Prashanth Varma: ‘హనుమాన్’ (Hanuman) చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస వివాదాలతో హాట్ టాపిక్‌గా మారారు. మొన్నటివరకు కేవలం సోషల్ మీడియాలో రూమర్స్‌గా ఉన్న ఈ వివాదం, ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ వరకు చేరడం పరిశ్రమలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా రెండు అగ్ర నిర్మాణ సంస్థలు ఈ వ్యవహారంపై స్పందించడం, ఫిర్యాదులు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read- Mohan Babu: ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కలెక్షన్ కింగ్.. గ్రాండ్ ఈవెంట్ ఎప్పుడంటే?
అడ్వాన్స్‌లపై నిర్మాతల గుస్సాలు
ప్రశాంత్ వర్మ తన ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్ (PVCU) ప్రాజెక్టులైన ‘జై హనుమాన్, మహాకాళి, అధీర’ వంటి వాటిని ప్రకటిస్తూ, పలువురు అగ్ర నిర్మాతలతో డీల్స్ కుదుర్చుకుని పెద్ద మొత్తంలో అడ్వాన్సులు తీసుకున్నారని, అయితే ప్రాజెక్టులు మాత్రం అనుకున్న సమయానికి పట్టాలెక్కడం లేదనేది ప్రధాన ఆరోపణ. ఈ నిధులను ఆయన తన వ్యక్తిగత స్టూడియో నిర్మాణానికి మళ్లించారని కూడా వార్తలు వచ్చాయి. దీనిపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్యకు చెందిన DVV ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, తాము ప్రశాంత్ వర్మకు ఎలాంటి అడ్వాన్స్‌లు ఇవ్వలేదని, తమ మధ్య వ్యాపారపరమైన ఒప్పందాలు గానీ, అనుబంధం గానీ లేవని అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ రూమర్‌లను వారు ఖండించారు. మరోవైపు ప్రశాంత్ వర్మ విషయంలో మరో ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ (Primeshow Entertainment) మాత్రం ఏకంగా ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఆ సంస్థ అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా, అడ్వాన్స్ సమస్యల కారణంగానే ఈ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిర్మాతల ఆరోపణలు, ఫిర్యాదులపై ప్రశాంత్ వర్మ స్పందిస్తూ, తన తరఫున తప్పు ఏమీ లేదని బలంగా చెబుతున్నారు. ఈ వ్యవహారంపై జరుగుతున్న విచారణ తర్వాత నిజానిజాలు అందరికీ తెలుస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read- Prasanth Varma: రెండు వైపులా విషయం తెలుసుకోండి.. మీడియా సంస్థలపై చురకలు!
మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా నుంచే మొదలైందా?
ఈ మొత్తం వ్యవహారం వెనుక కొన్ని అనుమానాలు కూడా లేకపోలేదు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకు మొదట ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే ఆ ప్రాజెక్ట్ అనుకోకుండా ఆగిపోవడం, ఆ తర్వాతే ప్రశాంత్ వర్మ చుట్టూ ఇలాంటి వివాదాలు, ఆరోపణలు అలుముకోవడం చూస్తుంటే, ఆయనను లక్ష్యంగా చేసుకుని ఎవరైనా కక్ష కట్టి ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చూస్తున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ‘హనుమాన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మకు ఇదొక క్లిష్ట సమయం. ఈ వివాదంపై ఫిల్మ్ ఛాంబర్ విచారణ తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చూద్దాం.. ఏం జరుగుతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
