Crime News: పక్కగా సేకరించిన సమాచారంతో సూరారం పోలీసుల డ్రగ్ పెడ్లర్లతోపాటు వాటిని వినియోగిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 45గ్రాముల బ్రౌన్ ఎండీఎంఏ, 6గ్రాముల వైట్ ఎండీఎంఏ డ్రగ్ తోపాటు 13గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్(DCP Koti Reddy)డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఓల్డ్ బోయిన్ పల్లి వాస్తవ్యుడైన రంజిత్ కుమార్ (30) బేగంపేటలోని ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి. జీతం తక్కువగా ఉండటంతో రంజిత్ కుమార్ డ్రగ్స్ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు.
మాదక ద్రవ్యాల దందా..
ఈ క్రమంలో తన స్నేహితుల ద్వారా బెంగళూరు(Benguluru)లో ఉంటూ డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న అశ్విన్ తో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఆ తరువాత తన స్నేహితులైన నితీష్ కుమార్ యాదవ్(Yadav), నవీన్ కుమార్(Naveen Kumar) లతో కలిసి మాదక ద్రవ్యాల దందా మొదలు పెట్టాడు. ఇటీవల ముగ్గరు కలిసి ఎండీఎంఏ, గంజాయి కావాలని అశ్విన్ తో చెప్పారు. ఆ తరువాత నితీష్ కుమార్ తన అకౌంట్ నుంచి 48వేల రూపాయలను అశ్విన్ ఖాతాకు బదిలీ చేశాడు. సరుకు సిద్ధంగా ఉందని అతను చెప్పగా బెంగళూరు వెళ్లి ఎండీఎంఏ డ్రగ్ తోపాటు గంజాయి తీసుకుని హైదరాబాద్ వచ్చారు. వీటిని డెలివరీ చేయటానికి ఇద్దరు రెండు కార్లలో సూరారంలోని గాయత్రీ రెసిడెన్సీ వద్దకు రాగా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.
రెండు కార్లు, 8 మొబైల్ ఫోన్లు
విచారణలో నితీష్ కుమార్, నవీన్ కుమార్ లు వెల్లడించిన వివరాల ఆధారంగా రంజిత్ కుమార్ ను కూడా అరెస్ట్ చేశారు. వీరి నుంచి రెగ్యులర్ గా డ్రగ్స్ కొంటున్న గాయత్రీ రెసిడెన్సీ నివాసి మహ్మద్ షారూఖ్, నాగిరెడ్డి వెంకట శశిధర్ రెడ్డి, కుంచాల శివబ్రహ్మ, కరిమెరక సాయికుమార్, మేదరమెట్ల లక్ష్మీనందినిలను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మాదక ద్రవ్యాలతోపాటు రెండు కార్లు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 12.20లక్షలు ఉంటుందని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. డ్రగ్స్ దందా చేస్తున్న వారితోపాటు వినియోగదారులను పట్టుకున్న సూరారం స్టేషన్ డీఐ బాల్ రెడ్డి, ఎస్ఐ మురళీ గౌడ్ తోపాటు సిబ్బందిని అభినందించారు.
Also Read: Sangareddy: ఆసుపత్రికి బయలుదేరిన పెద్దాయన.. మధ్యలోనే అనూహ్య రీతిలో మృత్యువు

