చెప్పినట్లుగా సమాచారం. మరోవైపు ఆస్పత్రిలో సింగర్ కల్పనకు వైద్యం అందిస్తున్న వైద్యులు, ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ సింగర్స్‌లో కల్పన ఒకరు. ఆమెను సింగింగ్ పరంగా రాక్షసి అని పిలుస్తుంటారు. తెలుగు, తమిళ్‌తో పాటు పలు భాషల్లో ఆమె పాటలు పాడారు. తెలుగు బిగ్ బాస్ హౌస్‌లోనూ ఆమె కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేశారు. హౌస్‌లో ఇతర సభ్యులపై ఆమె ఎంతో అభిమానంగా ఉండేవారు. అందరినీ కలుపుకుని వెళ్లేవారు. ఎప్పుడూ సంతోషంగా ఉండే కల్పన లైఫ్‌లో ఏం జరిగిందో ఏమోగానీ, సడెన్‌గా ఆమె ఆత్మహత్యాయత్నం చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. టాలీవుడ్‌కు చెందిన పలువురు సింగర్స్ ఇప్పటికే ఆమె చికిత్స పొందుతున్న హాస్పిటల్‌కు చేరుకున్నారు. కల్పన క్షేమంగా తిరిగిరావాలని వారంతా ప్రార్థనలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Rashmika Mandanna: రష్మికా మందన్నాపై ఎమ్మెల్యే ఫైర్.. గుణపాఠం చెబుతాం!