Crime News: ప్రేమ.. ఓ ప్రాణాన్ని నిలబెడుతుంది, అదే ప్రేమ.. మరో ప్రాణాన్ని తీస్తుంది. సరిగ్గా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో అదే జరిగింది. తమ్ముడు చేసిన ప్రేమకు, కులాంతర సంబంధానికి కోపోద్రిక్తులైన యువతి కుటుంబ సభ్యులు నిరపరాధి అయిన అన్న ప్రాణాన్ని తీశారు. దారుణంగా కొట్టి, పెట్రోల్‌తో తగలబెట్టి చేసిన ఈ పరువు హత్య స్థానికంగా భయాందోళనలు సృష్టించింది. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ ఈ ఘాతుకానికి బలయ్యాడు. తమ్ముడు చంద్రశేఖర్ పది రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన యువతితో పారిపోవడంతో, యువతి తండ్రి ఈ కక్ష సాధింపు చర్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ హత్య వివరాలు తాజాగా వెలుగులోకి రావడంతో, పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కక్ష పెంచుకుని..
ఈ నెల 12న మాట్లాడుకుందామని చెప్పి, యువతి తండ్రి రాజశేఖర్‌ను గ్రామ శివారు ప్రాంతానికి రమ్మన్నాడు. రాజశేఖర్ అక్కడికి వెళ్లగా, అప్పటికే అక్కడ యువతి తండ్రి, మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వచ్చీరాగానే ఆ నలుగురు కలిసి రాజశేఖర్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని నవాబ్‌పేట మండలం ఎన్మనగండ్ల గేటు వద్దకు తీసుకెళ్లారు. నిర్జన ప్రదేశంలో పెట్రోల్ చల్లి నిప్పంటించి దగ్ధం చేశారు. రాజశేఖర్ కనిపించకుండా పోవడంతో అతని కుటుంబ సభ్యులు షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తండ్రి, వారి బంధువులపై అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు రాజశేఖర్ మృతదేహం నవాబ్‌పేట స్టేషన్ పరిధిలో దొరకటంతో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. తాజాగా హత్యకు గురైంది రాజశేఖర్ అని నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో దర్యాప్తును ముమ్మరం చేసిన షాద్‌నగర్ పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడ్డ నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు.
Also Read: Nowgam Blast: నౌగాం ఘటనపై అధికారుల క్లారిటీ.. ఎంత మంది ప్రాణాలు కోల్పోయారంటే?
హృదయ విదారకం
స్వేచ్ఛ-బిగ్ టీవీతో మృతుడు రాజశేఖర్ భార్య వాణి, అన్న శివప్రసాద్ మాట్లాడారు. తన భర్తను అన్యాయంగా చంపేశారని భార్య వాణి కన్నీటిపర్యంతమయ్యారు. ‘నా భర్త నన్ను దేవతలా చూసుకున్నాడు. ఈ లోకంలో నాకు నా భర్త తప్ప ఎవరూ లేరు. ఇప్పుడు నేను ఎలా బతకాలి? నాకు న్యాయం చేసే వారెవరు?’ అని వాణి ప్రశ్నించారు. మాట్లాడదామని బయటికి తీసుకువెళ్లి అత్యంత దారుణంగా చంపారని, తన తమ్ముడు చేసిన తప్పుకు నా భర్త బలి అయ్యాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘నిన్నటి వరకు నా భర్త చనిపోయాడని నాకు తెలియదు. గుర్తుతెలియని డెడ్ బాడీ ఉందని చెబితే వచ్చి చూశాను, అది నా భర్తే అని తెలిసింది’ అని వాణి కన్నీరుమున్నీరయ్యారు. ఈ నెల 12వ తేదీన తాను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. తన భర్త చావుకు ప్రధాన కారణం వెంకటేష్ వారి కుటుంబ సభ్యులేనని ఆమె ఆరోపించారు. గతంలో పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడినప్పటికీ అమ్మాయే తమ వాడికి ఫోన్ చేసిందని, అందుకే చంద్రశేఖర్ అమ్మాయితో కలిసి ఊరు విడిచిపెట్టి పోయాడని ఆమె వివరించారు. తన తమ్ముడికి సహాయం చేసి ఉంటాడని అనుమానంతో రాజశేఖర్‌ను దారుణంగా చంపారని, తన భర్తకు పట్టిన గతే వెంకటేష్‌కి పట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
దళిత సంఘాల నిరసన
రాజశేఖర్ హత్యకు నిరసనగా దళిత సంఘాల నేతలు షాద్‌నగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. 100కు కాల్ చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సంఘాల నేతలు ఆరోపించారు. దళితులంటే సమాజంలో చిన్న చూపు ఉందని, దళితుల చావులంటే లెక్క లేదన్నారు. రాజశేఖర్ చావులో పోలీసుల పాత్ర ఉందని, వారిపై కూడా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోషులను వెంటనే ఉరితీయాలని దళిత సంఘాల నేతలు కోరారు. ఒక రాజకీయ నాయకుడితో అగ్ర కులానికి చెందిన వాడైతే ఇలా ఉండేది కాదని వారు విమర్శించారు. చనిపోయిన రాజశేఖర్ కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.‘ప్రభాత భేరి’కి విశేష స్పందన
Also Read: ACB Raids: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు.. భారీగా నగదు, డాక్యుమెంట్ల స్వాధీనం
