Man Kills Wife: వివాహేతర సంబంధాలు.. పచ్చటి కాపురాల్లో చిచ్చులు పెడుతున్నాయి. భార్య, భర్తలను ఒకరికొకరు శత్రువులుగా మార్చేస్తున్నాయి. ఫలితంగా జీవితాంతం కలిసి ఉండాల్సిన దంపతులు.. ఒకరినొకరు దారుణంగా చంపుకుంటున్నారు. తాజాగా తమిళనాడులోనూ ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన భార్య తలను.. ఓ భర్త తెగ నరికాడు. ప్రియుడ్ని సైతం అదే విధంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడు కల్లకురిచ్చి జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర హత్య జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. కోలంజి (48) వృత్తి రిత్యా కట్టెలు నరికి అమ్ముకునే కార్మికుడు. అయితే భార్య లక్ష్మి (37) పై గత కొంతకాలంగా అనుమానం పెట్టుకున్నాడు. ఆమెకు తంగరాసు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు కోలంజి నమ్ముతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తాను పనిమీద బయటకు వెళ్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.
కట్టెలు నరికే కత్తితో..
అయితే కొద్దిసేపటి తర్వాత తిరిగి ఇంటికొచ్చిన కోలంజికి.. టెర్రస్ పై భార్య, ఆమె ప్రియుడు కనిపించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు.. ఇద్దరిపై దాడి చేసి హతమార్చాడు. తర్వాత కట్టెలు నరికే ఆయుధంతో శరీరం నుంచి వారి తలలను వేరు చేశాడు. వాటిని బండికి కట్టుకొని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
బైక్‌కు తలలు కట్టుకెళ్లి..
హత్య అనంతరం తలలతో నేరుగా వెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు కోలంజి వెళ్లాడు. జరిగినదంతా వారికి చెప్పి లొంగిపోయాడు. దీంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన వంజారం పోలీసులు.. కోలంజి ఇంటికి వెళ్లి రక్తపు మడుగులో ఉన్న బాడీలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే కోలంజి, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం వారు బంధువుల సంరక్షణలోకి వెళ్లారు.
Also Read: Asia Cup 2025: భారత్ – పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?
బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే..
ఈ ఏడాది జూన్ లో బెంగళూరులోనూ ఇలాంటి విషాదకర ఘటనే చోటుచేసుకుంది. హోనగర్ లో నివసించే శంకర్ (28) అనే వ్యక్తి.. భార్య తలను తెగ నరికాడు. ఆపై సూర్య నగర్ పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసుల సమాచారం ప్రకారం జూన్ 3 రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన శంకర్.. భార్యను మరో వ్యక్తితో చూశాడు. ఆగ్రహంతో ఆమెపై దాడి చేసి తల నరికేశాడు. అనంతరం దానిని బైక్ పై తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.