Where It Leads Mind Game Politics In Telangana
Editorial

Politics: మైండ్‌గేమ్ పాలి‘ట్రిక్స్’ ఎటు దారితీసేనో?

Where It Leads Mind Game Politics In Telangana: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ, అధికార కాంగ్రెస్‌తో బాటు విపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారంలో పైచేయి సాధించేందుకు ఆరోపణల పర్వానికి శ్రీకారం చుట్టాయి. ఈ మూడు రాజకీయ పార్టీలు ఆడుతున్న మైండ్‌గేమ్‌ను తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఆలకిస్తూనే, రాబోయే ఎన్నికల్లో తాము ఎవరివైపు నిలవాలనే దానిపై ఒక అభిప్రాయానికి వచ్చే క్రమంలో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత వచ్చిన రెండు పార్లమెంటు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు సంపాదించుకోగా, బీజేపీ, కాంగ్రెస్ తమ ఉనికిని మాత్రమే నిలబెట్టుకోగలిగాయి. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత ఈ ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో 14 సీట్లు సాధించి సత్తా చాటాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. అదే సమయంలో గత పార్లమెంటు ఎన్నికల్లో తాము గెలుచుకున్న నాలుగు సీట్లకు తోడు, మరో నాలుగు సీట్లైనా గెలుచుకుని బీఆర్ఎస్‌కు బదులుగా తాను విపక్ష పాత్ర పోషించాలని కమలం పార్టీ కలలు కంటోంది. ఇక..అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి, విపక్షానికే పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని నిలుపుకునేందుకు తంటాలు పడుతోంది. ఈ పార్టీలన్నీ ఇతర పార్టీల మీద దూకుడుగా విమర్శలు చేస్తూ, ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ, ప్రత్యర్థి పార్టీలను ఇరుకున బెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.

గత శాసనసభ ఎన్నికల సందర్భంగా లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న కేసీఆర్ కుమార్తె కవితను, బీజేపీ కావాలనే అరెస్టు చేయటం లేదని, వారిద్దరికీ మధ్య గల అవగాహన మూలంగానే ఆ రెండు పార్టీలూ ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయనే మాటను కాంగ్రెస్ బలంగా జనంలోకి తీసుకెళ్లగలిగింది. దీనిని ప్రజలు పూర్తిగా నమ్మకపోయినా, ఆ ప్రచారం కారణంగా ప్రజల్లో కొంత అనుమానాలు మాత్రం మొదలవటంతో గులాబీ పార్టీకి నష్టం జరిగింది. ఇక ఈ లోక్‌సభ ఎన్నికల వేళ, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టై, తీహార్ జైలులో ఉన్న కవితకి బెయిల్ రావడం కోసం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీ ముందు ఒక ప్రతిపాదన ఉంచారనీ, దాని ప్రకారం సికింద్రాబాద్, జహీరాబాద్, చేవెళ్ల, భువనగిరి, మల్కాజిగిరి, మహబూబ్ నగర్ స్థానాలలో బలహీనమైన అభ్యర్థులను బరిలో దించటమే గాక, అక్కడ స్వయంగా ప్రచారానికి పోకుండా ఉండేందుకు అంగీకరించారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించటం సంచలనాన్ని సృష్టించింది. ఈ విమర్శలో నిజం ఎంతనేది ఇప్పటికి తెలియకపోయినా, ఈ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ బలం బాగా తగ్గే ప్రమాదమైతే స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ మాట నిజమే అయితే, బీజేపీ ఈ స్థానాల్లో నెగ్గటం పెద్ద కష్టం కాబోదు. బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర తాజాగా వాయిదా పడటం, కేటీఆర్, హరీష్ వంటి నేతలెవరూ ఈ నియోజకవర్గాల్లో దూకుడుగా ప్రచారం చేయకపోవటం, ముఖ్యంగా ఈ నేతలెవరూ మోదీని లేదా బీజేపీని విమర్శించకపోవటంతో రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన అనుమానం నిజమనే భావన క్షేత్రస్థాయిలో బలపడుతోంది.

Also Read:రాజకీయ నాయకుల వ్యాఖ్యలతో గందరగోళంలో జనాలు..

మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు, అసెంబ్లీలో తనకు మద్దతుగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నాడంటూ గులాబీ పార్టీ నేత కేటీఆర్ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏడాది కూడా కొనసాగదని కేసీఆర్ సైతం తన ప్రసంగాల సందర్భంగా చెబుతూ వస్తున్నారు. ఒక సీనియర్ కాంగ్రెస్ నేత, తనతో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి తనతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కబురు చేశాడనీ, కానీ ఓపిక పట్టాలని తాను ఆ నేతకు సూచించానని కేసీఆర్ ఇటీవల బాంబు పేల్చారు. ఇందులో నిజానిజాలను పక్కనబెడితే రేవంత్ రెడ్డిని మరో ఏక్‌నాథ్ షిండేలా చిత్రీకరించేందుకు గులాబీ పార్టీ ప్రయత్నిస్తోందని అర్థమవుతోంది. అయితే, రోజుకో ఎమ్మెల్యే తమ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరటంతో, దీనికి చెక్ పెట్టేందుకే కేసీఆర్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందనే వాదనా బలంగా వినిపిస్తోంది.గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలవటం, 2019 పార్లమెంటు ఎన్నికల్లో 4 సీట్లు గెలిచిన చరిత్ర గల బీజేపీ తన బలాన్ని మరింత పెంచుకునేందుకు కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ లోక్‌సభ ఎన్నికలలో డబుల్ డిజిట్ దాటబోతున్నామనే ప్రచారంతో బాటు, యువత మనసును ఆకట్టుకునే రీతిలో సోషల్ మీడియాలో ఆ పార్టీ చెలరేగిపోతోంది. దొరికిన ప్రతి సందర్భంలో అటు కాంగ్రెస్‌ను, ఇటు బీఆర్ఎస్‌ను దుమ్మెత్తిపోస్తోంది. రైతు సమస్యలపై దీక్షలకు దిగి, కాంగ్రెస్ ప్రభుత్వం R ట్యాక్స్, B ట్యాక్స్‌ వసూలు చేస్తోందని కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తోంది. ఎలాగూ కేంద్రంలో తామే అధికారంలోకి వస్తున్నాము గనుక వేరే పార్టీలకు ఓటేయటం అనవసరమని, ఆ వేసే ఓటేదో తమకు వేస్తే తెలంగాణను మరింత బాధ్యతగా అభివృద్ధి చేస్తామని బీజేపీ కొత్త మైండ్ గేమ్ ప్రారంభించింది. గత పాతికేళ్లలో ఏన్నడూ లేనంత దూకుడుగా పాతబస్తీలో బీజేపీ ప్రచారం చేయటం, హిందూ ఓటర్ల ఏకీకరణ జరగుతున్న సూచనలను గమనించి, ఇప్పుడు ఎంఐఎం పార్టీలోనూ కలకలం బయలుదేరింది. ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల మరణించిన సమాజ్‌వాదీ పార్టీ నేత అన్సారీ మాదిరిగా, తమ సోదరులనూ బీజేపీ జైలులో పెట్టి స్లో పాయిజన్ ఇచ్చేందుకు కుట్ర పన్నిందంటూ తాజాగా అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. అదే సమయంలో గతంలో ఎన్నడూ లేనంతంగా అసదుద్దీన్ ఒవైసీ ముమ్మర ప్రచారం చేయటం.. అక్కడ బీజేపీ పెరిగిన హవాను సూచిస్తోంది.

మొత్తంగా ఈ పార్టీలన్నీ ఆరోపణలతో రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని అర్థమవుతోంది. ఇంత గందరగోళంలోనూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు ఆగకపోవటం, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు మొగ్గిన మైనారిటీ ఓట్లలో సింహభాగం కాంగ్రెస్‌కే వస్తాయనే అంచనా, కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ తర్వాత గులాబీ పార్టీ నీరసపడటం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ ఎంపీ సీట్లు దక్కుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే నిజమైతే బీఆర్ఎస్ ఉనికే ప్రమాదంలో పడే అవకాశముంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజున ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆసక్తిని కలిగించే విషయమే అయినా, ఆ ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా పార్లమెంటులో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేవారుగా నిలిస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వారు నిజమైన ప్రతినిధులుగా నిలబడతారు.

-డాక్టర్ తిరునహరి శేషు రాజకీయ విశ్లేషకులు (కాకతీయ విశ్వవిద్యాలయం)

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్