Kaantha trailer: పాన్-ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాంత’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. 1950-60ల నాటి మద్రాస్ సినీ పరిశ్రమ నేపథ్యంతో రూపొందించబడిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా, ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచుతోంది. ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా, రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ (స్పిరిట్ మీడియా, వేఫరర్ ఫిల్మ్స్ ద్వారా) సంయుక్తంగా నిర్మించడం విశేషం. పాన్-ఇండియా స్థాయిలో అంచనాలు పెంచుతున్న ఈ చిత్రాన్ని నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాపై మరింత హైప్ పెంచడానికి, రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ను లాంచ్ చేయించడం కూడా ఒక సక్సెస్ సెంటిమెంట్‌గా సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Read also-Mithra Mandali OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మిత్రమండలి.. నెల కాకముందే..
సుమారు మూడు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ సినిమాలోని ప్రధాన సంఘర్షణను, భావోద్వేగాలను స్పష్టంగా ఆవిష్కరించింది. ‘ఒక కథ ఎప్పుడు చెప్పాలన్నది ఆ కథేరా నిర్ణయిస్తుంది’ అనే సముద్రఖని వాయిస్ ఓవర్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్, ఒక సినీ గురువుకు, స్టార్‌గా ఎదిగిన అతని శిష్యుడికి మధ్య నడిచే అహంకార పోరాటం చుట్టూ తిరుగుతుందని అర్థమవుతోంది. దుల్కర్ ఈ చిత్రంలో సినీ హీరో ‘మహదేవ’ పాత్రలో కనిపిస్తున్నాడు. అతని రాజసం, ఆవేశం, ఒక మెగాస్టార్‌కి ఉండాల్సిన అహం ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దర్శకుడిగా, దుల్కర్ పాత్రకు గురువుగా కనిపించే సముద్రఖని పాత్ర చాలా శక్తివంతంగా ఉంది. ‘ఈ సినిమా ఇచ్చే డబ్బు, పేరు, ఖ్యాతి ఇవన్నీ నిన్ను పాడు చేసేశాయ్’ అని అతను పలికే డైలాగ్… ఇద్దరి మధ్య బంధం ఎంతగా దెబ్బతిందో తెలియజేస్తుంది. చిత్ర నిర్మాతే అయిన రానా దగ్గుబాటి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో మెరవడం ట్రైలర్‌కు అదనపు ఆకర్షణ. కేసును ఛేదించడానికి ప్రయత్నించే అతని పాత్ర, కథలో ఉత్కంఠను పెంచనుంది. ఆ కాలం నాటి బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ ఫీట్‌లు, స్టైలిష్ విజువల్స్, థ్రిల్లింగ్ నేపథ్య సంగీతం ఈ పీరియాడిక్ డ్రామాకు జీవం పోశాయి.
Read also-NTRNeel movie update: ‘ఎన్టీఆర్‌నీల్’ నుంచి మరో అప్టేట్ వచ్చింది.. ఇది చూస్తే ఫ్యాన్సుకు పండగే..
ఈ సినిమాకు ఝాను చంథార్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ‘ది రేజ్ ఆఫ్ కాంత’ (The Rage of Kaantha) పాట ఆసక్తిని పెంచింది. ఈ పాటలో తమిళం, తెలుగు, ఇంగ్లీష్ లిరిక్స్ ఉండడం విశేషం. డాని సాంచెజ్ లోపెజ్ ఈ చిత్రానికి కెమెరా వర్క్ అందించారు. ఆ కాలం నాటి దృశ్యాలను, ఫిల్మ్ సౌందర్యాన్ని అద్భుతంగా చూపించారు. సినిమా రన్‌టైమ్ 163 నిమిషాలు (2 గంటల 43 నిమిషాలు) గా ఉంది. దీనికి సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ (U/A) సర్టిఫికెట్ లభించింది. ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు సినిమాపై హైప్ మరింత పెంచాయి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
