Congress Government Last More Than 6 Months, Is it easy to topple the government?: తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన నాటినుంచి ‘ఈ ప్రభుత్వం ఎన్నాళ్లో ఉండదు’ అంటూ విపక్షాల నేతలు పదేపదే మాట్లాడుతూ వస్తున్నారు. ‘ఈ ప్రభుత్వం 6 నెలలకు మించి అధికారంలో కొనసాగకపోవచ్చు’ అంటూ నాడు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడిన మాటకు అధికార పక్షం నుంచి ఘాటైన జవాబు వచ్చింది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ నిర్మల్ ఎమ్మెల్యే, అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత మహేశ్వర రెడ్డి కూడా ‘మేం తలచుకుంటే కేవలం 48 గంటల్లో ఈ సర్కారును పడగొడతాం’ అని వ్యాఖ్యానించటంపై అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలు, ప్రతివిమర్శలను పక్కనబెడితే అసలు ప్రతిపక్షాలు పదేపదే ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నాయి? దీనివెనక వారి ఉద్దేశాలేమిటనే చర్చ నేడు తెలంగాణలో జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు మూడోసారి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ (60)కి కావలసిన శాసనసభ స్థానాల కంటే తన మిత్రపక్షమైన సిపిఐతో కలిపి మరో 5 సీట్లు ఎక్కువే గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చారు. కానీ ఇక్కడ మనం పరిగణనలోకి తీసుకోవాల్సింది ఒక్క కాంగ్రెస్ బలాన్ని మాత్రమే కాదు. విపక్షాల బలహీనతను కూడా లెక్కలోకి తీసుకోవాలి. ప్రస్తుత శాసనసభలో విపక్షాల మొత్తం బలం 54. అయితే, అసెంబ్లీలో ఏడు స్థానాలున్న ఎంఐఎం, 8 సీట్లున్ బీజేపీ ఒకేవైపు నిలబడలేవు. అలాగే బిఆర్ఎస్, ఎంఐఎంలు కలిసినా వాటి బలం కేవలం 46 మాత్రమే కాబట్టి సంఖ్యాపరంగా మెజార్టీకి కావలసిన బలానికి ప్రతిపక్షాలు దాదాపు చేరుకోలేవు. కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వము మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ ప్రభుత్వం మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాలు కూలిపోయినప్పుడు ఆయా రాష్ట్రాలలోని అప్పటి ప్రతిపక్ష బీజేపీ కూడా బలంగా ఉండటంతోనే అది సాధ్యమైంది తప్ప రెండంకెల సీట్లు లేని తెలంగాణలో అది ఎలా సాధ్యమో ఆ పార్టీ నేతలు ఆలోచించుకోవాలి.
Read Also:మెడకు చుట్టుకున్న పాము కరవక మానదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ 63 సీట్లే గెలిచింది. కానీ, రాజకీయ పునర్మిర్మాణం పేరుతో విపక్షాల ఎమ్మెల్యేలను చేర్చుకుంది. కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, సీపీఐ, బీఎస్పీ పార్టీల 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంది. దీంతో నాడు ఆ పార్టీ బలం 86కి పెరిగింది. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేరికలతో తన బలాన్ని పెంచుకునే దిశగా పావులు కదుపుతోంది. శాసనసభలో బీజేపీ, ఎంఐఎం పార్టీల ఎమ్మెల్యేలు ఫిరాయించే అవకాశం ఎలాగూ కనిపించటం లేదు. సీపీఐ ఎలాగూ కాంగ్రెస్ మిత్ర పక్షమే గనుక ఇక చేరికలు అంటూ జరిగితే అది బీఆర్ఎస్ నుంచే. ఇప్పటికే ఇద్దరు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోగా మరింతమంది ఇందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్, కవిత అరెస్టు పరిణామాలతో రాబోయే రోజుల్లో ఆ పార్టీ నుంచి భారీ వలసలు జరిగితే గతంలో గులాబీ పార్టీ అనుసరించినట్లుగా ఏదోఒక రోజు బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో 88 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ 2023 ఎన్నికల నాటికి తన బలాన్ని పలు అనైతిక మార్గాల ద్వారా 104కి పెంచుకుంది. అంటే అప్పటి అధికార బిఆర్ఎస్ పార్టీ ఏ స్థాయిలో ప్రతిపక్షాల బలాన్ని నిర్వీర్యం చేసిందో అర్థం చేసుకోవచ్చు. నాటి విపక్ష పార్టీలకు కనీస విపక్ష హోదా కూడా దక్కకుండా చేసిన కుతర్కాలే నేడు ఆ పార్టీకి శాపాలుగా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లోకి వలసల జోరు సాగుతోంది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతతో మొదలైన వలసల ప్రవాహం.. మెల్లమెల్లగా ఊపందుకుని.. ఇప్పుడు జోరుగా నడుస్తోంది. తాజాగా బీఆర్ఎస్‌లో కీలకంగా ఉన్న కే.కేశవరావు కూడా బీఆర్ఎస్‌కు బైబై చెప్పారు. ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా హస్తం గూటికి చేరనున్నారు. అంతేనా కడియం శ్రీహరి కుటుంబం కూడా కారుదిగింది. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ కడియం కూతురు కావ్యకు ఇచ్చినా ఆమె పార్టీకి రాజీనామా చేశారు. కూతురుతోపాటు తండ్రి కూడా గులాబీకి గుడ్‌బై చెప్పేశారు. ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీలు ఇప్పుడు కాంగ్రెస్ జట్టులోకి చేరడంతో కాంగ్రెస్ మరింత బలంగా తయారవుతోంది. లోక్‌సభ ఎన్నికల వేళ..ఇది కచ్చితంగా బీఆర్ఎస్‌ను దెబ్బదీసే తంత్రమే. సామాజిక వర్గాల పరంగానూ చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పక్కపార్టీ నేతలను తనలో కలుపుకుంటోంది.
Read Also:ప్రజలను ఫూల్స్ చేస్తున్నదెవరు?
18వ లోక్ సభ ఎన్నికల తరువాత దేశంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ రాజకీయ పరిణామాలలో మార్పు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలిస్తే తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి ప్రమాదంలో పడొచ్చు. అప్పుడు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల తరువాత హిమాచల్ ప్రదేశ్‌లోనూ రాజకీయ పరిణామాలు మారే అవకాశం కనిపిస్తోంది. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే అవకాశవాద రాజకీయాలు కొనసాగుతున్నంతకాలం ప్రభుత్వాలను బలహీన పరచటం ఒక రాజకీయ క్రీడగానే చూడాలి. గత దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాజకీయాలలో ఎలాంటి పరిణామాలు సంభవించాయో భవిష్యత్తులో కూడా అలాంటి రాజకీయ పరిణామాలే మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కృతమయ్యే అవకాశాలు లేకపోలేదు.
-డాక్టర్ తిరునహరి శేషు రాజకీయ విశ్లేషకులు (కాకతీయ విశ్వవిద్యాలయం)