Srushti Baby
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Srushti Fertility Centre: టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Srushti Fertility Centre: యూనివర్సల్ సృష్టి ఫర్టిలరీ సెంటర్ కేసులో దిగ్భ్రాంతికర వివరాలు వెలుగు చూశాయి. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత సంతాన సాఫల్య కేంద్రం పేరిట చైల్డ్ ట్రాఫికింగ్ నడుపుతున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఏజెంట్ల ద్వారా శిశువులను కొనటం, సరోగసీ ద్వారా పుట్టారంటూ బిడ్డల కోసం తనను ఆశ్రయించిన వారికి అమ్మటం చేస్తోందని తేలింది. ఎవరైనా ఎదురు ప్రశ్నించటానికి ప్రయత్నిస్తే వృత్తిరీత్యా న్యాయవాది అయిన తన కొడుకుతో బెదిరింపులకు గురి చేసేదని వెల్లడైంది. ఉత్తర మండలం డీసీపీ డాక్టర్ రష్​మీ పెరుమాళ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్, గోపాలపురం ఏసీపీ సుబ్బారావుతో కలిసి వివరాలు వెల్లడించారు. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగక పోతుండటంతో రాజస్తాన్‌కు చెందిన దంపతులు గోవింద్ సింగ్, సోనియాలు ఆన్‌లైన్‌లో సంతాన సాఫల్య కేంద్రాల కోసం సెర్చ్ చేశారు. ఈ క్రమంలో వారికి సృష్టి టెస్ట్ ట్యూబ్​బేబీ సెంటర్ గురించి తెలిసింది. దాంతో 2024, ఆగస్టులో నగరానికి వచ్చి డాక్టర్ నమ్రతను కలిసిన భార్యాభర్తలు తమ మనోవేదన గురించి చెప్పుకొన్నారు. తమకు బిడ్డ పుట్టేలా చూడాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో డాక్టర్ నమ్రత వారిద్దరికీ పరీక్షలు జరిపించింది. నిజానికి సరోగసీ అవసరం లేకుండానే గోవింద్ సింగ్ దంపతులకు పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా ఆ విషయాన్ని దాచి పెట్టింది. పరీక్షల ఫలితాలు చూసిన తరువాత సరోగసీ ద్వారానే మీరు బిడ్డకు జన్మనిచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. దీని కోసం గోవింగ్ సింగ్ వీర్యం సేకరించి సరోగసీకి ఒప్పుకున్న మహిళ గర్భంలో దానిని ప్రవేశపెట్టి బిడ్డకు జన్మనిచ్చేలా చూస్తామని తెలిపింది. దీనికి రూ.30 లక్షలు ఖర్చవుతాయని చెప్పింది. నేరుగా జన్మనిచ్చే అవకాశం లేదని డాక్టర్ నమ్రత చెప్పటంతో సరోగసీ ద్వారా బిడ్డను కనడానికి గోవింద్ సింగ్ దంపతులు అంగీకరించారు.

విశాఖలోని మరో బ్రాంచ్‌కు..

ఈ క్రమంలో డాక్టర్ నమ్రత భార్యాభర్తలు ఇద్దరిని విశాఖపట్టణంలోని తమ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు పంపించింది. అక్కడ గోవింద్ సింగ్ నుంచి వీర్యం సేకరించారు. దాని ద్వారా బిడ్డ పుట్టగానే సమాచారం ఇస్తామని చెప్పి వారిని వెనక్కి పంపించి వేశారు. అనంతరం సెప్టెంబర్‌లో గోవింద్ సింగ్ దంపతులకు ఫోన్​చేసి సరోగసీని విజయవంతంగా మొదలు పెట్టినట్టు సమాచారం ఇచ్చారు. గత జూన్‌లో బిడ్డ పుట్టిందని చెప్పి విశాఖకు పిలిపించారు. అక్కడ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న కళ్యాణి వారికి ఓ మగబిడ్డను ఇచ్చింది. సరోగసీ ద్వారా పుట్టిన మీ కుమారుడని చెప్పింది. ఈలోపే డాక్టర్ నమ్రత వారి నుంచి వేర్వేర9 విడతలుగా 30లక్షల రూపాయలు తీసేసుకోవటం గమనార్హం. కాగా, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గోవింద్ సింగ్ దంపతులు పుట్టిన శిశువుకు డీఎన్ఏ పరీక్షలు చేయాలని అడగ్గా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులు దానికి అంగీకరించలేదు. దీని గురించి డాక్టర్ నమ్రతతో మాట్లాడినా డీఎన్ఏ పరీక్షలకు ఒప్పుకోలేదు. అప్పగించిన శిశువుకు తమ ఇద్దరిలో ఏ ఒక్కరి పోలికలు లేకపోవటం, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలియడంతో ఆ దంపతులు ఢిల్లీకి వెళ్లి అక్కడ డీఎన్ఏ పరీక్షలు జరిపించారు. అక్కడ తమకు ఇచ్చిన మగశిశువు గోవింద్ సింగ్ వీర్యం నుంచి పుట్టలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో గోవింద్ సింగ్ దంపతులు ఈ విషయమై సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ప్రతినిధులతో మాట్లాడగా సరైన సమాధానం రాలేదు. పైగా, పోలీసుల వద్దకు వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ డాక్టర్ నమ్రత కొడుకు, న్యాయవాది జయంత్ కృష్ణ వారిని బెదిరించాడు.

