Senior Actress and Producer Krishnaveni
ఎంటర్‌టైన్మెంట్

Krishnaveni: ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన నటి, నిర్మాత మృతి

Krishnaveni: లెజెండ్ నందమూరి తారక రామారావును నటుడిగా వెండితెరకు పరిచయం చేసిన నటి, నిర్మాత శ్రీమతి కృష్ణవేణి (101) మృతి చెందారు. సీనియర్ నటీమణి, నిర్మాత, స్టూడియో అధినేత అయినటువంటి మీర్జాపురం కృష్ణవేణి ఆదివారం (ఫిబ్రవరి 16) ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె వయసు 101 సంవత్సరాలు. 24 డిసెంబర్, 1924న కృష్ణజిల్లాలోని పంగిడిగూడెంలో డా. ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మకు కృష్ణవేణి జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు నటన అన్నా, నృత్యం అన్నా ఎంతో అభిమానం. చిన్న వయసులోనే ఆమె నాటకాలలో నటించటం మొదలుపెట్టారు. ఒక స్టేజ్‌పై ఆమె నటనను చూసిన దర్శకుడు సి. పుల్లయ్య.. కృష్ణవేణిని బాలనటిగా 1936లో ‘సతీ అనసూయ’ అనే సినిమాతో సినిమా రంగానికి పరిచయం చేశారు. బాల నటిగా తెలుగు, తమిళ భాషలలో ఆమె ఎన్నో చిత్రాలలో నటించారు.

హీరోయిన్‌గా నటిస్తున్న సమయంలో ఆమెకు మీర్జాపురం రాజా వారితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా వారి వివాహానికి దారితీసింది. 1949లో ‘మనదేశం’ అనే సినిమాతో నందమూరి తారక రామారావును తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు కృష్ణవేణి. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మీర్జాపురం రాజా, మేక రంగయ్య నిర్మించారు. ఈ సినిమాను నిర్మించడమే కాకుండా.. ఇందులో హీరోయిన్‌గా కూడా ఆమె నటించారు. మీర్జాపురం రాజా, కృష్ణవేణి దంపతులకు రాజ్యలక్మి, అనురాధ అనే ఇద్దరు కుమార్తెలు. అనురాధ నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న అమ్మ.. ఈ రోజు ఉదయమే తుది శ్వాస విడిచినట్లు వారి కుమార్తె అనురాధ మీడియాకు తెలిపారు.

Also Read- Vishwambhara: మెగాస్టార్‌తో మేనల్లుడు.. ‘విశ్వంభర’ తాజా అప్డేట్ ఇదే!

2004లో కృష్ణవేణిని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించారు. రీసెంట్‌గా ఎన్.టి.ఆర్. వజ్రోత్సవం సందర్భంగా డిసెంబర్ 14న విజయవాడలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృష్ణవేణిని ప్రత్యేకంగా సత్కరించారు. ఇక కృష్ణవేణి మృతివార్త తెలిసిన సినీ ప్రముఖులందరూ ఆమెకు నివాళులు అర్పిస్తూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్ధిస్తున్నారు.

Actress Krishnaveni
Actress Krishnaveni

నటి కృష్ణవేణి మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
సినీ నిర్మాత, నటి కృష్ణవేణి మృతి బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్టూడియో అధినేతగా, వివిధ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి, రఘుపతి వెంకయ్య అవార్డు పొందిన కృష్ణవేణి తెలుగు సినీకీర్తిని చాటారని తెలిపారు. కృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు ప్రార్ధిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

‘‘తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలి మహిళా నిర్మాతగా గుర్తింపు పొందిన శ్రీమతి కృష్ణవేణి గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా శ్రీమతి కృష్ణవేణి గారు బహుముఖ ప్రజ్ఞ చాటుకున్నారు. శ్రీ ఎన్టీఆర్, శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. శ్రీమతి కృష్ణవేణి గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ – పవన్ కళ్యాణ్ (ఏపీ ఉప ముఖ్యమంత్రి)

‘‘తెలుగు చలనచిత్ర రంగంలో తమదైన ముద్ర వేసిన సినీ నిర్మాత, తొలితరం హీరోయిన్ కృష్ణవేణి మృతి బాధ కలిగించింది. శోభనాచల స్టూడియో అధినేతగా, వివిధ చిత్రాలకు నిర్మాతగా, నటిగా ఆమె ఎనలేని సేవలు అందించారు. రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు ప్రతిష్టాత్మక అవార్డులను పొందిన కృష్ణవేణి తెలుగు సినీ పరిశ్రమకు వన్నె తెచ్చారు. కృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ – నారా లోకేష్ (ఏపీ రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి)

‘‘రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నటజీవితానికి తొలుత అవకాశం అందించిన శ్రీమతి కృష్ణవేణి గారు సంపూర్ణ జీవితం చాలించి శివైక్యం చెందడం బాధాకరం. శ్రీమతి కృష్ణవేణి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో ఆమెది ఓ ప్రత్యేక అధ్యాయం. ‘మన దేశం’ లాంటి గొప్ప చిత్రాలు నిర్మించి సమాజంలో ఉన్నత విలువలను పెంచడానికి కృషి చేశారు. ప్రభుత్వ పరంగా ఎన్నో అవార్డ్స్ అందుకొన్నారు. ఇటీవల ఎన్ టి ఆర్ వజ్రోత్సవ వేడుకలలో, అంతకు ముందు ఎన్ టి ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ సందర్భంగా శ్రీమతి కృష్ణవేణి గారిని ఘనంగా సత్కరించడం జరిగింది. కృష్ణవేణి గారి మృతి వ్యక్తిగతంగా మాకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను’’ -నందమూరి బాలకృష్ణ

‘‘నేడు మన చలన చిత్ర సీమకు మరచిపోలేని చీకటి రోజు. మన కుటుంబానికి దైవం నాన్న, నందమూరి తారక రామారావు గారిని 1949లో ‘మన దేశం’ చిత్రంతో వెండితెరకు పరిచయం చేసిన మహాతల్లి, మన దేశం చిత్ర నిర్మాత శ్రీమతి కృష్ణవేణమ్మ గారు స్వర్గస్తులవడం మాకు తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. ఆమె సినీ రంగానికి చేసిన సేవలు, వెండితెరకు చిరస్మరణీయమైన ప్రతిభావంతుల్ని పరిచయం చేసిన గొప్పతనం ఎప్పటికీ మాకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆమె లేకపోయినా ఆమె ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంటాయని ఆశిస్తున్నాము. మా కుటుంబం తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ పరమాత్మ ఆమె ఆత్మకు శాంతి కలగజేయాలని ప్రార్థిస్తున్నాము’’ -నందమూరి రామకృష్ణ

ఇవి కూడా చదవండి:

Chandoo Mondeti: గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను

Mangli Open Letter: నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.. అదంతా ఫేక్ ప్రచారం

Balakrishna: థమన్‌కు బాలయ్య కాస్ట్‌లీ గిఫ్ట్.. ఊహించలేదు కదా!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు