Let’s Tell The Looters To Mind With A Lok Sabha Vote: దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుతున్నాయి. తెలంగాణలో మే 13న ఎంపీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల వేళ దేశంలోని 144 కోట్ల మంది ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులతో బాటు సాగు,ఉద్యోగ, ఉఫాధి రంగాల్లో ఈ పదేళ్ల కాలంలో జరిగిన ప్రగతిని ఓసారి లోతుగా పరిశీలించాల్సి అవసరం ఎంతైనా ఉంది. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా దేశ వనరులు గుప్పెడు మంది పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేయబడ్డాయి. యువతకు భవితను అందించే ప్రభుత్వ విద్యారంగం అత్యంత నిర్లక్ష్యానికి గురైంది. అనేక రాష్ట్రాలలో 400కు పైగా రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఆర్థిక వనరులు లేక కునారిల్లిపోయాయి. గత పదేళ్ల కాలంలో ఈ వర్సిటీలకు కేంద్రం నయాపైసా విదల్చలేదు. దీంతో అక్కడ సరైన బోధన, బోధనేతర సిబ్బంది లేక పరిశోధనలు కొడిగట్టిపోయాయి. దీంతో లక్షలాది యువత భవిష్యత్తు బుగ్గిపాలైపోయింది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరుతున్న వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలతో బాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాల విద్యార్థులే అధికం. ఈ లెక్కన ఈ దశాబ్దకాలంలో ఆయా వర్గాల విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందని చెప్పటం సత్యదూరం కాబోదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేకపోవటం విషాదం. దీంతో ఈ వర్సిటీల నుంచి పట్టాలు పుచ్చుకున్న యువత తగిన ఉపాధి అవకాశాలు లేక తమ అర్హతకు తగని కొలువులతో బతుకీడ్చాల్సిన దుస్థితి ఏర్పడింది. దేశ జనాభాలో 60 శాతంగా ఉన్న యువతలోని సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన ఈ వర్గాల యువత ఒక తరంపాటు వెనకబడపోగా, దీనికి కారణమైన ప్రభుత్వాలు ఏర్పరచిన పార్టీలన్నీ తిరిగి సమాజాన్ని కులమతాల పేరుతో విభజించి ఓట్లు దండుకునే రాజకీయానికి దిగాయి.
కేంద్ర వ్యవహారశైలికి బలైన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. మన తెలంగాణలో ఈ పదేళ్ల కాలంలో సుమారు వర్సిటీల నుంచి బయటికి వచ్చిన లక్షలాది యువత నిరుద్యోగులు మారి, తమ భవిష్యత్ పట్ల ఆశను కోల్పోయారు. తెలంగాణ ఉద్యమం పేరుతో సాగిన అనేక పరిణామాల కారణంగా 2005 నుంచి ఈ ప్రాంతంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో జవాబుదారీతనం లోపించగా, పార్టీలూ ఈ విద్యాసంస్థలను పట్టించుకోవటం మానేశాయి. ఒక అంచనా ప్రకారం ఇలా దగాపడిన వారి సంఖ్య 40 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం. కొత్తగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వోద్యోగాల భర్తీ చేపట్టినా ఇంకా 38 లక్షలమంది నిరుద్యోగ యువత అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను పొంది సంతృప్తి పడటమో లేక నిరుద్యోగులుగా మారటమో జరగటం తప్పేలా లేదు. గత దశాబ్దంన్నర కాలంగా వీరిలో మెజారిటీ యువత కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకి అభిమానులుగా, మద్దతుదారులుగా ఉన్నప్పటికీ, ఆ పార్టీలేవీ ఈ ఎన్నికల వేళ ఇంత పెద్ద సమస్యను చర్చించటానికే ముందుకు రావటం లేదు.
మరోవైపు తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా లేకపోవటంతో చిన్నరైతులు పట్టణాలకు వలసపోయి, మనసు చంపుకుని దొరికిన చిన్నాచితకా పనులు చేసుకుంటూ బతుకీడుస్తున్నారు. మరోవైపు ఈ పదేళ్ల కాలంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సాగురంగంలో ఇంతటి సంక్షోభం కళ్లముందు కనిపిస్తున్నా.. నాటి సీఎం కేసీఆర్ ఒక్కనాడూ తన అధికారిక నివాసమైన ప్రగతి భవనం నుంచి గానీ, తాను సేదదీరే ఫామ్‌హౌస్ నుంచి గానీ కాలు బయటపెట్టకుండా తనదైన లోకంలో విహరించారు. ధరణి అనే దుర్మార్గపు వ్యవస్థను తెచ్చి, పేదల భూములను పెద్దలకు, తన మనుషులకు యథేచ్ఛగా బదిలీ చేయించాడు. అయితే, ఆ అక్రమార్కులను శిక్షించే చట్టాల గురించి, వారిపై జరగబోయే దర్యాప్తు గురించి కూడా ఈ ఎన్నికల్లో చర్చ జరగకపోవటం దురదృష్టకరం.
Also Read:విప్లవ స్వాప్నికుడు, పీపుల్స్ వార్ గ్రూప్ వ్యవస్థాపకుడు కె.ఎస్..
తొంభైయ్యవ దశకపు తొలనాళ్లలో వచ్చిన ప్రపంచీకరణ గత 3 దశాబ్దాల కాలంలో సంపన్నులను మరింత సంపన్నులుగా, పేదలను మరింత దరిద్రులుగా మార్చింది. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లు అతి తక్కువ సమయంలో దేశ వనరులను చేజిక్కించుకుని తమ వ్యక్తిగత సంపదను వేలరెట్ల మేర పెంచుకోగలిగారు. ఈ సంపన్నుల కుటుంబాలలో జరుగుతున్న పెళ్లిళ్లే అందుకు ఉదాహరణ. విదేశాల్లో జరిగే ఈ ఒక్కో వివాహానికి వేలకోట్ల సొమ్మును వెచ్చించగలుగుతున్నారంటే దీనికి ప్రపంచీకరణే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ఈ మూడు దశాబ్దకాలంలో మన పాలకవర్గాలు భారత రాజ్యాంగ స్ఫూర్తిని తోసిపుచ్చి, పేదలకు ఇచ్చే రాయితీలను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చాయి. సామాజిక సాధికారత, సమానత్వం కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లను భారంగా భావించిన ప్రభుత్వాలు ప్రపంచీకరణ పేరుతో విచ్చలవిడిగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాయి. కాలక్రమంలో వర్సిటీలూ అదే బాట పట్టాయి. దీంతో నిరుపేద, దిగువ మధ్యతరగతి వర్గాల వారు విద్య, ఉపాధి రంగాల్లో వెనకబడిపోయారు. దీంతో వారు మరింతగా పేదరికంలో కూరుకుపోయారు. ఈ అంశాలూ ఈ ఎన్నికల వేళ ఎక్కడా చర్చకు రావటం లేదు.
కార్పొరేట్లకు ఊడిగం చేసిన ఈ పార్టీలు పేరుకు మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నప్పటికీ, ఎక్కడా ఈ విధాన పత్రాల మీద చర్చ జరగటం లేదు. ప్రజలను కులం, మతం, ప్రాంతం, వర్గం, భాష పేరుతో విడదీయటమే తప్ప జన రాజకీయ ధోరణిగానీ, సమస్యల ఎజెండా గురించిన ఊసుగానీ క్షేత్రస్థాయిలో లేనేలేదు. సమాజహితమే ఊపిరిగా పనిచేసిన పాతతరం మేధావులు కనుమరుగవుతుంటే వారి స్థానంలో వచ్చిన ఆధునిక మేధావులు పాలకపక్షాలకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా మారిపోతున్నారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగం ద్వారా ప్రజలకు దఖలు పడిన హక్కుల పరిధి నానాటికీ కుచించుకుపోతుంటే ఈ మేధావులు ఆర్తనాదాలు చేయటం తప్ప రోడ్డెక్కి ఉద్యమాలు నిర్మించేందుకు ముందుకు రావటం లేదు. ఈ విపత్కర పరిస్థితిలో విద్యావంతులు, నిరుద్యోగులు, నిజమైన మేధావులు తిరిగి ప్రజలను చైతన్యపరచి ఎన్నికల వేళ సమస్యలను పరిష్కరించే నేతలకే ఓటేసేలా చేయాలి.
కోట్లాదిమందికి చెందిన తెలంగాణ వనరులను పదేళ్ల పాటు పిండుకుని, ప్రజాధనాన్ని యధేచ్ఛగా లూటీ చేసి, ప్రజల ఆస్తులను దుర్మార్గమైన పద్ధతుల్లో గుంజుకున్న బీఆర్ఎస్ నేతలను ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాల్సిన అవసరం నేటి తెలంగాణ సమాజం మీద ఉంది. ఈ పని జరగాలంటే తెలంగాణ యువత ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు వాస్తవ పరిస్థితిని విడమర్చి చెప్పాలి. ముఖ్యంగా ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమకారులను, రైతులను, నిరుద్యోగులను, సామాన్యులను దారుణంగా దోపిడీ చేసిన గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాకుండా చేసి, ఆ పార్టీని భూస్థాపితం చేయాల్సిన బాధ్యత తెలంగాణ యువత మీద ఉంది. పదేళ్ల పాటు ఒకే కుటుంబం, వారి సామాజిక వర్గం తెలంగాణను గుప్పిటపట్టి కాళేశ్వరం, మద్యం వ్యాపారం మొదలు చివరకు ఫోన్ టాపింగ్‌ను కూడా వదలకుండా తమ అక్రమార్జనకు తెగబడి లక్షల కోట్లు దోపిడీ చేశారు. ఇలాంటి నాయకులను మళ్లీ పొరబాటున కూడా గెలిపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
Also Read: కాంగ్రెస్ బలోపేతమే రేవంత్ లక్ష్యం
తెలంగాణ పాత పాలకుల అవలక్షణాలే జాతీయస్థాయిలోని పాలకుల్లోనూ ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగం, విద్య, వ్యవసాయం వంటి రంగాలను కేంద్రం ఈ పదేళ్ల కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీనికి తోడు ధరల పెరుగుదలతో సామాన్యుల జీవితాలు కుదేలవుతున్నా కేంద్రం పట్టించుకోలేదు. మతం మత్తులో, కార్పొరేట్ల సేవలో తరిస్తున్న ఈ పాలకపక్షాలతో పేద, మధ్యతరగతి వర్గాలకు ఒరిగేదేమీ లేదు. కనుక ఈ ఎన్నికల్లో ప్రజలకు గౌరవ ప్రదమైన జీవితాన్ని ఇస్తామని చెబుతున్న పార్టీలకే ఓటర్లు మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో తెలంగాణ పౌరసమాజం, యువత ధైర్యంగా ముందుకొచ్చి, తమతమ పరిధిలో ప్రజాసమస్యలను చర్చకు పెడితేనే ఈ లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల మార్పులు సాధ్యమవుతాయి.
-కూరపాటి వెంకట్ నారాయణ (కాకతీయ యూనివర్సిటీ)