Woman Suicide: చీమల భయంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ విషాదం అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంచిర్యాలకు చెందిన మనీషా(Manisha) (25), శ్రీకాంత్(Srikanth) భార్యాభర్తలు. వీరికి అనిక అనే కుమార్తె ఉన్నది. శ్రీకాంత్ ఉద్యోగరీత్యా భార్య, కూతురితో అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నవ్య కాలనీలో నివాసముంటున్నాడు. బుధవారం ఎప్పటిలానే ఉద్యోగానికి వెళ్లిన అతను సాయంత్రం తిరిగి వచ్చాడు. ఇంటి తలుపులకు లోపలి నుంచి గడియ పెట్టి ఉన్నది. ఎన్నిసార్లు తలుపు తట్టినా సమాధానం రాకపోవటంతో స్థానికుల సహాయంతో తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లాడు. సీలింగ్ ఫ్యాన్‌కు మనీషా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆత్మహత్యకు ముందు..
ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మనీషా సూసైడ్ లెటర్ రాసి పెట్టింది. ‘‘ఈ చీమలు నన్ను బతకనిచ్చేలా లేవు. అందుకే ప్రాణాలు తీసుకుంటున్నా’’ అని అందులో రాసింది. కూతురు అనికాను జాగ్రత్తగా చూసుకోవాలని భర్తను కోరింది. వదిలి వెళ్తున్నందుకు క్షమించాలని రాసింది. తిరుపతి, అన్నవరం ఆలయాల హుండీల్లో వెయ్యి నూట పదహార్ల చొప్పున ముడుపులు వేయాలని కోరింది. అలాగే ఎల్లమ్మ తల్లికి ఒడి బియ్యం పోయాలని పేర్కొంది.
Also Read; Ponnam Prabhakar: రోడ్డు ప్రమాదాలపై ఇలాంటి అవగాహన అవసరం: మంత్రి పొన్నం ప్రభాకర్
అరుదైన వ్యాధి వల్లే..
మనీషా చిన్నతనం నుంచే మైర్మెకో ఫోబియా(Myrmecophobia) అనే వ్యాధితో బాధపడుతున్నట్టుగా విచారణలో వెల్లడైంది. ఈ ఫోబియా ఉన్నవారు చీమలను చూస్తే విపరీతంగా భయపడతారని వైద్యులు చెబుతున్నారు. సరైన చికిత్స చేయడంతోపాటు కౌన్సెలింగ్ ఇస్తే బాధితులు ఈ వ్యాధి నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే, మనీషా వైద్యం తీసుకోనట్టుగా తెలుస్తున్నది.
Also Read: Jagan Padayatra 2.O: మళ్లీ పాదయాత్ర చేయబోతున్న వైఎస్ జగన్.. 2017-18 మాదిరిగా గేమ్ ఛేంజర్ అవుతుందా?
