Do You Follow Tradition In Council Elections: తెలంగాణలో వరుస ఎన్నికల సందడి నెలకొంది. ఆమధ్య అసెంబ్లీ యుద్ధం నడిచింది. తీవ్ర ఉత్కంఠ నడుమ కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఓటమి రుచి చూసింది. ఇది జరిగి ఆరు నెలలు తిరక్క ముందే పార్లమెంట్ వార్ మొదలైంది. అసెంబ్లీలో పోయిన పరువును పార్లమెంట్ ఎన్నికల్లో నిలుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది. గెలుపు ఉత్సాహాన్ని కొనసాగించాలని ప్రచారం జోరుగా సాగించింది కాంగ్రెస్. జాతీయ అంశాలే కీలకంగా ఉండే పార్లమెంట్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది బీజేపీ. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4న ఫలితాలు ఉంటాయి. అయితే, ఈ ఫలితాలు వచ్చే లోపే మరో ఎన్నికల వార్ షురూ అయింది. ఈనెల 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. అయితే, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సక్రమంగా జరుగుతోందా? పార్టీలు సంప్రదాయం పాటిస్తున్నాయా? ఈసారి విజయం ఎవరిది? ఇలా అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
రాష్ట్రంలో ఉన్న మూడు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాలలో ఒకటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం. ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జనగామ శాసనసభ నియోజకవర్గం నుండి గెలిచారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో శాసనమండలి పునరుద్ధరించబడిన తరువాత ఇప్పటివరకు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి నాలుగు పర్యాయాలు ఎన్నిక జరిగింది. అన్నిసార్లూ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. అయితే, 2021లో జరిగిన ఎన్నిక పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికగా కాకుండా ఒక సాధారణ ఎన్నిక మాదిరి జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నిక కూడా రాజకీయ ప్రమేయం, ప్రాధాన్యత సంతరించుకున్న ఎన్నికగా మారిపోవటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థుల కోసం గట్టిగా శ్రమిస్తున్నాయి.
తెలంగాణలో 14 మంది ఎమ్మెల్యేల కోటా నుండి మరొక 14 మంది స్థానిక సంస్థల కోటా నుండి ముగ్గురు పట్టభద్రుల నియోజకవర్గాల నుండి మరొక ముగ్గురు ఉపాధ్యాయ నియోజకవర్గాల నుండి శాసనమండలికి ఎన్నికవుతారు. మరొక ఆరుగురిని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తారు. అయితే, గవర్నర్ కోటా నుండి ఎంపికయ్యే ఎమ్మెల్సీలు పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుండి ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు పార్టీల ప్రమేయం లేకుండా ఉండాలనే నిబంధన లేకపోయినా సంప్రదాయం ఉంది కానీ, గవర్నర్ కోటాలోనూ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో రాజకీయ జోక్యం పార్టీల ప్రమేయం మితిమీరి పోవటంతో ఈ కోటాల లక్ష్యం నెరవేరటం లేదనే చెప్పాలి. ఏకంగా పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టడం చూస్తుంటే పార్లమెంటరీ, లెజిస్లేటివ్ సంప్రదాయాలు పాటించటం లేదనే అభిప్రాయం కలుగుతుంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్న దాసోజు శ్రవణ్ కుర్ర సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తే అప్పటి గవర్నర్ తమిళిసై ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మండలి పునరుద్ధరణ అయిన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గాలలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేదనే విషయాన్ని గమనించాలి.
Also Read:ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫిరాయింపు రాజకీయాలు సమంజసమేనా?
విషయ నిపుణులు, వివిధ రంగాలలో పనిచేసిన నిష్ణాతులు, మేధావులు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, సాహితీ వేత్తలు, పరిశోధన సంస్థలలో పని చేసేవారు, కవులు, కళాకారులు, వృత్తి సంఘాల నాయకులు లాంటివారు ఈ ఎన్నికలలో పోటీ చేసి గెలవలేరు కాబట్టి వారి ఆలోచనలు అనుభవం మేధస్సుని వాడుకోవటానికి, వారికి చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించడానికి శాసనమండలిలో పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. కాబట్టి గతంలో పట్టభద్రుల నియోజకవర్గం నుండి ప్రొఫెసర్ నాగేశ్వర్, ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి చుక్కా రామయ్య గెలుపొందారు. కానీ, ఈ ప్రత్యేకమైన ఎమ్మెల్సీ నియోజకవర్గాలలో కూడా పార్టీల జోక్యంతో రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్న వారిని నిలబెడితే మేధావులు, విషయ నిపుణులు, నిష్ణాతులకి అవకాశం దొరకదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు సంప్రదాయాన్ని గౌరవించి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలలో జోక్యం చేసుకోకపోతేనే బాగుంటుంది.
రాజ్యాంగంలోని 169 ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రాలు శాసనమండలి ఏర్పాటు చేసుకోవచ్చు కానీ, పెద్దల సభ కచ్చితంగా ఏర్పాటు చేయాలనే నిబంధన లేదు. రాష్ట్రాల అవసరాల మేరకు మాత్రమే శాసనమండలిని ఏర్పాటు చేసుకోవచ్చనే సౌలభ్యత ఉంది. దేశంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లాంటి ఆరు రాష్ట్రాలలో మాత్రమే శాసనమండలి ఉనికిలో ఉంది. ఎమ్మెల్సీలకి ప్రత్యేక అధికారాలు లేకపోవడం వలన మండలిని అనేక రాష్ట్రాలు ఆర్థిక భారంగా, అలంకారప్రాయంగా భావిస్తున్నాయి. అందుకే, మండలి ఏర్పాటుపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే చెప్పాలి. అయితే, కొన్ని సందర్భాలలో మండలి వ్యవహార శైలి వలన ప్రభుత్వాలు ఇబ్బందిపడిన దాఖలాలు కూడా ఉన్నాయి. నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం మండలి వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని 1985లో రద్దు చేయడం జరిగింది. అలాగే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా మూడు రాజధానుల విషయంలో మండలి అడ్డు చెప్పడంతో రద్దు చేయాలనే సిఫారసు చేసింది. మండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా కాకుండా, రాజకీయ ప్రమేయం లేకుండా, పార్టీల జోక్యం లేకుండా మంచి వాళ్లను ఎన్నుకుంటే ప్రభుత్వ విధానాలపైన ప్రజా సమస్యలపైన అర్థవంతమైన చర్చ జరగటానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా రాష్ట్ర అభివృద్ధిలో మండలి సభ్యులు కూడా కీలకమైన పాత్ర పోషిస్తారు.
-డాక్టర్ తిరునహరి శేషు (పొలిటికల్ ఎనలిస్ట్) కాకతీయ విశ్వవిద్యాలయం 9885475877