Read Also- Acne Itching: మెుటిమలను లైట్ తీసుకుంటున్నారా.. డేంజర్‌లో పడ్డట్లే..!

పోలీసులకు ఫిర్యాదు

గోవింద్ సింగ్ దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. డాక్టర్ నమ్రత చట్ట విరుద్ధంగా సంతాన సాఫల్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టుగా వెల్లడైంది. డాక్టర్ సూరి శ్రీమతి పేర లెటర్ హెడ్స్ తయారు చేయించి హైదరాబాద్‌తోపాటు విజయవాడ, విశాఖపట్టణం, కొండాపూర్‌లలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బ్రాంచీలను ఏర్పాటు చేసుకుని అక్రమ దందాను కొనసాగిస్తున్నట్టుగా తేలింది. పేదరికంలో మగ్గుతున్న, అబార్షన్లు చేయించుకోవాలనుకుంటున్న వారికి డబ్బు ఎరవేసి నమ్రత అక్రమ కార్యకలాపాలు సాగిస్తూ వచ్చినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఏజెంట్ల ద్వారా ఇలాంటి వారిని గుర్తించి లక్ష రూపాయల వరకు ఇచ్చి వారికి పుట్టిన పిల్లలను తీసుకునేదని తేలింది. ఆ తర్వాత పిల్లల కోసం తన వద్దకు వచ్చిన వారికి సరోగసీ ద్వారా పుట్టారంటూ ఆ శిశువులను అప్పగిస్తూ వస్తోందని నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్‌లో ఉంటున్న దంపతులు మహ్మద్ అలీ ఆదిక్, నస్రీన్​ బేగంలకు ఇలాగే డబ్బులిచ్చి వారికి పుట్టిన మగ శిశువును తీసుకుని గోవింద్ సింగ్ దంపతులకు ఇచ్చినట్టుగా స్పష్టమైంది. విచారణలో వెల్లడైన ఈ వివరాలతో డీసీపీ డాక్టర్ రష్మీ పెరుమాళ్ గోపాలపురం ఏసీపీ సుబ్బారావు పర్యవేక్షణలో వెంకటేశ్, బేగంపేట డీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు రామకృష్ణ, మాధవి, జ్ఞాన్ దీప్‌లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బృందంలోని అధికారులు శనివారం రాత్రి హైదరాబాద్‌తో పాటు విశాఖపట్టణం, విజయవాడలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లపై ఏకకాలంలో దాడులు జరిపారు.

అరెస్టులు 50 దాటొచ్చు!

ఈ క్రమంలో డాక్టర్ నమ్రతతోపాటు ఆమె కుమారుడు జయంత్ కృష్ణను అరెస్ట్ చేశారు. ఇక, విశాఖపట్టణం బ్రాంచ్ మేనేజర్‌గా పని చేస్తున్న కళ్యాణి అచ్చాయమ్మ (40), ల్యాబ్ టెక్నీషియన్ గొల్లమందల చెన్నారావు (37), గాంధీ ఆస్పత్రిలో అనస్తీషియా స్పెషలిస్టుగా పని చేస్తున్న డాక్టర్ నరుగుల సదానందం (41), అస్సాంకు చెందిన ధనశ్రీ సంతోషి (38), మహ్మద్ అలీ ఆదిక్ (38), అతని భార్య నస్రీన్ బేగం (25)లను అరెస్ట్ చేశారు. నిందితులను జడ్జి నివాసంలో హాజరు పరిచి జైలుకు రిమాండ్ చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుందని డీసీపీ డాక్టర్ రష్మీ పెరుమాళ్ మీడియాకు వెల్లడించారు. ఏజెంట్లను పెట్టుకుని నమ్రత ఈ వ్యవహారాన్ని నడిపించిన నేపథ్యంలో వారిని గుర్తించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే సమయంలో నమ్రత ఎవరెవరి నుంచి పిల్లలను కొన్నదన్న వివరాలను కూడా తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ క్రమంలో నిందితుల సంఖ్య 50 దాటవచ్చని చెప్పారు. డాక్టర్ నమ్రత బాధితులు ఎవరైనా ఉంటే గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Read Also- Harihara Veeramallu: ఇదేదో ముందే చేస్తే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది కదా.. నిర్మాత పైన పవన్ ఫ్యాన్స్ ఫైర్

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు