Prasanth Varma: ఈ మధ్య కాలంలో ‘హనుమాన్’ (HanuMan) దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma)పై ఏ విధంగా వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్ అంటూ ఆయన ప్రకటిస్తున్న సినిమాలు కూడా.. ఆయన పేరును ఇండస్ట్రీలో హైలెట్ అయ్యేలా చేస్తున్నాయి. ‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియా స్థాయిలో వినిపించింది. ఆ వెంటనే ఆయన అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా ఆ పేరును డౌన్ అవకుండా నిత్యం వార్తలలో ఉండేలా చేస్తూ వచ్చాయి. ఎప్పుడైతే బాలయ్య కుమారుడి మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో ప్రశాంత్ వర్మకు ఎదురు దెబ్బ తగిలిందో.. అప్పటి నుంచి ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ‘హనుమాన్’ నిర్మాణ సంస్థ ప్రశాంత్ వర్మపై ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేసినట్లుగా వస్తున్న వార్తలపై వివరణ ఇస్తూ.. మీడియా సంస్థలకు చురకలు అంటించారు ప్రశాంత్ వర్మ. ఈ మేరకు ఆయన విడుదల చేసిన లేఖలో..
Also Read- Sudheer Babu: అక్కడ కష్టాలు తెలియకపోవచ్చు.. కానీ బాధను అనుభవించా.. సుధీర్ బాబు
తీవ్రంగా ఖండిస్తున్నా..
‘‘కొన్ని మీడియా పోర్టల్స్, సోషల్ మీడియా పేజీలు, న్యూస్ ఛానెల్స్.. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ఫిర్యాదును, దానికి నేను ఇచ్చిన జవాబులోని కొంత ఎంపిక చేసిన భాగాన్ని మాత్రమే ప్రచురించడం, ప్రసారం చేయడం, సర్క్యులేట్ చేయడం వంటిది నా దృష్టికి వచ్చింది. ఇలాంటి ప్రేరేపితమైన, బాధ్యతారహితమైన, ఏకపక్ష, అసంపూర్ణ, ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
మీడియా ఆ పని చేయవద్దు
నాకు, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ (Primeshow Entertainment) ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఉన్న వివాదం ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఛాంబర్/తెలుగు సినీ దర్శకుల సంఘం ముందు పెండింగ్‌లో ఉంది. దీనిపై పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఈ విషయంపై వారు చర్చించి న్యాయాన్యాయాలు వెల్లడిస్తారు. ఒక సమస్య సయోధ్య కోసం పెద్దల ముందు ఉంచిన తర్వాత, అన్ని పక్షాలు వారి ఇచ్చే వివరణ కోసం వేచి చూడాలి. అలాగే, మీడియాలో ఆ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించకూడదు. ఈ దశలో అంతర్గత వాదనలు, ఇమెయిల్స్, ఒప్పందాలు లేదా ఆర్థిక వివరాలను ప్రచురించడానికి చేసే ఏ ప్రయత్నమైనా ఆ విచారణలకు అంతరాయం కలిగించడమే. అలాగే ప్రజల అభిప్రాయాన్ని ఒకవైపుకు మళ్లీంచేలా చేయడమే అవుతుంది.
వేచి చూడండి
నాపై చేసిన ఆరోపణలన్నీ తప్పుడు, నిరాధారమైన, ప్రతీకార ధోరణిలో చేసినవని నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఈ విషయంపై ఏది పడితే అది ఊహించేసుకుని, అసంపూర్ణమైన కంటెంట్‌ను ప్రచురించకుండా ఉండాలని నేను మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా ఛానెల్స్, న్యూస్ ఛానెల్స్ అన్నింటిని అభ్యర్థిస్తున్నాను. దయచేసి అందరూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ముందు జరుగుతున్న విచారణల ఫలితం కోసం వేచి ఉండాలని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
