Sangareddy: ఆసుపత్రికి బయలుదేరితే.. మార్చురీకి చేర్చాల్సి వచ్చింది
కోతులు ఆడ్డురావడంతో చెరువులోకి దూసుకెళ్లిన ఆటో
నీట మునిగి వృద్ధుడి మృతి
అందోలు మండలం అన్నాసాగర్ చెరువు వద్ద విషాద ఘటన
జోగిపేట, స్వేచ్ఛ: అనారోగ్యంతో ఆసుపత్రికి బయలుదేరిన ఓ పెద్దాయనను విధిరాత మరోలా పలకరించింది. ఇంటి నుంచి బయలుదేరిన ఆయన ఓ ఆటోలో ప్రయాణిస్తుండగా, మార్గమధ్యంలో ప్రమాదం జరిగింది. దీంతో, ఆయన వైద్యానికి వెళ్లాల్సిన అదే ఆసుపత్రిలోని మార్చురీ గదికి చేర్చాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన శనివారం సంగారెడ్డి జిల్లా (Sangareddy) అందోలు మండలం అన్నాసాగర్ వద్ద జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి మహేష్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు (Viral News) ఈ విధంగా ఉన్నాయి.
పెద్ద శంకరంపేట మండలం జంబికుంట గ్రామానికి చెందిన మామిడి విజయరావు (54) గత కొంత కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో జోగిపేట ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకునేందుకు మేనల్లుడు మామిడి మహేష్ ఆటోలో బయలుదేరాడు. దానంపల్లి గ్రామం దాటిన తర్వాత అన్నాసాగర్ కట్టపైకి ఆటో చేరుకోగానే కోతుల గుంపు ఒక్కసారిగా ఆటో ముందుకు వచ్చేశాయి. దీంతో అదుపుతప్పిన ఆటో చెరువు కట్టలోకి దూసుకుపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న విజయరావు నీటిలో మునిగిపోయాడు. ఆటో డ్రైవర్ మహేష్ క్షేమంగా బయటపడగా తన మామ కనిపించకపోయే సరికి నీటిలో వెతికాడు. దారిన వెళుతున్న వారు సైతం సహకరించి నీట మునిగిన విజయరావును ఒడ్డుకు చేర్చారు. మింగిన నీళ్లను బయటకు కక్కించేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఆ పెద్దాయన మృతి చెందాడు. సమాచారం అందుకున్న జోగిపేట ఎస్‌ఐ పాండు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్‌లో ఆసుపత్రిలోని మార్చూరీ గదికి డెడ్‌బాడీని తరలించారు.
మృతుడు విజయరావుకు మహేష్ మేనల్లుడు కావడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవాలు చెప్పాలని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిందా?, లేక ఉద్దేశపూర్వకంగా చేశావా? అని వివరాలు సేకరించారు. కోతులు ఆడ్డు రావడంతోనే జరిగినట్లుగా తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

