Mahabubabad Crime: అప్పు అడిగితే ఏకంగా హత్య చేసి కక్ష తీర్చుకున్నారు. ముందస్తు పథకం ప్రకారమే భద్రును హత్య చేసి అప్పు అడగకుండా తొలగించుకోవాలనుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ శివారు చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కెనాల్ కాల్వ వద్ద చోటుచేసుకుంది. సీఐ సూర్య ప్రకాష్ తెలిపిన వివరాలు ప్రకారం గుండెంగ గ్రామం పంతుల్య తండాకు చెందిన తేజావత్ భద్రు అదే తండాకు చెందిన తేజావత్ వీరేందర్ కు రూ. 50,000 అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం తర్వాత తనకు అవసరం ఉందని వీరేందర్‌ను డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతాడు. ఈ క్రమంలోనే భద్రు అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని వీరేందర్ పై ఒత్తిడి తీసుకొస్తాడు.
అంతేకాకుండా వీరేందర్ చెల్లి పెళ్లికి పొలం అమ్మాలనుకున్న సమయంలో గెట్టుకు పక్కనే ఉన్న భద్రు వీరేందర్‌కు సంబంధించిన గుంటన్నర వ్యవసాయ భూమి దున్నుకోవడంతో భద్రుపై వీరేందర్ కక్ష పెంచుకున్నాడు. వీరేందర్‌కు సమీప బంధువైన తేజావత్ సురేష్ తో చెప్పగా, అంతకుముందు సురేష్ ను సైతం భద్రు పొలం గెట్టు పంచాయతీకి సంబంధించి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వీరందర్, సురేష్ లు భద్రు ఎలాగైనా హత్య చేయాలని పథకం వేసుకున్నారు. దీంతో సురేష్ మర్డర్ కోసం తేజవత్ కిషన్, బాదావత్ ఈర్యలతో కలిసి మందు పార్టీ చేసుకునేలా సూచిస్తాడు. గుండెంగ గ్రామ శివారు ఎస్సారెస్పీ కెనాల్ వద్ద కల్వర్టు మీద కూర్చొని భద్రు, కిషన్, ఈర్య లు మద్యం సేవిస్తారు.
ఆ తర్వాత సురేష్ భద్రు హత్య చేసేందుకు సరైన సమయమని వీరేందర్ కు సూచిస్తాడు. కెనాల్ కల్వర్టు వద్ద కూర్చొని మద్యం సేవిస్తున్న భద్రును వెనుక నుంచి టవల్తో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి వీరేందర్ హత్య చేస్తాడు. హత్య అనంతరం కిషన్, వీరేందర్ ఇద్దరూ కలిసి నక్కలగుట్ట బోర్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడేసి, ద్విచక్ర వాహనాన్ని అక్కడికి సమీపంలో ఉన్న టెంపుల్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. కాగా, భద్రు భార్య నీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన గూడూరు పోలీసులు వీరేందర్, కిషన్, సురేష్, ఈర్యలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఉన్నట్లు గూడూరు సీఐ సూర్యప్రకాష్ తెలిపారు.
Also Read: Kumari Aunty: మీకో దండంరా బాబు.. నన్ను వదిలేయండి.. మొత్తం మీరే చేశారంటున్న కుమారి ఆంటీ