Warangal Crime: భార్య, భర్తలు అన్నాక చిన్న చిన్న మనస్ఫర్థలు సహజం. వివాదం మరింత ముదిరితే భార్యలు పుట్టింటికి వెళ్లిన ఘటనలు చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే ఓ మహిళ సైతం భర్తతో గొడవలు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లింది. తండ్రి, తల్లి సమక్షంలో కొన్నిరోజులుగా ప్రశాంతంగా జీవిస్తూ వస్తోంది. అయితే భార్య దూరంగా వెళ్లిపోవడాన్ని ఆ భర్త తట్టుకోలేకపోయాడు. కత్తితో భార్య పుట్టింటికి వెళ్లాడు. ఆ తర్వాత పుట్టింటి వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటన రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణలోని వరంగల్ నగరంలో మంగళవారం అర్ధరాత్రి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మామా అల్లుళ్లు కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ నయీం నగర్ కు చెందిన ఆకేటి అనిల్ రెడ్డి (Aketi Anil Reddy).. రామన్నపేట (Ramannapeta)కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక మగ బిడ్డ, ఒక ఆడపిల్ల జన్మించారు. కొన్నేళ్ల పాటు ఎంతో హాయిగా సాగిన వీరి సంసారంలో వివాదాలు చిచ్చుపెట్టాయి. కాపురం గొడవల మయం కావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
మామపై కత్తితో దాడి..
కొద్ది రోజులుగా భార్య పుట్టింటిలోనే ఉండటాన్ని భర్త అనిల్ తట్టుకోలేకపోయాడు. భార్యను తిరిగి కాపురానికి పంపాలని మామ ప్రభాకర్ కు సూచించాడు. కానీ అటు నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో సోమవారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించిన అనిల్.. మామ ఇంటికి వెళ్లాడు. తన వెంట తీసుకొచ్చిన కత్తితో వీరంగం సృష్టించాడు. మామ ప్రభాకర్ తో మాటా మాటా పెరగడంతో కత్తితో ఒక్కసారిగా అనిల్ దాడి చేశాడు. విచక్షణా రహితంగా మామను పొడిచాడు.
కత్తి లాక్కొని మామ కూడా..
అయితే అల్లుడు కత్తితో పొడుస్తున్న క్రమంలోనే మామ కూడా అప్రమత్తమయ్యాడు. అతడి చేతిలోని కత్తిని బలవంతంగా లాక్కొని ఎదురు దాడికి దిగాడు. అనిల్ ను కూడా కత్తితో పలుమార్లు పొడిచాడు. ఇదంతా చూసిన స్థానికులు, బంధువులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇద్దరు కత్తులతో పొడుచుకొని కుప్పకూలడంతో స్థానిక ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. వెంటనే హైదరాబాద్ నిమ్స్ కు రిఫర్ చేశారు.
Also Read: Mahabubabad Crime: తల్లితో అక్రమ సంబంధం.. కూతురుపై అత్యాచారం.. బయ్యారంలో షాకింగ్ ఘటన
రంగంలోకి పోలీసులు..
స్థానికులు ఇచ్చిన సమాచారంతో వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్, ఎస్సై సాంబయ్య ఘటనా స్థలిని పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మామ అల్లుడి పరిస్థితి క్రిటికల్ గా ఉన్నందున వారు కోలుకునే దానిని బట్టి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు. మెుత్తంగా మామ- అల్లుడు ఒకరినొకరు దారుణంగా పొడుచుకున్న ఘటనతో వరంగల్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పవచ్చు.
