Nalgonda Crime: నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. నోముల గ్రామంలో ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో నర్సింగ్ జానయ్య అనే వ్యక్తిని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. కళ్లల్లో కారం కొట్టి చిత్ర హింసలకు గురి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ జానయ్య.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఆస్పత్రికి తరలిస్తుండగా..
శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు నర్సింగ్ జానయ్య బంధువులు తెలిపారు. జానయ్యకు చెట్టుకు కట్టేసి కొడుతుండగా తెలిసిన వ్యక్తి చూసి ఫోన్ చేశాడని ఆయన తెలిపారు. దీంతో హుటా హుటీనా నోముల గ్రామానికి చేరుకొని జానయ్య కట్టు విప్పినట్లు పేర్కొన్నారు. తీవ్ర గాయాల పాలైన అతడ్ని.. నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డబ్బుకోసం దగ్గరైన మహిళ?
వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తన భర్తతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు జానయ్య బంధువులు ఆరోపిస్తున్నారు. జానయ్య గతంలో రియల్ స్టేట్ చేసేవాడని.. ఆయన వద్ద డబ్బు బాగా ఉండటం చూసిన సదరు మహిళ దగ్గరైందని వారు తెలిపారు. జానయ్య పేరు మీద ఉన్న ఇంటిని కూడా తన సొంతం చేసుకోవాలని ఆమె కుట్ర పన్నిందని చెప్పారు. అది వీలుకాకపోవడంతో పాటు గత కొద్ది రోజులుగా జానయ్య దగ్గర డబ్బులేకపోవడంతో ఆమె అతడ్ని దూరం పెట్టిందని పేర్కొన్నారు.
భర్తతో కలిసి మహిళ దాడి!
అయితే తనను అకారణంగా ఎందుకు దూరం పెడుతున్నావని పలుమార్లు జానయ్య ఆమెను ప్రశ్నించినట్లు బంధువులు చెబుతున్నారు. దీంతో జానయ్యను అడ్డుతప్పించాలని ఆమె, ఆమె భర్త ప్లాన్ వేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం జానయ్యను ఆమె ఇంటికి పిలిచిందని.. వచ్చిన వెంటనే చెట్టుకు కట్టేసి చితకబాదారని పేర్కొన్నారు. దెబ్బలు తాళలేక అతడు మరణించాడని చెప్పారు.
Also Read: Special Railway Stations: దేశంలో టాప్-7 రైల్వే స్టేషన్లు.. వీటి ప్రత్యేకతలు తెలిస్తే మతిపోవాల్సిందే!
రంగంలోకి పోలీసులు
జానయ్య బంధువులు ఇచ్చిన ఫిర్యాదులో నల్లగొండ పోలీసులు రంగంలోకి దిగారు. పోస్ట్ మార్టం నిమిత్తం.. జానయ్య మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.